ఇక ఆనంద్‌కు కష్టమే!
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతున్నా.... కీలకమైన గెలుపును మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఎనిమిదో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ఈ టోర్నీలో కార్ల్‌సెన్ ఆధిక్యమే కొనసాగుతోంది. దీంతో విషీ డిఫెండింగ్ చాంపియన్ హోదాకు గండిపడే అవకాశాలు కనబడుతున్నాయి.
చెన్నై: కీలక సమయంలో బాగా పుంజుకుంటాడని పేరున్న భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటలేకపోతున్నాడు. తెల్లపావులతో ఆడినా... గేమ్ మధ్యలో ఆశ్చర్యకరమైన ఎత్తుగడలు వేసినా ‘డ్రా’ వరకే పరిమితమవుతున్నాడు కానీ విజయం మాత్రం దక్కడం లేదు. దీంతో ఈసారి టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయి.
ఎన్నో టోర్నీలు ఆడిన అనుభవం ఉన్నా... కుర్ర ప్రత్యర్థి కార్ల్‌సెన్ (నార్వే) దూకుడుకు మాత్రం సరైన అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు. దీంతో చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య మంగళవారం జరిగిన ఎనిమిదో గేమ్ కూడా 33 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ గేమ్ అనంతరం కార్ల్‌సెన్ 5-3 ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో నాలుగు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. మరో 1.5 పాయింట్లు వస్తే కార్ల్‌సెన్ తొలిసారి చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుస్తాడు. ఆనంద్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే నాలుగు గేమ్‌ల్లో 3.5 పాయింట్లు సాధించాలి. ప్రస్తుతం ఇది చాలా క్లిష్టమే.
75 నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్‌ను కార్ల్‌సెన్ ఆశ్చర్యకరంగా కింగ్‌పాన్ ఓపెనింగ్‌తో మొదలుపెట్టాడు. దీంతో ఆనంద్ నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్ వైపు మొగ్గాడు. నార్వే ఆటగాడు ప్రధాన లైన్‌లో వెళ్లకుండా గేమ్‌ను విస్తృతంగా విశ్లేషిస్తూ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెళ్లాడు. ఈ దశలో భారత ప్లేయర్‌కు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నా... వాటిని సమర్థంగా వినియోగించుకున్నాడు.
ఏడో ఎత్తు వద్ద తొలిసారి ఓ జత నైట్స్ చేతులు మారగా... ఆనంద్ వేసిన కచ్చితమైన 12వ ఎత్తుకు మరో జత రూక్స్ ఎక్స్‌చేంజ్ అయ్యాయి. గత మ్యాచ్‌ల్లో ఇలాంటి స్థితిలో సరైన ఫామ్‌లో లేక ఆనంద్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఈసారి కార్ల్‌సెన్ నుంచి కూడా పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో గేమ్ సాఫీగానే సాగింది. తర్వాత వరుస విరామాల్లో పావులు చేతులు మారడంతో... 21వ ఎత్తు వద్ద ఇరువురు క్వీన్ రూక్, చిన్న పావులతో ఎండ్‌గేమ్‌కు వచ్చారు. దీంతో పోరాడిన ఫలితం రాదని తేలిపోవడంతో కార్ల్‌సెన్ వ్యూహాత్మకంగా కొత్త ఎత్తుగడను అవలంభించాడు. ఫలితంగా మిగిలిపోయిన మూడు పావులు బలవంతంగా చేతులు మారడంతో 28వ ఎత్తు వద్ద కింగ్, పాన్ ఎండ్‌గేమ్‌లోకి వెళ్లింది. మరో ఐదు ఎత్తుల తర్వాత ఇరువైపుల కింగ్, ఏడు పాన్‌లు మాత్రమే మిగిలిపోవడంతో ఆటగాళ్లిద్దరూ డ్రాకు అంగీకరించారు.
‘మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన ఎత్తులు లేకపోయినా... నేను ఈ4కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. తెల్లపావులతో ఆడేవారికి ఇది బలమైన ఎత్తుగడ అయినా గేమ్ మొత్తానికి అది ఉపయోగపడదు. ఒకవేళ నేను క్యూజీ5, హెచ్4తో వెళ్తే ఇది ఆశ్చర్యకరమైన ఎత్తు. కానీ కేవలం క్యూడీ8 వల్ల గేమ్ డ్రా వైపు వెళ్లింది. గేమ్‌లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఓపెనింగ్ సన్నాహకాలపై కూడా సంతృప్తిగా ఉన్నా. తర్వాతి గేమ్‌కు భిన్నంగా సిద్ధమవుతా’
- ఆనంద్