candiates chess tournment
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌పైనే దృష్టి!
కొత్త వ్యూహాలకు ఆనంద్ పదును చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో టైటిల్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనపై గెలిచిన మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)ను ఓడించే అన్వేషణలో పడ్డాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌లో తిరిగి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఆనంద్ ఉన్నాడు. ‘నా ఆలోచననలకు పదునుపెట్టే పని ఇప్పటికే మొదలైంది. ఏం చేయాలి... ఎలా ముందడుగు వేయాలనే ప్రాథమిక అంశాలపై ఇది వరకే కసరత్తు చేశాను. రాబోయే నెలల్లో వీటిపైనే నా దృష్టి ఉంటుంది. ఈ నెల కాస్త విరామం ఇచ్చినా, ఆలోచనలకు మాత్రం విశ్రాంతి లేదు’ అని అన్నాడు. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ తిరిగి కిరీటం చేజిక్కించుకునే వ్యూహాలు పన్నుతున్నాడు. ‘నన్ను కంగుతినిపించిన కార్ల్‌సెన్‌తో పోరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో కూడా తెలుసు... కానీ అవన్నీ ఇప్పుడే బహిర్గతం చేయలేను. అనుకున్నది సాధించేందుకు ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తాను’ అని 44 ఏళ్ల ఆనంద్ చెప్పాడు. టోర్నీలో కావాల్సిందల్లా ఉత్సాహపరిచే విజయాలేనన్నాడు. అది ఆరంభ రౌండ్లలో లభిస్తే తిరుగు ఉండదని అతను అభిప్రాయపడ్డాడు. ఇప్పటి తన జోరు ప్రత్యర్థుల్ని ఒత్తిడిలోకి నెడుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘ఇప్పుడే ఎలా చెబుతాం. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు జరిగే టోర్నీల్లో ముందు గాడిన పడాలి. ప్రత్యర్థుల్ని ఓడించాలి. అప్పుడే ఒత్తిడిని పెంచగలం’ అని ఆనంద్ అన్నాడు. సందీపన్ చందాతో తిరిగి జతకడతానని చెప్పాడు. నార్వేలో అతనితో పనిచేశానని... చక్కని వ్యూహాలను రూపొందించడంలో చందా సిద్ధహస్తుడని చెప్పాడు. -
ఆనంద్‌దే తుది నిర్ణయం
కొత్త సెకండ్స్ ఎంపికపై హరికృష్ణ అభిప్రాయం చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ టోర్నీలో ఆనంద్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడనున్నాడు. గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆనంద్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనంద్ విశ్వవిజేతగా నిలిచేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రాండ్‌మాస్టర్, తెలుగుతేజం పెంటేల హరికృష్ణ ప్రకటించాడు. భారత చెస్ ఆటగాళ్లలో ఆనంద్ (2785 ఎలో రేటింగ్) తర్వాత అత్యధిక ఎలో రేటింగ్ ఉన్న ఆటగాడు హరికృష్ణ (2726). అయితే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం తన కోర్ టీమ్ (సెకండ్స్)లో మార్పులపై తుది నిర్ణయం ఆనంద్‌దే అని హరికృష్ణ అన్నాడు. ప్రతీసారి సహాయకుల బృందంలో మార్పులు చేయడం మంచి నిర్ణయం కాదని చెప్పుకొచ్చాడు. ‘సెకండ్స్పై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ఆనంద్‌దే. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కు గ్రాండ్ మాస్టర్లు సందీపన్ చందా, శశికిరణ్, లెకో (హంగేరీ), వోజ్తస్జెక్(పోలాండ్) సెకండ్స్‌గా వ్యవహరించారు. ఈ కోర్ టీమ్‌తో ఆనంద్ విశ్వవిజేతగా నిలవలేకపోయాడు. అయితే ఆనంద్‌కు ఇప్పుడు యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోపాటు.. ప్రపంచ టాప్-10తోపాటు 2750 ఎలో రేటింగ్ పైబడిన ఆటగాళ్లు అవసరమన్నాడు. ‘కార్ల్‌సన్‌ను గతంలో ఓడించిన వాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి కార్ల్సన్లా ఆలోచించేవాళ్లు కావాలి’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు.