కార్ల్‌సెన్‌కు ప్రపంచ చెస్ టైటిల్
ప్రపంచ చెస్‌లో కొత్త శకం మొదలైంది! ఇన్నాళ్లూ చెస్‌కు పర్యాయపదంలా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ స్థానంలో ఎట్టకేలకు కొత్త రాజు వచ్చాడు. 64 గడుల సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిగా 22 ఏళ్ల నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ పుట్టుకొచ్చాడు. భిన్నమైన శైలి, ఆటలో దూకుడు, పదునైన వ్యూహాలు అంతుకుమించిన ఎత్తుగడలతో 43 ఏళ్ల అపర మేధావి ఆనంద్‌ను అలవోకగా కట్టడి చేసి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
చెన్నై: కుర్రాడి దూకుడుతనం ముందు అపారమైన అనుభవం మూగబోయింది. ఒకటి, రెండు ఎత్తులకే చిత్తవుతాడనుకున్న యువకుడు 64 గడుల రారాజుగా అవతరించాడు. అసాధారణ నైపుణ్యానికి తోడు అద్భుతమైన ఎత్తుగడతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్ ప్రపంచ చెస్ కొత్త చాంపియన్‌గా అవిర్భవించాడు.
శుక్రవారం ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన పదో గేమ్ 65 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో రెండు మిగిలి ఉండగానే... 6.5 పాయింట్లతో కార్ల్‌సెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితం వచ్చినందున ఆఖరి రెండు గేమ్‌లు జరగవు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన విషీ... ఈ టోర్నీలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన అనుభవమంత వయసులేని కుర్రాడి చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆనంద్... ప్రత్యర్థి వ్యూహాలకు బిత్తరపోయాడు. 4 గంటల 45 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌లో డ్రా చేసుకునేందుకు చాలా అవకాశాలు వచ్చినా నార్వే కుర్రాడు మాత్రం విజయం కోసమే ప్రయత్నించాడు. చివరకు ఆనంద్ డ్రాకు ప్రతిపాదించడంతో తను కూడా ఆమోదం తెలిపాడు. ఇప్పటికి ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్.. సొంతగడ్డపై ఓడటం ఎదురుదెబ్బే. ఈసారి టోర్నీలో ఆనంద్ ఒక్క గేమ్ కూడా గెలవకపోవడం గమనార్హం.
ఆరంభం నుంచే పట్టు
ఓపెనింగ్‌తో గేమ్‌పై పట్టు బిగించడం... మిడిల్ గేమ్‌లో ఆధిపత్యం కనబర్చడం... అటాకింగ్‌తో ఎండ్‌గేమ్‌ను ఫినిష్ చేయడం... టోర్నీ మొత్తం ఇదే ఆటతీరుతో చెలరేగిన కార్ల్‌సెన్ పదో గేమ్‌లోనూ ఊపును కొనసాగించాడు. గేమ్ ప్రధాన లైన్‌లోకి తీసుకెళ్లినా.. ఏదో ఓ చోట కచ్చితమైన మలుపుతో తన వైపు తిప్పుకున్నాడు. తెల్లపావులతో కార్ల్‌సెన్ మాస్కో వేరియేషన్‌తో వస్తే... ఆనంద్ నల్లపావులతో సిసిలియన్ ఓపెనింగ్‌ను ఎంచుకున్నాడు. మూడో ఎత్తు వద్ద ప్రత్యర్థి నైట్ కోసం కార్ల్‌సెన్ లైట్ బిషప్‌తో చెక్ పెట్టడంతో బోర్డుపై మార్కోజి బ్లైండ్ గేమ్ కనిపించింది.
14వ ఎత్తు వద్ద లైట్ బిషప్‌ను మళ్లీ రంగంలోకి దించడంతో గేమ్‌లో కొన్ని పావులు చేతులు మారాయి. 21 వ ఎత్తు తర్వాత ఎత్తులు పునరావృతం అవుతాయని ఊహించినా ఇరువురు ఆటగాళ్లు దాన్ని కాకుండా చూశారు. 28వ ఎత్తు వద్ద కింగ్‌ను ఐదో ర్యాంక్‌కు జరుపుతూ కార్ల్‌సెన్ తన ప్రణాళికను అమలు చేశాడు. కానీ విషీ... కొన్ని చిన్న ఎత్తులతో కోలుకున్నాడు. ఫలితంగా నైట్, పాన్‌లతో ఎండ్‌గేమ్ మొదలైంది. తొలిసారి టైమ్ కంట్రోలు వచ్చేసరికి గేమ్‌లో 40 ఎత్తులు పూర్తయ్యాయి.
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆనంద్ గేమ్‌లో పూర్తిగా లీనంకాగా.. కార్ల్‌సెన్ కూడా ఫలితం కోసమే ప్రయత్నించాడు. అవకాశం కోసం ఓపికగా వేచి చూసిన అతను 46వ ఎత్తు వద్ద గేమ్‌ను మలుపు తిప్పాడు. సుదీర్ఘంగా ఆలోచించి ఓ పాన్‌ను త్యాగం చేశాడు. తర్వాతి కొన్ని ఎత్తులకే ఆనంద్ అన్ని పావులను కోల్పోయాడు. దీంతో ఇద్దరూ న్యూ క్వీన్స్‌ను ప్రమోట్ చేశారు. ఆనంద్‌కు ఎక్స్‌ట్రా నైట్ ఉంటే... కార్ల్‌సెన్ ఎక్స్‌ట్రా క్వీన్‌తో పాటు కొన్ని ప్రమాదకరమైన పాన్‌లు అందుబాటులో ఉంచుకున్నాడు. తర్వాత భారత ప్లేయర్ కొన్ని కచ్చితమైన ఎత్తులతో అలరించినా... చివరకు డ్రాతో సరిపెట్టుకున్నాడు.
నార్వేలో ‘సీన్’మారింది
‘సాక్షి’కి ప్రత్యేకం
చెస్‌కు శారీరక శ్రమ అవసరం లేదు... అసలు ఇది క్రీడే కాదు... దీనిని క్రీడల జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదు... నార్వేలో జాతీయ క్రీడా సమాఖ్య (నార్వే స్పోర్ట్స్ కమ్యూనిటీ) అభిప్రాయం ఇది. ఏడాదిన్నర క్రితం నార్వే చెస్ సంఘం... తమను గుర్తించాలంటూ చేసుకున్న దరఖాస్తు ఇప్పటికీ జాతీయ సమాఖ్య దగ్గర పెండింగ్‌లో ఉంది. నార్వేలో చెస్‌కు ఉండే ఆదరణ, ఆట పట్ల ఉండే అభిప్రాయం ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాంటి దేశం నుంచి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చెస్ రారాజుగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. నిజానికి కార్ల్‌సెన్ నంబర్‌వన్ ఆటగాడైనా... ఆ దేశంలో చాలామందికి అతనెవరో తెలియదు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌తో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆరో గేమ్ తర్వాత కార్ల్‌సెన్ 4-2 ఆధిక్యంలోకి రావడంతో ఒక్కసారిగా నార్వే అంతా ఆశ్చర్యపోయింది. తమ కుర్రాడు ప్రపంచ చాంపియన్ అవుతున్నాడనే సంబరం మొదలైంది. ఇక గెలిచాక సంబరాల సంగతి చెప్పక్కర్లేదు.సాధారణంగా నార్వేలో రెండే క్రీడలను పట్టించుకుంటారు. అందులో మొదటిది స్కీయింగ్. ఇందులో ప్రపంచ చాంపియన్స్ అంతా ఈ దేశం నుంచే ఉన్నారు. రెండో ఆట ఫుట్‌బాల్.
కానీ ఇది అక్కడ క్లబ్ స్థాయికే పరిమితమైంది. జాతీయ జట్టు పెద్దగా ఆడేదీ, అద్భుతాలు చేసిందీ లేదు. అందుకే స్కీయింగ్ క్రీడాకారులే సూపర్‌స్టార్స్. ఇప్పుడు కార్ల్‌సెన్ నార్వేలో చెస్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎప్పుడైతే ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలైందో... నార్వేలో వేడి పెరిగింది. కార్ల్‌సెన్ స్కీయింగ్ స్టార్స్‌తో పాటు... దేశంలో టాప్-3 స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఒకడిగా వెలుగులోకి వచ్చాడు. చెస్ గురించి ప్రతిరోజూ పత్రికల్లో మొదటి పేజీలో వార్తలు మొదలయ్యాయి.
