vishwananth anand
-
ఆనంద్ రెండో గేమ్ డ్రా
బాడెన్-బాడెన్ (జర్మనీ): వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్... గ్రీంకి చెస్ క్లాసిక్ టోర్నీలో వరుసగా రెండో డ్రాతో సరిపెట్టుకున్నాడు. అర్కాడిజ్ నైడిశ్చ్ (జర్మనీ)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ 53 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ ఒక్క పాయింట్‌తో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే-1.5)... మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్-0.5)పై నెగ్గాడు. ప్రస్తుతం కార్ల్సన్ ఒకటిన్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
మరిన్ని టోర్నీలు ఆడతా
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండో ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన... ఆటకు స్వస్తి చెప్పాలనే ఆలోచన తనకేమాత్రం లేదని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పష్టం చేశాడు. తన కెరీర్లో ఇంకా గొప్ప ఫలితాలు రావాల్సి ఉన్నాయని... వచ్చే ఏడాది మరిన్ని టోర్నమెంట్లలో బరిలోకి దిగుతున్నానని ఈ ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ వెల్లడించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఆటతీరు భిన్నంగా ఉంటుందని... అతను ప్రాక్టీస్‌కంటే గేమ్‌లో అప్పటికపుడు వచ్చే ఆలోచనలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడని హైదరాబాద్‌లో శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఒకవైపు క్రీడాకారుడిగా కొనసాగుతూ... మరోవైపు శిక్షణ ఇవ్వడం అనేది కష్టంతో కూడుకున్న పని అని తెలిపాడు. రిటైరయ్యాకే శిక్షణ ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తానని అన్నాడు. తమ ఆటలోని లోపాలను సరిదిద్దుకునేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకోవడం మంచిదే అని 45 ఏళ్ల ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరి నుంచైనా అత్యుత్తమ శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నిస్తే తప్పులేదని... విద్యావిధానంలో చెస్‌ను పాఠ్యాంశంగా చేర్చితే మంచిదే అని ఆనంద్ తెలిపాడు. -
ప్రతీకారం తీర్చుకుంటా
కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌పై ఆనంద్ న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ కిరీటాన్ని గత ఏడాది మాగ్నస్ కార్ల్‌సెన్‌తో చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. ఈ ఏడాది అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని, తిరిగి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంటానని చెబుతున్నాడు. కార్ల్సెన్ చేతిలో ఓటమి తరువాత కొన్నాళ్లు చెస్‌కు దూరంగా ఉన్న ఆనంద్ ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో విజయం తనకు ఆక్సిజన్ వంటిదని, ఈ ఉత్సాహంతో కార్ల్‌సెన్‌తో నవంబర్‌లో జరగనున్న పోరుకు సిద్ధమవుతున్నానని ఆనంద్ తెలిపాడు. ‘క్యాండిడేట్స్ టోర్నీలో విజయం నాలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత కల్పించడంతోపాటు పోటీకి అవసరమైన ఆక్సిజన్‌ను ఇచ్చింది. క్రితం సారి చేసిన పొరపాట్లకు తావివ్వకుండా ఈసారి భిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతా’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్ అన్నాడు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌పైనే దృష్టి!
కొత్త వ్యూహాలకు ఆనంద్ పదును చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో టైటిల్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనపై గెలిచిన మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)ను ఓడించే అన్వేషణలో పడ్డాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌లో తిరిగి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఆనంద్ ఉన్నాడు. ‘నా ఆలోచననలకు పదునుపెట్టే పని ఇప్పటికే మొదలైంది. ఏం చేయాలి... ఎలా ముందడుగు వేయాలనే ప్రాథమిక అంశాలపై ఇది వరకే కసరత్తు చేశాను. రాబోయే నెలల్లో వీటిపైనే నా దృష్టి ఉంటుంది. ఈ నెల కాస్త విరామం ఇచ్చినా, ఆలోచనలకు మాత్రం విశ్రాంతి లేదు’ అని అన్నాడు. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ తిరిగి కిరీటం చేజిక్కించుకునే వ్యూహాలు పన్నుతున్నాడు. ‘నన్ను కంగుతినిపించిన కార్ల్‌సెన్‌తో పోరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో కూడా తెలుసు... కానీ అవన్నీ ఇప్పుడే బహిర్గతం చేయలేను. అనుకున్నది సాధించేందుకు ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తాను’ అని 44 ఏళ్ల ఆనంద్ చెప్పాడు. టోర్నీలో కావాల్సిందల్లా ఉత్సాహపరిచే విజయాలేనన్నాడు. అది ఆరంభ రౌండ్లలో లభిస్తే తిరుగు ఉండదని అతను అభిప్రాయపడ్డాడు. ఇప్పటి తన జోరు ప్రత్యర్థుల్ని ఒత్తిడిలోకి నెడుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘ఇప్పుడే ఎలా చెబుతాం. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు జరిగే టోర్నీల్లో ముందు గాడిన పడాలి. ప్రత్యర్థుల్ని ఓడించాలి. అప్పుడే ఒత్తిడిని పెంచగలం’ అని ఆనంద్ అన్నాడు. సందీపన్ చందాతో తిరిగి జతకడతానని చెప్పాడు. నార్వేలో అతనితో పనిచేశానని... చక్కని వ్యూహాలను రూపొందించడంలో చందా సిద్ధహస్తుడని చెప్పాడు. -
ఆనంద్‌కు మరో ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో ‘డ్రా’ నమోదు చేశాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో బుధవారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ రౌండ్ తర్వాత ఆనంద్ ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఆంద్రికిన్ (రష్యా)-మమెదైరోవ్ (అజర్బైజాన్) గేమ్ 46 ఎత్తుల్లో; పీటర్ స్విద్లెర్ (రష్యా)-అరోనియన్ (అర్మేనియా) గేమ్ 33 ఎత్తుల్లో; తొపలోవ్ (బల్గేరియా)-కర్జాకిన్ (రష్యా) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. -
ఆనంద్‌కు మూడో విజయం
ఖాంటీ మాన్సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ‘డ్రా’ల పరంపరకు తెరదించాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. ఇతర తొమ్మిదో రౌండ్ గేముల్లో కర్జాకిన్ (రష్యా) 64 ఎత్తుల్లో క్రామ్నిక్ (రష్యా)పై, మమెదైరోవ్ (అజర్బైజాన్) 44 ఎత్తుల్లో అరోనియన్ (అర్మేనియా)పై గెలుపొందగా... ఆంద్రికిన్ (రష్యా), స్విద్లెర్ (రష్యా)ల మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ఆనంద్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. -
ఆనంద్‌కు రెండో గెలుపు
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్(రష్యా): ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఈ భారత ఆటగాడు... షకిర్యార్ మమెద్యరోవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. రెండున్నర పాయింట్లతో ఆనంద్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మమెద్యరోవ్తో జరిగిన పోరులో నల్లపావులతో ఆడిన ఆనంద్ ఆరంభం నుంచి ఆటపై పట్టు సాధించాడు. దీంతో ముందడుగు వేయడానికి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లభించలేదు. 24వ ఎత్తుతో దాదాపు విజయం ఖాయంచేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ 31 ఎత్తుల్లోనే ఆట ముగించాడు. మిగతా పోటీల్లో వాసెలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో టాప్ సీడ్ లెవొన్ అరోనియన్ (అర్మేనియా), దిమిత్రి అండ్రెకిన్ (రష్యా)తో సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా) గేమ్‌లను డ్రా చేసుకున్నారు. -
ఆనంద్‌కు మూడో స్థానం
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో విశ్వనాథన్ ఆనంద్‌కు మరోసారి ఓటమి ఎదురైంది. జ్యూరిచ్ చెస్ క్లాసిక్‌లో భాగంగా గురువారం ఐదు రౌండ్ల పాటు జరిగిన బ్లిట్జ్ టోర్నీలో ఆనంద్ రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఆర్మేనియాకు చెందిన లెవోన్ అరోనియన్‌తో జరిగిన తొలి రౌండ్లో ఆనంద్ ఓడిపోగా, అనంతరం కరువానాను ఓడించాడు. ఆ తర్వాత నకమురాతో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకోగా, కార్ల్సన్తో 21వ ఎత్తు దగ్గర ఓడిపోయాడు. ఐదో రౌండ్లో గెల్ఫాండ్‌పై గెలిచాడు. అటు ప్రపంచ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన కార్ల్‌సన్‌కు తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. ఇటలీకి చెందిన కరువానా నల్ల పావులతో అతడిని మట్టికరిపించాడు. ఈ ఫలితాలతో క్లాసికల్ టోర్నీకి డ్రా కూడా ఖరారైంది. దీంట్లో ఆనంద్ మరోసారి తొలి రౌండ్లో ఆరోనియన్నే ఎదుర్కోనున్నాడు. చివరి రౌండ్లో కార్ల్సన్తో ఆడతాడు. ప్రపంచ అగ్రశ్రేణి పది మంది ఆటగాళ్లలో ఆరుగురి మధ్య ఐదు రౌండ్ల పాటు గేమ్స్ జరుగుతాయి. -
ఆనంద్ నిష్ర్కమణ
లండన్: ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నాడు. లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆనంద్ ఓటమిపాలయ్యాడు. దీంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. రష్యాకు చెందిన వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆనంద్ 0.5-1.5 తేడాతో పరాజయం చెందాడు. తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడుతూ 27 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్వార్టర్స్ వరకు ఆనంద్ ఆటతీరు మెరుగ్గానే సాగినా కీలకమైన తరుణంలో తడబడ్డాడు. సెమీఫైనల్లో క్రామ్నిక్.. నకమురాతో, గెల్ఫాండ్.. ఆడమ్స్‌తో తలపడనున్నారు. -
28వ ఎత్తుతో భారీ తప్పిదం
చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఆనంద్ 1.డీ4తో ఓపెనింగ్‌ను మార్చాడు. దీంతో గేమ్ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. అతని బాడీ లాంగ్వేజిలోనూ అది స్పష్టంగా కనిపించింది. తన ఎత్తులన్నీ చాలా నమ్మకంతో వేగంగా వేశాడు. మరోవైపు కార్ల్సెన్ తన ప్రతి ఎత్తుకూ చాలా సమయం తీసుకున్నాడు. ఈ గేమ్‌లో 23వ ఎత్తు చాలా క్లిష్టమైంది. ఈ స్థితిలో తెల్లపావులతో ఆశ్చర్యకరమైన ఎత్తులు వేసే అవకాశం ఉండటంతో ఆనంద్ చాలా సమయాన్ని తీసుకున్నాడు. క్యూఎఫ్4తో ఆశ్చర్యకరమైన ఎత్తూ వేశాడు. ఇది మంచి ఆలోచన. తను వేసిన 28.ఎన్ఎఫ్1 ఎత్తుకు కార్ల్సెన్ ఇచ్చిన ప్రతి స్పందనను గుర్తించలేకపోవడం ఆనంద్ దురదృష్టం. 28వ ఎత్తు తర్వాత క్యూఈ1తో కార్ల్సెన్ గేమ్‌ను ముగించాడు. దీని తర్వాత తెల్లపావులతో ఆడేవారికి ఎక్కువ అవకాశం లేకుండా బ్లాక్స్‌తో కట్టిపడేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆనంద్ గేమ్ నుంచి తప్పుకున్నాడు. 9వ గేమ్‌లో విషీ గెలిచి ఉంటే టోర్నీలో అతని ఆశలు సజీవంగా ఉండేవి. 23వ ఎత్తు వద్ద సుదీర్ఘంగా ఆలోచించడం, 28వ ఎత్తు వద్ద తప్పిదం చేయడంతో పూర్తి పాయింట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. 9 గేమ్‌ల తర్వాత కార్ల్సెన్ 6-3 ఆధిక్యంలో ఉన్నాడు. ఇక మూడు గేమ్‌లు మిగిలి ఉన్నా.. మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కాబట్టి ఆనంద్‌కు అవకాశాలు తక్కువేనని స్పష్టమవుతోంది. మూడు గేమ్‌ల్లో కార్ల్సెన్ రెండుసార్లు తెల్లపావులతో ఆడతాడు. టైటిల్ గెలిచేందుకు అతను కేవలం అర పాయింట్ దూరంలోనే ఉన్నాడు. -
ఇక లాంఛనమే!
అత్యంత కీలకమైన విజయం కావాల్సిన దశలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చేసిన తప్పిదం... ప్రపంచ టైటిల్‌ను దూరం చేయబోతోంది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న కార్ల్సెన్ కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు మరో అడుగు ముందుకేశాడు. ఇద్దరి మధ్య గురువారం జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ ఓడిపోయాడు. దీంతో విషీ టైటిల్ ఆశలు మరింత సన్నగిల్లగా... కార్ల్సెన్ కేవలం అర పాయింట్ దూరంలో నిలిచాడు. శుక్రవారం10వ గేమ్‌ను డ్రా చేసుకున్నా... కార్ల్సెన్ నేడే కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు. చెన్నై: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పూర్తిగా నిరాశపర్చాడు. కార్ల్సెన్ పెంచిన ఒత్తిడిని తట్టుకోలేక చేసిన చిన్న తప్పిదంతో పెద్ద మూల్యమే చెల్లించుకున్నాడు. దీంతో గురువారం కార్ల్‌సెన్‌తో జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ 28 ఎత్తుల వద్ద ఓడిపోయాడు. ఈ గేమ్ తర్వాత 6-3 ఆధిక్యంలో ఉన్న కార్ల్సెన్ టైటిల్‌కు కేవలం అర పాయింట్ దూరంలో నిలవగా, విషీ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. మిగిలిన మూడు గేమ్‌ల్లో కనీసం ఒక్క డ్రా చేసుకున్నా నార్వే ప్లేయర్ కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు. మరోవైపు టోర్నీలో నిలవాలంటే ఆనంద్ మిగిలిన మూడు గేమ్‌ల్లోనూ నెగ్గాలి. ఆరంభంలో ఆనంద్ మెరుగ్గా ఆడినా.. ఎండ్ గేమ్‌లో కాస్త పట్టు కోల్పోయాడు. విషీ తెల్లపావులతో సెమాసిచ్ ఓపెనింగ్‌ను ఎంచుకోగా... కార్ల్సెన్ నల్లపావులతో నిమ్జో ఇండియన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ప్రారంభించాడు. ఇంతకుముందు చెస్ చాంపియన్‌షిప్‌లో క్రామ్నిక్‌తో; తర్వాత వాంగ్ హో (చైనా)తో జరిగిన గేమ్‌ల్లో ఇదే వ్యూహాన్ని భారత ప్లేయర్ అమలుపర్చాడు. మిడిల్ గేమ్ ఆరంభంలో ప్రధాన లైన్‌కు కట్టుబడి ఆటడంతో కార్ల్సెన్ కాస్త నిరాశకు లోనైనట్లు కనిపించాడు. దీంతో ఆనంద్ కింగ్సైడ్ అటాక్‌ను మొదలుపెట్టినా... నార్వే ప్లేయర్ మాత్రం బలవంతంగా ఫ్లాంక్ మీద ఆడాల్సి వచ్చింది. గేమ్ మధ్యలో కార్ల్సెన్ ప్రమాదంలో పడినట్లే కనిపించినా... తన అద్భుతమైన ఎత్తుగడలతో మళ్లీ పుంజుకున్నాడు. ఎండ్‌గేమ్ చివర్లో కూడా అతని క్వీన్, ఓ బిషప్ బోర్డు ప్రారంభ గడుల్లోనే ఉండటం విశేషం. అందుబాటులో ఉన్న వనరులను అతను సమర్థంగా వినియోగించుకుంటూ గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 25 నిమిషాల పాటు ఆలోచించి వేసిన 22వ ఎత్తు ఫలితాన్ని ఇవ్వకపోవడం... ‘చెక్’ను ఎదుర్కొనేందుకు కార్ల్సెన్ కింగ్‌తో సిద్ధంగా ఉండటంతో ఆనంద్ కాస్త సందిగ్ధంలో పడ్డాడు. గేమ్‌లో అటాకింగ్నే కొనసాగించాలని నిర్ణయించుకోవడానికి 23వ ఎత్తు వద్ద విషీ మరో 40 నిమిషాల పాటు ఆలోచించాడు. అప్పటికీ గేమ్ తన అదుపులో ఉన్నా... ఫలితం రాబట్టడానికే ఎక్కువగా ప్రయత్నించాడు. ఈ దశలో కార్ల్సెన్ అద్భుతమైన ఎత్తుగడలతో ముందుకెళ్లాడు. దీంతో ఒత్తిడికి లోనైన ఆనంద్ 28వ ఎత్తు వద్ద తప్పిదం చేశాడు. ప్రత్యర్థి క్వీన్‌కు చెక్ పెట్టే దిశగా తన నైట్‌ను ముందుకు తెచ్చాడు. దీంతో కార్ల్సెన్ చకచకా పావులు కదిపి భారత ఆటగాడిని కట్టిపడేశాడు. ‘గేమ్‌లో నా శక్తి మేరకు పోరాడా. తెల్లపావులతో విజయం అందుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. జరిగిన తప్పిదాన్ని నేను గుర్తించలేకపోయా.40 నిమిషాల సుదీర్ఘ ఆలోచన తర్వాత వేసిన