ఆశల పల్లకిలో హారిక
టెహరాన్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో (2012, 2015) కాంస్య పతకాలు సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. శనివారం ఇరాన్‌లోని టెహరాన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగు అమ్మాయి నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. శని వారం జరిగే తొలి రౌండ్ తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమాతో హారిక తలపడుతుంది.
మొత్తం 64 మంది క్రీడాకారిణుల మధ్య నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీ మార్చి 3వ తేదీన ముగుస్తుంది. సెమీఫైనల్ దశ వరకు ఇద్దరు క్రీడాకారిణుల మధ్య రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన క్రీడాకారిణికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు సమంగా ఉంటే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. భారత్ నుంచి మరో ప్లేయర్ పద్మిని రౌత్ కూడా బరిలోకి దిగుతోంది.