ఆనంద్‌కు మళ్లీ అవకాశం
ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వచ్చే ఏడాది మళ్లీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ నవంబరు 5 నుంచి 25 వరకు (వేదిక ఎంపిక చేయలేదు) జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హోదాలో మాగ్నస్ కార్ల్‌సెన్ ఉంటాడు. ‘క్యాండిడేట్స్ టోర్నమెంట్’ ద్వారా కార్ల్‌సెన్ ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది మార్చి 12 నుంచి 30 వరకు ఖాంటీ మాన్‌సిస్క్ (రష్యా)లో జరుగుతుంది. మొత్తం 8 మంది బరిలోకి దిగుతారు. విజేతగా నిలిచిన వారు కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడతారు.
ఎవరు ఎలా అర్హత పొందారంటే...
2013 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్ క్యాండిడేట్స్ టోర్నీలో ఆడతాడు. 2013 ప్రపంచ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ‘ఫిడే’ 2012-2013 గ్రాండ్‌ప్రి సిరీస్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షకిర్యార్ మమెద్యారోవ్ (అజర్‌బైజాన్) కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. 2013 ప్రపంచ కప్‌లో, గ్రాండ్‌ప్రి సిరీస్‌లో అత్యధిక రేటింగ్ కలిగిన ఇద్దరు క్రీడాకారులు లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా) కూడా ఈ టోర్నీకి అర్హత పొందారు. ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా ‘వైల్డ్ కార్డు’ పొందిన స్విద్లెర్ (రష్యా) కూడా టోర్నమెంట్‌లో పోటీపడతాడు.
- సాక్షి క్రీడావిభాగం