బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అర్జున్‌తోపాటు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు.
నాలుగో రౌండ్‌లో అర్జున్ 1.5–0.5తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విదిత్ 1.5–0.5తో ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స్) పై గెలుపొందారు. సిందరోవ్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ గురువారం జరిగిన రెండో గేమ్‌లో 60 ఎత్తుల్లో నెగ్గాడు.
బాక్రోట్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన విదిత్ గురువారం జరిగిన రెండో గేమ్‌ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో రెండు గేమ్‌లు ముగిశాక గుకేశ్ (భారత్)–ఎసిపెంకో (రష్యా); ప్రజ్ఞానంద (భారత్)–నకముర (అమెరికా); నిహాల్ (భారత్) –నెపోమ్‌నిశి (రష్యా) 1–1తో సమంగా ఉండటంతో వీరి మధ్య నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు.
మరోవైపు మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు. బెలా ఖొటె నాష్విలి (జార్జియా)తో తొలి గేమ్‌లో ఓడిన హంపి గురువారం జరిగిన రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. హారిక, ఎలైన్ రోబర్స్ (నెదర్లాండ్స్) మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 1–1తో సమంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment