చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఆనంద్ 1.డీ4తో ఓపెనింగ్‌ను మార్చాడు. దీంతో గేమ్ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. అతని బాడీ లాంగ్వేజిలోనూ అది స్పష్టంగా కనిపించింది. తన ఎత్తులన్నీ చాలా నమ్మకంతో వేగంగా వేశాడు. మరోవైపు కార్ల్‌సెన్ తన ప్రతి ఎత్తుకూ చాలా సమయం తీసుకున్నాడు.
ఈ గేమ్‌లో 23వ ఎత్తు చాలా క్లిష్టమైంది. ఈ స్థితిలో తెల్లపావులతో ఆశ్చర్యకరమైన ఎత్తులు వేసే అవకాశం ఉండటంతో ఆనంద్ చాలా సమయాన్ని తీసుకున్నాడు. క్యూఎఫ్4తో ఆశ్చర్యకరమైన ఎత్తూ వేశాడు. ఇది మంచి ఆలోచన. తను వేసిన 28.ఎన్‌ఎఫ్1 ఎత్తుకు కార్ల్‌సెన్ ఇచ్చిన ప్రతి స్పందనను గుర్తించలేకపోవడం ఆనంద్ దురదృష్టం. 28వ ఎత్తు తర్వాత క్యూఈ1తో కార్ల్‌సెన్ గేమ్‌ను ముగించాడు. దీని తర్వాత తెల్లపావులతో ఆడేవారికి ఎక్కువ అవకాశం లేకుండా బ్లాక్స్‌తో కట్టిపడేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆనంద్ గేమ్ నుంచి తప్పుకున్నాడు.
9వ గేమ్‌లో విషీ గెలిచి ఉంటే టోర్నీలో అతని ఆశలు సజీవంగా ఉండేవి. 23వ ఎత్తు వద్ద సుదీర్ఘంగా ఆలోచించడం, 28వ ఎత్తు వద్ద తప్పిదం చేయడంతో పూర్తి పాయింట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. 9 గేమ్‌ల తర్వాత కార్ల్‌సెన్ 6-3 ఆధిక్యంలో ఉన్నాడు. ఇక మూడు గేమ్‌లు మిగిలి ఉన్నా.. మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కాబట్టి ఆనంద్‌కు అవకాశాలు తక్కువేనని స్పష్టమవుతోంది. మూడు గేమ్‌ల్లో కార్ల్‌సెన్ రెండుసార్లు తెల్లపావులతో ఆడతాడు. టైటిల్ గెలిచేందుకు అతను కేవలం అర పాయింట్ దూరంలోనే ఉన్నాడు.