లోకల్ ట్రెయిన్స్, బస్‌లలో కార్ల్‌సెన్ ఫొటోలు, పోస్టర్లు వచ్చాయి. పలు కంపెనీలు కార్ల్‌సెన్‌కు అభినందనలు తెలుపుతూ తనని సూపర్ హీరోని చేశాయి. ఎంటర్‌కార్డ్ అనే క్రెడిట్‌కార్డ్ కంపెనీ ఇన్నాళ్లూ అనేకమంది క్రీడాకారులకు స్పాన్సర్ చేసినా చెస్‌ను పట్టించుకోలేదు. అలాంటి కంపెనీ ఇప్పుడు చెస్‌ను ప్రమోట్ చేయడానికి నడుం బిగించింది. అన్నింటికంటే చెప్పుకోదగ్గ విషయం... రాజధాని ఓస్లోకు సమీపంలోని డ్రమ్మెన్ ప్రాంతంలో చెస్‌కు సంబంధించిన బోర్డులు, పుస్తకాలు అమ్మే షాప్ ఉంది. దేశం మొత్తం మీద ఇదొక్కటే చెస్ షాప్. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలయ్యాక... కేవలం ఒక్క రోజులోనే ఈ షాప్‌లో స్టాక్ అంతా అయిపోవడం విశేషం.
(ఇన్‌పుట్స్: ఓస్లోలో పని చేస్తున్న తెలుగువాసి మల్లేశ్వరరావు నందా)
‘కింగ్’ కార్ల్‌సెన్
పూర్తి పేరు: స్వెన్ మాగ్నస్ కార్ల్‌సెన్
పుట్టిన తేదీ: 30 నవంబరు, 1990
జన్మస్థలం: టాన్స్‌బర్గ్, వెస్ట్‌ఫోల్డ్ (నార్వే)
టైటిల్: గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్
ప్రస్తుత ‘ఫిడే’ రేటింగ్: 2870 పాయింట్లు
అత్యుత్తమ రేటింగ్: 2872 పాయింట్లు (ఫిబ్రవరి, 2013లో)
ప్రస్తుత ర్యాంక్: 1
అత్యుత్తమ ర్యాంక్: 1 (జనవరి, 2010లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2011 జులై నుంచి ఇప్పటివరకు నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు)
ఘనతలు
2004లో ఏప్రిల్ 26న కార్ల్‌సెన్ 13 ఏళ్ల 148 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకున్నాడు. చెస్ చరిత్రలో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు.
2010లో జనవరి 1న కార్ల్‌సెన్ 19 ఏళ్ల 32 రోజుల వయస్సులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతను చెస్ చరిత్రలో టాప్ ర్యాంక్ దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ ఏడాది జనవరిలో కార్ల్‌సెన్ 2861 ఎలో రేటింగ్‌తో చెస్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ తర్వాత ఫిబ్రవరిలో 2872 పాయింట్లతో తన ఎలో రేటింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. 2009లో బ్లిట్జ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
2 ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో పిన్న వయస్కుడిగా కార్ల్‌సెన్ గుర్తింపు పొందాడు. 1985లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... కార్ల్‌సెన్ 22 ఏళ్ల 11 నెలల 22 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
16 ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 16వ క్రీడాకారుడిగా కార్ల్‌సెన్ నిలిచాడు.
రూ. 9.58 కోట్లు
విజేతగా నిలిచిన కార్ల్‌సెన్‌కు రూ. 9 కోట్ల 58 లక్షలు.... రన్నరప్ ఆనంద్‌కు రూ. 4 కోట్ల 42 లక్షలు ప్రైజ్‌మనీగా లభిస్తాయి.
‘‘మ్యాచ్ ఆద్యంతం నాపై కార్ల్‌సెన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఈ పోటీ మొత్తంలో కీలక మలుపు ఐదో గేమ్. ఆ గేమ్‌లో ఓడిపోవడంతో కోలుకోలేకపోయాను. నా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత ఈ పోటీలో నా ఆటతీరుపై సమీక్ష చేసుకుంటాను. వచ్చే మార్చిలో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగుతాను.’’
- ఆనంద్