ఆనంద్‌కు ఆఖరి అవకాశం
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు ముందు ఫేవరెట్‌గా భావించిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు... టోర్నీలో ముందుకెళ్లే కొద్దీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా... కార్ల్‌సెన్ (నార్వే) దూకుడుకు సరైన అడ్డుకట్ట వేయలేక వెనుకబడిపోయాడు. ఇప్పటి వరకు జరిగిన 8 గేమ్‌ల్లో విషీ ఆరు గేమ్‌లు డ్రా చేసుకోగా... రెండింటిలో ఓడిపోయాడు. దీంతో టోర్నీలో 3-5 తేడాతో ఎదురీదుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్ల్‌సెన్‌తో నేడు (గురువారం) జరగబోయే తొమ్మిదో గేమ్ ఆనంద్‌కు అత్యంత కీలకమైంది. తెల్లపావులతో ఆడనున్న అతను టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ గేమ్‌లో తప్పనిసరిగా గెలిచి తీరాలి.
దీంతో అతనిపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇలాంటివి తన అనుభవంలో ఎన్నో చూసిన ఆనంద్ పుంజుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరం. అలుపెరగకుండా పోరాడటంలో ఆనంద్ దిట్టే అయినా... ఓపెనింగ్‌తోనే కార్ల్‌సెన్ గేమ్‌పై పట్టు బిగిస్తున్నాడు. ఇది భారత్ ఆటగాడికి చాలా ఆందోళన కలిగించే అంశం. తొమ్మిదో గేమ్‌లో గెలవకపోతే ఇక తెల్లపావులతో ఆడే అవకాశం ఆనంద్‌కు 11వ గేమ్‌లో వస్తుంది. అప్పుడు గెలిచినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు.