గట్టెక్కిన ఆనంద్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో గేమ్‌లో ఓటమి అంచుల నుంచి గట్టెక్కాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) వేసిన దూకుడైన ఎత్తులకు తడబడినా... పుంజుకున్నాడు. దీంతో టోర్నీలో భాగంగా బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా ఇద్దరి స్కోరు 2-2తో సమంగా ఉంది. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ఆరంభించిన కార్ల్‌సెన్ 10వ ఎత్తుతో గేమ్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
బిషప్‌ను ఉపయోగించి వేసిన ఈ ఎత్తు కొత్తది కాకపోయినా... గతంలో మూడుసార్లే దీన్ని ఉపయోగించారు. ఓపెనింగ్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆనంద్... గేమ్ ముందుకు సాగేకొద్ది క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. క్వీన్‌సైడ్ పాన్‌ను త్యాగం చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. కార్ల్‌సెన్ మాత్రం రూక్‌తో ఎదురుదాడి చేస్తూ పోయాడు. దీనికి కంగారుపడ్డ విషీ... తప్పిదంలో మరో పాన్‌ను కోల్పోయాడు. అయితే ఈ దశలో గేమ్‌లో మరింత వేగం పెంచిన నార్వే ప్లేయర్ ఓ తప్పుడు నిర్ణయంతో మూల్యం చెల్లించుకున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆనంద్... 37వ ఎత్తుతో మళ్లీ గేమ్‌లో నిలిచాడు. కార్ల్‌సెన్ దగ్గర ఎక్స్‌ట్రా పాన్ ఉన్నా దాంతో పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయినా అతను గేమ్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపాడు. చివరకు రూక్స్, పాన్‌లతోనే తుది గేమ్ సాగింది. ఫైనల్ టైమ్ కంట్రోల్‌లో 90 సెకన్ల వ్యవధిలో మూడు ఎత్తులు వేయాల్సిన దశలో భారత ప్లేయర్ దాన్ని అద్భుతంగా అధిగమించాడు. దీంతో చేసేదేమీ లేక కార్ల్‌సెన్ డ్రాకు అంగీకరించాడు. గురువారం విశ్రాంతి దినం. ఐదో గేమ్ శుక్రవారం జరుగుతుంది.