ఎత్తుకు ప్రత్యర్థి తక్షణమే స్పందించాడు. చివరి మూడు గేమ్‌ల్లో పోరాడేందుకు ప్రయత్నిస్తా. అయితే పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ గేమ్‌లో ఓపెనింగ్‌ను మార్చినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ’ -ఆనంద్ ‘ఓపెనింగ్ నుంచీ పదునైన ఎత్తుగడ లభించింది. పాన్లను ఉపయోగించడంలో ఏదో మిస్సయినట్లు అనిపించింది. ఇది చాలా కఠినమైన గేమ్. వీలైనంత మంచి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించా’ -కార్ల్సెన్ -
ఆనంద్‌కు ఆఖరి అవకాశం
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు ముందు ఫేవరెట్‌గా భావించిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు... టోర్నీలో ముందుకెళ్లే కొద్దీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా... కార్ల్సెన్ (నార్వే) దూకుడుకు సరైన అడ్డుకట్ట వేయలేక వెనుకబడిపోయాడు. ఇప్పటి వరకు జరిగిన 8 గేమ్‌ల్లో విషీ ఆరు గేమ్‌లు డ్రా చేసుకోగా... రెండింటిలో ఓడిపోయాడు. దీంతో టోర్నీలో 3-5 తేడాతో ఎదురీదుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్ల్‌సెన్‌తో నేడు (గురువారం) జరగబోయే తొమ్మిదో గేమ్ ఆనంద్‌కు అత్యంత కీలకమైంది. తెల్లపావులతో ఆడనున్న అతను టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ గేమ్‌లో తప్పనిసరిగా గెలిచి తీరాలి. దీంతో అతనిపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇలాంటివి తన అనుభవంలో ఎన్నో చూసిన ఆనంద్ పుంజుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరం. అలుపెరగకుండా పోరాడటంలో ఆనంద్ దిట్టే అయినా... ఓపెనింగ్‌తోనే కార్ల్సెన్ గేమ్‌పై పట్టు బిగిస్తున్నాడు. ఇది భారత్ ఆటగాడికి చాలా ఆందోళన కలిగించే అంశం. తొమ్మిదో గేమ్‌లో గెలవకపోతే ఇక తెల్లపావులతో ఆడే అవకాశం ఆనంద్‌కు 11వ గేమ్‌లో వస్తుంది. అప్పుడు గెలిచినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. -
రిస్క్ తీసుకోవాల్సిందే!
ఎనిమిదో గేమ్ కూడా డ్రా అయినా... నా ఉద్దేశంలో ఇది చాలా బోరింగ్. ఆనంద్ ఆశ్చర్యకరంగా నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టాడు. చివరకు 33 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రాధాన్యమిచ్చారు. గేమ్ డ్రా అవుతుందని ప్రారంభలోనే స్పష్టమైంది. ప్రతి ఎత్తు వద్ద పావులు చేతులు మారాయి. చివరకు ఒక్కొక్కరి దగ్గర కింగ్, ఏడు పాన్లు మిగిలాయి. కాబట్టి గేమ్ ముందుకెళ్లినా ఎలాంటి పురోగతి కనిపించదు. కార్ల్సెన్ పరంగా ఆలోచిస్తే ఇది మంచి ఫలితమే. ఎందుకంటే అతను ఇప్పటికే 2 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా... మరో నాలుగు గేమ్‌లు ఆడాల్సి ఉంది. ఈ గేమ్‌లో ఆనంద్ ఓపెనింగ్‌కు నేను ఆశ్చర్యపోయా. గెలిచేందుకు కావాల్సిన అవకాశాలను ఈ ఓపెనింగ్ సమకూరుస్తుంది. బెర్లిన్ డిఫెన్స్ పటిష్టమైన ఓపెనింగ్. ఒకవేళ తెల్లపావులతో ఆడితే అది రక్షణాత్మకం అవుతుంది. అప్పుడు డ్రా చేసుకోవడం తప్ప నల్లపావులతో ఇంకేమీ చేయలేం. ప్రస్తుతం కార్ల్సెన్ 5-3తో ఆధిక్యంలో ఉన్నాడు. తొమ్మిదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో విషీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. తెల్లపావులతో మరో డ్రా చేసుకోవడం సరైందికాదు. కార్ల్సెన్ను ఓడించాలంటే దూకుడుగా ఆడటంతో పాటు రిస్క్ కూడా తీసుకోవాల్సిందే. నేడు విశ్రాంతి దినం. తర్వాతి గేమ్‌లో ఆనంద్ వ్యూహాన్ని మార్చి గెలుపే లక్ష్యంగా ఆడతాడని నా నమ్మకం. -
ఇక ఆనంద్‌కు కష్టమే!
