ఆనంద్‌దే తుది నిర్ణయం
కొత్త సెకండ్స్ ఎంపికపై హరికృష్ణ అభిప్రాయం
చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ టోర్నీలో ఆనంద్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడనున్నాడు. గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆనంద్ పట్టుదలగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఆనంద్ విశ్వవిజేతగా నిలిచేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రాండ్‌మాస్టర్, తెలుగుతేజం పెంటేల హరికృష్ణ ప్రకటించాడు. భారత చెస్ ఆటగాళ్లలో ఆనంద్ (2785 ఎలో రేటింగ్) తర్వాత అత్యధిక ఎలో రేటింగ్ ఉన్న ఆటగాడు హరికృష్ణ (2726). అయితే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం తన కోర్ టీమ్ (సెకండ్స్)లో మార్పులపై తుది నిర్ణయం ఆనంద్‌దే అని హరికృష్ణ అన్నాడు. ప్రతీసారి సహాయకుల బృందంలో మార్పులు చేయడం మంచి నిర్ణయం కాదని చెప్పుకొచ్చాడు.
‘సెకండ్స్‌పై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ఆనంద్‌దే. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు గ్రాండ్ మాస్టర్లు సందీపన్ చందా, శశికిరణ్, లెకో (హంగేరీ), వోజ్తస్‌జెక్(పోలాండ్) సెకండ్స్‌గా వ్యవహరించారు. ఈ కోర్ టీమ్‌తో ఆనంద్ విశ్వవిజేతగా నిలవలేకపోయాడు. అయితే ఆనంద్‌కు ఇప్పుడు యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోపాటు.. ప్రపంచ టాప్-10తోపాటు 2750 ఎలో రేటింగ్ పైబడిన ఆటగాళ్లు అవసరమన్నాడు. ‘కార్ల్‌సన్‌ను గతంలో ఓడించిన వాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి కార్ల్‌సన్‌లా ఆలోచించేవాళ్లు కావాలి’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు.