ప్రతీకారం తీర్చుకుంటా
కార్ల్‌సెన్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌పై ఆనంద్
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్ కిరీటాన్ని గత ఏడాది మాగ్నస్ కార్ల్‌సెన్‌తో చేజార్చుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. ఈ ఏడాది అతనిపై ప్రతీకారం తీర్చుకుంటానని, తిరిగి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంటానని చెబుతున్నాడు. కార్ల్‌సెన్ చేతిలో ఓటమి తరువాత కొన్నాళ్లు చెస్‌కు దూరంగా ఉన్న ఆనంద్ ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో విజయం తనకు ఆక్సిజన్ వంటిదని, ఈ ఉత్సాహంతో కార్ల్‌సెన్‌తో నవంబర్‌లో జరగనున్న పోరుకు సిద్ధమవుతున్నానని ఆనంద్ తెలిపాడు. ‘క్యాండిడేట్స్ టోర్నీలో విజయం నాలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత కల్పించడంతోపాటు పోటీకి అవసరమైన ఆక్సిజన్‌ను ఇచ్చింది. క్రితం సారి చేసిన పొరపాట్లకు తావివ్వకుండా ఈసారి భిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతా’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆనంద్ అన్నాడు.