ఎట్టకేలకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ఫలితం వచ్చింది. అందరూ ఆశించినట్టుగా ఆనంద్‌కు బదులు... తెల్ల పావులతో ఆడిన మాగ్నస్ కార్ల్‌సెన్ ఐదో గేమ్‌లో విజయాన్ని అందుకున్నాడు. క్రితం గేమ్‌ల మాదిరిగా కాకుండా ఈసారి కార్ల్‌సెన్ సీ4 ఓపెనింగ్‌తో గేమ్‌ను ఆరంభించాడు. ఆనంద్ ఈ6తో జవాబు ఇచ్చి స్లావ్ డిఫెన్స్‌లోని మార్షల్ గాంబిట్ వ్యూహానికి సిద్ధమై వచ్చినట్లు సంకేతం ఇచ్చాడు. మరోవైపు కార్ల్‌సెన్ అంతుబట్టని వ్యూహంతో ఆనంద్‌ను తికమకపెట్టాడు.
ఆరంభంలో ఇద్దరూ కావాల్సినంత సమయం తీసుకున్నారు. 13వ ఎత్తులో ఆనంద్ తన ఒంటెను సీ7లోకి పంపిచడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆనంద్ రక్షణాత్మకంగా ఆడతాడని ఊహించలేదు. ఆనంద్ చేసిన ఈ తప్పిదంతో కార్ల్‌సెన్ గేమ్‌పై పట్టు సంపాదించుకున్నాడు. మిడిల్ గేమ్‌లో ఆనంద్ దూకుడు పెంచి గేమ్‌ను ‘డ్రా’దిశగా సాగేందుకు ప్రయత్నించాడు. కార్ల్‌సెన్ మాత్రం తడబాటుకు లోనుకాకుండా తనకున్న అవకాశాలను సజీవంగా పెట్టుకొని ముందుకుసాగాడు.
ఆనంద్ 45వ ఎత్తులో తన ఏనుగుని సీ1లోకి పంపించి కోలుకోలేని పొరపాటు చేశాడు. సీ1లోకి బదులు ఏ1లోకి ఏనుగుని పంపించి ఉంటే ఆనంద్ ‘డ్రా’తో గట్టెక్కేవాడు. ఆనంద్ చేసిన ఈ తప్పిదాన్ని కార్ల్‌సెన్ తనకు అనుకూలంగా మలచుకొని భారత గ్రాండ్‌మాస్టర్ ఆట కట్టించి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు రౌండ్‌లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో ఆనంద్ ఆరో గేమ్‌లో, ఏడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్నాడు. ఆరో గేమ్‌లో ఆనంద్ దూకుడుగా ఆడి విజయంపై దృష్టి పెట్టాలి.
తప్పిదాలకు మూల్యం
Published Sat, Nov 16 2013 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement