మరిన్ని టోర్నీలు ఆడతా
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండో ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన... ఆటకు స్వస్తి చెప్పాలనే ఆలోచన తనకేమాత్రం లేదని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పష్టం చేశాడు. తన కెరీర్‌లో ఇంకా గొప్ప ఫలితాలు రావాల్సి ఉన్నాయని... వచ్చే ఏడాది మరిన్ని టోర్నమెంట్లలో బరిలోకి దిగుతున్నానని ఈ ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ వెల్లడించాడు.
ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ఆటతీరు భిన్నంగా ఉంటుందని... అతను ప్రాక్టీస్‌కంటే గేమ్‌లో అప్పటికపుడు వచ్చే ఆలోచనలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడని హైదరాబాద్‌లో శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఒకవైపు క్రీడాకారుడిగా కొనసాగుతూ... మరోవైపు శిక్షణ ఇవ్వడం అనేది కష్టంతో కూడుకున్న పని అని తెలిపాడు.
రిటైరయ్యాకే శిక్షణ ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తానని అన్నాడు. తమ ఆటలోని లోపాలను సరిదిద్దుకునేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకోవడం మంచిదే అని 45 ఏళ్ల ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరి నుంచైనా అత్యుత్తమ శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నిస్తే తప్పులేదని... విద్యావిధానంలో చెస్‌ను పాఠ్యాంశంగా చేర్చితే మంచిదే అని ఆనంద్ తెలిపాడు.