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతున్నా.... కీలకమైన గెలుపును మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఎనిమిదో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ఈ టోర్నీలో కార్ల్సెన్ ఆధిక్యమే కొనసాగుతోంది. దీంతో విషీ డిఫెండింగ్ చాంపియన్ హోదాకు గండిపడే అవకాశాలు కనబడుతున్నాయి. చెన్నై: కీలక సమయంలో బాగా పుంజుకుంటాడని పేరున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటలేకపోతున్నాడు. తెల్లపావులతో ఆడినా... గేమ్ మధ్యలో ఆశ్చర్యకరమైన ఎత్తుగడలు వేసినా ‘డ్రా’ వరకే పరిమితమవుతున్నాడు కానీ విజయం మాత్రం దక్కడం లేదు. దీంతో ఈసారి టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయి. ఎన్నో టోర్నీలు ఆడిన అనుభవం ఉన్నా... కుర్ర ప్రత్యర్థి కార్ల్సెన్ (నార్వే) దూకుడుకు మాత్రం సరైన అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు. దీంతో చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మంగళవారం జరిగిన ఎనిమిదో గేమ్ కూడా 33 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ గేమ్ అనంతరం కార్ల్సెన్ 5-3 ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో నాలుగు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. మరో 1.5 పాయింట్లు వస్తే కార్ల్సెన్ తొలిసారి చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుస్తాడు. ఆనంద్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే నాలుగు గేమ్‌ల్లో 3.5 పాయింట్లు సాధించాలి. ప్రస్తుతం ఇది చాలా క్లిష్టమే. 75 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌ను కార్ల్సెన్ ఆశ్చర్యకరంగా కింగ్పాన్ ఓపెనింగ్‌తో మొదలుపెట్టాడు. దీంతో ఆనంద్ నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్ వైపు మొగ్గాడు. నార్వే ఆటగాడు ప్రధాన లైన్లో వెళ్లకుండా గేమ్‌ను విస్తృతంగా విశ్లేషిస్తూ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెళ్లాడు. ఈ దశలో భారత ప్లేయర్‌కు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... వాటిని సమర్థంగా వినియోగించుకున్నాడు. ఏడో ఎత్తు వద్ద తొలిసారి ఓ జత నైట్స్ చేతులు మారగా... ఆనంద్ వేసిన కచ్చితమైన 12వ ఎత్తుకు మరో జత రూక్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. గత మ్యాచ్‌ల్లో ఇలాంటి స్థితిలో సరైన ఫామ్‌లో లేక ఆనంద్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఈసారి కార్ల్సెన్ నుంచి కూడా పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో గేమ్ సాఫీగానే సాగింది. తర్వాత వరుస విరామాల్లో పావులు చేతులు మారడంతో... 21వ ఎత్తు వద్ద ఇరువురు క్వీన్ రూక్, చిన్న పావులతో ఎండ్‌గేమ్‌కు వచ్చారు. దీంతో పోరాడిన ఫలితం రాదని తేలిపోవడంతో కార్ల్సెన్ వ్యూహాత్మకంగా కొత్త ఎత్తుగడను అవలంభించాడు. ఫలితంగా మిగిలిపోయిన మూడు పావులు బలవంతంగా చేతులు మారడంతో 28వ ఎత్తు వద్ద కింగ్, పాన్ ఎండ్గేమ్లోకి వెళ్లింది. మరో ఐదు ఎత్తుల తర్వాత ఇరువైపుల కింగ్, ఏడు పాన్లు మాత్రమే మిగిలిపోవడంతో ఆటగాళ్లిద్దరూ డ్రాకు అంగీకరించారు. ‘మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన ఎత్తులు లేకపోయినా... నేను ఈ4కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. తెల్లపావులతో ఆడేవారికి ఇది బలమైన ఎత్తుగడ అయినా గేమ్ మొత్తానికి అది ఉపయోగపడదు. ఒకవేళ నేను క్యూజీ5, హెచ్4తో వెళ్తే ఇది ఆశ్చర్యకరమైన ఎత్తు. కానీ కేవలం క్యూడీ8 వల్ల గేమ్ డ్రా వైపు వెళ్లింది. గేమ్‌లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఓపెనింగ్ సన్నాహకాలపై కూడా సంతృప్తిగా ఉన్నా. తర్వాతి గేమ్‌కు భిన్నంగా సిద్ధమవుతా’ - ఆనంద్