ఇక లాంఛనమే!
అత్యంత కీలకమైన విజయం కావాల్సిన దశలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చేసిన తప్పిదం... ప్రపంచ టైటిల్‌ను దూరం చేయబోతోంది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న కార్ల్‌సెన్ కొత్త చాంపియన్‌గా అవతరించేందుకు మరో అడుగు ముందుకేశాడు. ఇద్దరి మధ్య గురువారం జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ ఓడిపోయాడు. దీంతో విషీ టైటిల్ ఆశలు మరింత సన్నగిల్లగా... కార్ల్‌సెన్ కేవలం అర పాయింట్ దూరంలో నిలిచాడు. శుక్రవారం10వ గేమ్‌ను డ్రా చేసుకున్నా... కార్ల్‌సెన్ నేడే కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు.
చెన్నై: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ పూర్తిగా నిరాశపర్చాడు. కార్ల్‌సెన్ పెంచిన ఒత్తిడిని తట్టుకోలేక చేసిన చిన్న తప్పిదంతో పెద్ద మూల్యమే చెల్లించుకున్నాడు. దీంతో గురువారం కార్ల్‌సెన్‌తో జరిగిన 9వ గేమ్‌లో ఆనంద్ 28 ఎత్తుల వద్ద ఓడిపోయాడు. ఈ గేమ్ తర్వాత 6-3 ఆధిక్యంలో ఉన్న కార్ల్‌సెన్ టైటిల్‌కు కేవలం అర పాయింట్ దూరంలో నిలవగా, విషీ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. మిగిలిన మూడు గేమ్‌ల్లో కనీసం ఒక్క డ్రా చేసుకున్నా నార్వే ప్లేయర్ కొత్త చాంపియన్‌గా అవతరిస్తాడు. మరోవైపు టోర్నీలో నిలవాలంటే ఆనంద్ మిగిలిన మూడు గేమ్‌ల్లోనూ నెగ్గాలి.
ఆరంభంలో ఆనంద్ మెరుగ్గా ఆడినా.. ఎండ్ గేమ్‌లో కాస్త పట్టు కోల్పోయాడు. విషీ తెల్లపావులతో సెమాసిచ్ ఓపెనింగ్‌ను ఎంచుకోగా... కార్ల్‌సెన్ నల్లపావులతో నిమ్‌జో ఇండియన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ప్రారంభించాడు. ఇంతకుముందు చెస్ చాంపియన్‌షిప్‌లో క్రామ్నిక్‌తో; తర్వాత వాంగ్ హో (చైనా)తో జరిగిన గేమ్‌ల్లో ఇదే వ్యూహాన్ని భారత ప్లేయర్ అమలుపర్చాడు. మిడిల్ గేమ్ ఆరంభంలో ప్రధాన లైన్‌కు కట్టుబడి ఆటడంతో కార్ల్‌సెన్ కాస్త నిరాశకు లోనైనట్లు కనిపించాడు.
దీంతో ఆనంద్ కింగ్‌సైడ్ అటాక్‌ను మొదలుపెట్టినా... నార్వే ప్లేయర్ మాత్రం బలవంతంగా ఫ్లాంక్ మీద ఆడాల్సి వచ్చింది. గేమ్ మధ్యలో కార్ల్‌సెన్ ప్రమాదంలో పడినట్లే కనిపించినా... తన అద్భుతమైన ఎత్తుగడలతో మళ్లీ పుంజుకున్నాడు. ఎండ్‌గేమ్ చివర్లో కూడా అతని క్వీన్, ఓ బిషప్ బోర్డు ప్రారంభ గడుల్లోనే ఉండటం విశేషం. అందుబాటులో ఉన్న వనరులను అతను సమర్థంగా వినియోగించుకుంటూ గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 25 నిమిషాల పాటు ఆలోచించి వేసిన 22వ ఎత్తు ఫలితాన్ని ఇవ్వకపోవడం... ‘చెక్’ను ఎదుర్కొనేందుకు కార్ల్‌సెన్ కింగ్‌తో సిద్ధంగా ఉండటంతో ఆనంద్ కాస్త సందిగ్ధంలో పడ్డాడు.
గేమ్‌లో అటాకింగ్‌నే కొనసాగించాలని నిర్ణయించుకోవడానికి 23వ ఎత్తు వద్ద విషీ మరో 40 నిమిషాల పాటు ఆలోచించాడు. అప్పటికీ గేమ్ తన అదుపులో ఉన్నా... ఫలితం రాబట్టడానికే ఎక్కువగా ప్రయత్నించాడు. ఈ దశలో కార్ల్‌సెన్ అద్భుతమైన ఎత్తుగడలతో ముందుకెళ్లాడు. దీంతో ఒత్తిడికి లోనైన ఆనంద్ 28వ ఎత్తు వద్ద తప్పిదం చేశాడు. ప్రత్యర్థి క్వీన్‌కు చెక్ పెట్టే దిశగా తన నైట్‌ను ముందుకు తెచ్చాడు. దీంతో కార్ల్‌సెన్ చకచకా పావులు కదిపి భారత ఆటగాడిని కట్టిపడేశాడు.
‘గేమ్‌లో నా శక్తి మేరకు పోరాడా. తెల్లపావులతో విజయం అందుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. జరిగిన తప్పిదాన్ని నేను గుర్తించలేకపోయా.40 నిమిషాల సుదీర్ఘ ఆలోచన తర్వాత వేసిన ఎత్తుకు ప్రత్యర్థి తక్షణమే స్పందించాడు. చివరి మూడు గేమ్‌ల్లో పోరాడేందుకు ప్రయత్నిస్తా. అయితే పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ గేమ్‌లో ఓపెనింగ్‌ను మార్చినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ’
-ఆనంద్
‘ఓపెనింగ్ నుంచీ పదునైన ఎత్తుగడ లభించింది. పాన్‌లను ఉపయోగించడంలో ఏదో మిస్సయినట్లు అనిపించింది. ఇది చాలా కఠినమైన గేమ్. వీలైనంత మంచి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించా’
-కార్ల్‌సెన్