ఎండ్ గేమ్‌లోనే తేడా | magnus carlsen endgame technique is awesome | Sakshi
Sakshi News home page

ఎండ్ గేమ్‌లోనే తేడా

Published Sun, Nov 24 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

magnus carlsen endgame technique is awesome

కార్ల్‌సెన్ ప్రపంచ చెస్ టైటిల్ సాధించిన 16వ క్రీడాకారుడిగా అవతరించడంతో పాటు రెండో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కాస్పరోవ్ ముందున్నాడు. యాదృచ్చికమేమిటంటే 2009 లో కొంతకాలం కాస్పరోవ్ దగ్గర కార్ల్‌సెన్ శిక్షణ తీసుకోవడం. టోర్నీ మొత్తం కార్ల్‌సెన్ చాలా పటిష్టంగా ఆడాడు. ‘డ్రా’ చేసుకోవడం మినహా అతనిపై గెలవ డం అసాధ్యంగా కనిపించింది. ప్రత్యర్థి అడిగితే తప్ప అతను ఎప్పుడూ ‘డ్రా’ వైపు మొగ్గలేదు. ఈ లక్షణమే కార్ల్‌సెన్‌ను ప్రత్యర్థులందరిలో ప్రత్యేకంగా నిలిపింది. టోర్నీ ఆరంభంలో ఆనంద్ వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. దీంతో మూడో గేమ్‌లో కార్ల్‌సెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే నాలుగో గేమ్ నుంచి కార్ల్‌సెన్ ఆధిపత్యం కొనసాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న నార్వే ప్లేయర్... విషీ తప్పు చేసే వరకు ఓపికగా వేచి చూశాడు.
 
 కార్ల్‌సెన్ ఎండ్ గేమ్ టెక్నిక్ అద్భుతం. ఇది 12వ చాంపియన్‌గా నిలిచిన కార్పోవ్‌ను పోలి ఉంది.  కార్ల్‌సెన్ వయసు 22 ఏళ్లే. ప్రపంచ రెండో ర్యాంకర్‌కు ఇతని మధ్య 70 పాయింట్ల తేడా ఉంది. కాబట్టి ఈ స్థానంలో అతను సుదీర్ఘ కాలం కొనసాగుతాడని నా నమ్మకం. 70వ దశకంలో బాబీ ఫిషర్ (అమెరికా) తెచ్చినట్లుగా చెస్‌కు మరింత ఆకర్షణ తీసుకొస్తాడని భావిస్తున్నాను. ఇద్దరి వ్యక్తిత్వాలు భిన్నమైనా చెస్‌లో రాజీ పడకుండా ఆడే తీరు మాత్రం అమోఘం. ప్రత్యర్థులపై చూపించే ఈ స్పష్టమైన ఆధిపత్యమే చెస్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతుంది.
 
 ఈ టోర్నీ కోసం ఆనంద్ చాలా బాగా సన్నద్ధమయ్యాడు. అయితే కార్ల్‌సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించే స్థాయిలో ఆటతీరు లేకపోవడం కూడా భారత ప్లేయర్‌ను దెబ్బతీసింది. 9వ గేమ్‌లో మాత్రమే కాస్త దూకుడుగా ఆడాడు. రెండు పాయింట్లు వెనుకబడ్డాననే ఆత్రుతతో కచ్చితంగా గెలవాల్సిన ఈ గేమ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆనంద్ ఓటమికి ఈ రెండు కారణాలు ప్రధానమైనవి. కొత్త చెస్ చాంపియన్‌గా అవతరించిన కార్ల్‌సెన్‌కు నా శుభాకాంక్షలు. అలాగే మార్చిలో ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచి ప్రపంచ టైటిల్ కోసం కార్ల్‌సెన్‌తో ఆనంద్ మళ్లీ పోటీకి దిగాలని కోరుకుంటున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement