ప్రతి రంగంలో కొన్ని చరిత్రాత్మక క్షణాలు ఉంటాయి. చదరంగంలో మన దేశానికిప్పుడు అలాంటి క్షణాలే. బుడాపెస్ట్‌లో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు... యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం. మన ఆటగాళ్ళు తొలిసారిగా అటు ఓపెన్, ఇటు మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలు సాధించి, దేశానికి మరువలేని కానుక ఇచ్చారు. చైనా, సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే. అలాగే, గుకేశ్, అర్జున్, దివ్య, వంతికల 4 వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది.
విశ్వనాథన్ ఆనందన్ బాటలో నడిచిన ఆయన శిష్యబృందం దేశాన్ని సమున్నతంగా నిలిపింది. కేవలం పదేళ్ళ క్రితం ఆశ్చర్యకరంగా కాంస్యం గెలిచి ఒలింపియాడ్‌లో బోణీ కొట్టిన దేశం, గడచిన 2022లో రెండు విభాగాల్లోనూ కాంస్యాలకే పరిమితమైన దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం. ఒక్కమాటలో నిన్న మొన్నటి దాకా చెస్‌లో సాగిన యూరోపియన్ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడింది. ఆటకు భవిష్యత్ చిరునామాగా భారత్ ఆవిర్భవించింది. చదరంగంలో అక్షరాలా మన స్వర్ణయుగం ఆరంభమైంది.
ఒలింపిక్స్ పోటీల్లో స్థానం లేని చెస్‌కు సంబంధించినంత వరకు ఈ చెస్ ఒలింపియాడే... ఒలింపిక్స్. అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో... 193 దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లు పాల్గొన్న ఓపెన్ విభాగంలో, 181 దేశాలు పోటీపడ్డ మహిళా విభాగంలో మన జట్లు స్వర్ణాలు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి దేశం నుంచి అయిదుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల జట్లు ఆ యా విభాగాల్లో పోటీ పడతాయి.
అలాంటి చోట ఓపెన్ విభాగంలో తొమ్మిదో రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన ఆటను డ్రా చేయడం తప్ప, మొత్తం 11 రౌండ్లకు గాను 10 రౌండ్లు మన భారత జట్టు గెలిచింది. టైటిల్ విజేతగా నిలిచింది. అంతేకాక 21 పాయింట్ల రికార్డ్ స్కోర్ సాధించి, రెండోస్థానంలో నిలిచిన 17 పాయింట్ల అమెరికా కన్నా చాలా పైన మనం నిలవడం విశేషం. మహిళా విభాగంలోనూ మొత్తం 11 రౌండ్లలో, ఒక్క 8వ రౌండ్‌లో పోలండ్‌తోనే మన జట్టు ఓడింది. అమెరికాతో ఆటను డ్రా చేసి, మొత్తం 19 పాయింట్లు సాధించి, స్వర్ణం సాధించింది. కనివిని ఎరుగని ఈ జంట విజయాల కారణంగానే ఇవాళ మన క్రీడా ప్రపంచం సంబరాలు చేసుకుంటోంది.
మొత్తం మీద భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్ళీ పుట్టినింటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ ఒలింపియాడ్ విజయాలు దేశవ్యాప్తంగా మన యువతరంలో దాగిన చదరంగ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. గుకేశ్ దొమ్మరాజు లాంటి మన ఆటగాళ్ళు కొందరు వ్యక్తిగత స్వర్ణాలు సైతం సాధించడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ లాంటి కొందరి పేర్లే వినిపించిన దేశంలో ఇటీవల దాదాపు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉద్భవించారు. వారిలో పలువురు 20వ పడిలో వారే.
అయిదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియనైన మ్యాగ్నస్ కార్ల్‌సెన్‌ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద లాంటి టీనేజ్ వండర్లు మనకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ తదితరులు మన పురుషుల జట్టులో ఉన్నారు. అలాగే, అనుభవమున్న కోనేరు హంపి జట్టులో లేకున్నా, ఒకట్రెండు తడబాట్లు ఎదురైనా సరే పట్టువదలక పోరాడి, ఒలింపియాడ్ విజయం సాధించిన ఆడపిల్లల జట్టు ఈ రోజున మనకుంది. అంతకంతకూ పెరుగుతున్న మన బలానికీ, బలగానికీ అది గీటురాయి.
పోగుబడ్డ ప్రతిభావంతులకు నిరంతర సాధన, నిరుపమానమైన టీమ్ స్పిరిట్ కూడా తోడై తాజా అందలాన్ని ఎక్కించాయి. అదే సమయంలో మన ప్రస్తుత విజయ పరంపరకు స్ఫూర్తి... ప్రజ్ఞానంద, గుకేశ్ లాంటి పలువురికి చేయూతనిచ్చిన దీప్తి... శిక్షణకు ఎంతో ఖర్చయ్యే ఈ ఆటలో వర్ధిష్ణువులెందరికో స్పాన్సర్‌షిప్‌లు దక్కేలా తోడ్పడ్డ తెర వెనుక దీప్తి... 15వ వరల్డ్ చెస్ ఛాంపియనైన విశ్వనాథన్ ఆనంద్ అని మర్చిపోలేం. ప్రతిభ గల పిల్లల్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఒక వాతావరణాన్నీ, వ్యవస్థనూ కల్పించిన ఆలిండియా చెస్ ఫెడరేషన్ కృషినీ చెప్పుకొని తీరాలి.
పెరిగిన సోషల్ మీడియా, హద్దులు లేని డిజిటల్ వ్యాప్తి సైతం మన యువతరాన్ని చెస్ వైపు ఆకర్షించిందీ నిజమే. భారతీయ స్ట్రీమింగ్ వేదికల్లో బాగా పాపులరైన చెస్‌బేస్ ఇండియాకు దాదాపు 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. ఆ వేదిక వివిధ టోర్నీల నిర్వహణతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పలువురు ఆటగాళ్ళకు ఆర్థికంగా అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడీ ఒలింపియాడ్ డబుల్ ధమాకా స్వర్ణాలు చెస్ ప్రాచుర్యంతో పాటు పిల్లల్లో ఆసక్తి పెంచడం ఖాయం.
భారత చదరంగానికి ఇది శుభతరుణం. త్వరలో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చైనీస్ ఛాంపియన్‌తో 18 ఏళ్ళ మన గుకేశ్ పోరు కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు కాక, కనీసం మరో అరడజను మంది ఒలింపియాడ్‌లో స్థానం కోసం పోటీపడుతున్న స్థాయికి చేరాం. అయితే, ఇది చాలదు. ఆడపిల్లల్లో మన చెస్ బలగం ఇంకా పెరగాల్సి ఉంది. ఇదే అదనుగా కేంద్రం, రాష్ట్రాలు మరింత ప్రోత్సాహం అందించాలి.
పాఠశాలల స్థాయి నుంచే చెస్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. బడుల్లోనే కాక గ్రంథాలయాల్లో, స్థానిక పట్టణ కేంద్రాల్లోనూ చెస్‌కు వసతులు కల్పించాలి. అలాగే మన దేశంలోనూ అగ్రశ్రేణి టోర్నీలు జరిగేలా చూడాలి. చెన్నై ఇవాళ చదరంగ ప్రతిభకు కేంద్రంగా మారిందంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చేయూత కారణం. అందరికీ అది ఆదర్శప్రాయం. స్వర్ణయుగం సుదీర్ఘంగా కొనసాగాలంటే ఇలాంటి చర్యలే కీలకం.
ఇది స్వర్ణయుగం
Published Wed, Sep 25 2024 5:05 AM | Last Updated on Wed, Sep 25 2024 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment