vishawanathan anand
-
ఆనంద్, కార్ల్సన్ గేమ్ డ్రా
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ (భారత్) ‘డ్రా’ చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్‌కు పలుమార్లు గెలిచే అవకాశాలు వచ్చినా వ్యూహాల్లో తప్పిదాలతో చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. తెల్లపావులతో ఆడిన ఆనంద్ 53 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఆనంద్, కార్ల్సన్లతోపాటు ఈ టోర్నీలో ఫాబియానో కరువానా (ఇటలీ), అనీష్ గిరి (నెదర్లాండ్స్), వెస్లీ సో (అమెరికా), వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), మాక్సిమ్ లెగ్రేవ్ (ఫ్రాన్స్), మమెదైరోవ్ (అజర్బైజాన్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్) బరిలో ఉన్నారు. లక్ష యూరోల ప్రైజ్‌మనీతో పది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఈనెల 26న ముగుస్తుంది. -
ఐదో గేమ్ లో విశ్వనాథన్ ఆనంద్‌కు చుక్కెదురు
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఐదో గేమ్‌లో చుక్కెదురైంది. మాగ్నస్ కార్ల్‌సెన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆనంద్ ఓటమి చవిచూశాడు. విశ్వనాథన్ ఆనంద్ ఎత్తుల్ని ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ చాకచక్యంతో అధిగమించి తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు జరిగిన నాలుగు గేమ్‌లను డ్రా చేసుకుని సమ ఉజ్జీలుగా ఉన్నా, తాజాగా కార్ల్సెన్ దూకుడుగా ఆడి గెలుపు బావుటా ఎగురవేశాడు. బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. బుధవారం జరిగిన ఈమ్యాచ్ తరువాత ఒకరోజు విరామం లభించింది. ఈ రోజు ఇద్దరు మధ్య ఆసక్తికర పోరు జరిగినా ఓటమి చతికిలబడ్డాడు. -
గట్టెక్కిన ఆనంద్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో గేమ్‌లో ఓటమి అంచుల నుంచి గట్టెక్కాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) వేసిన దూకుడైన ఎత్తులకు తడబడినా... పుంజుకున్నాడు. దీంతో టోర్నీలో భాగంగా బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా ఇద్దరి స్కోరు 2-2తో సమంగా ఉంది. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ఆరంభించిన కార్ల్సెన్ 10వ ఎత్తుతో గేమ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. బిషప్‌ను ఉపయోగించి వేసిన ఈ ఎత్తు కొత్తది కాకపోయినా... గతంలో మూడుసార్లే దీన్ని ఉపయోగించారు. ఓపెనింగ్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆనంద్... గేమ్ ముందుకు సాగేకొద్ది క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. క్వీన్సైడ్ పాన్‌ను త్యాగం చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. కార్ల్సెన్ మాత్రం రూక్తో ఎదురుదాడి చేస్తూ పోయాడు. దీనికి కంగారుపడ్డ విషీ... తప్పిదంలో మరో పాన్‌ను కోల్పోయాడు. అయితే ఈ దశలో గేమ్‌లో మరింత వేగం పెంచిన నార్వే ప్లేయర్ ఓ తప్పుడు నిర్ణయంతో మూల్యం చెల్లించుకున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆనంద్... 37వ ఎత్తుతో మళ్లీ గేమ్‌లో నిలిచాడు. కార్ల్సెన్ దగ్గర ఎక్స్ట్రా పాన్ ఉన్నా దాంతో పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయినా అతను గేమ్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపాడు. చివరకు రూక్స్, పాన్లతోనే తుది గేమ్ సాగింది. ఫైనల్ టైమ్ కంట్రోల్లో 90 సెకన్ల వ్యవధిలో మూడు ఎత్తులు వేయాల్సిన దశలో భారత ప్లేయర్ దాన్ని అద్భుతంగా అధిగమించాడు. దీంతో చేసేదేమీ లేక కార్ల్సెన్ డ్రాకు అంగీకరించాడు. గురువారం విశ్రాంతి దినం. ఐదో గేమ్ శుక్రవారం జరుగుతుంది. -
ఇరువురూ సమానమే
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రెండో గేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి వేసిన ఆశ్చర్యకరమైన ఓపెనింగ్ ఎత్తుగడను తన అనుభవాన్నంతా రంగరించి సమర్థంగా తిప్పికొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కార్ల్సెన్ (నార్వే) వేగంగా భిన్నమైన ఎత్తులు వేసినా... విషీ మాత్రం నెమ్మదిగా ‘చెక్’ పెట్టాడు. చివరి దాకా ప్రతి ఎత్తుకు గేమ్‌ను మారుస్తూ పోయిన కార్ల్సెన్కు అవకాశం లేకపోవడంతో డ్రా వైపు మొగ్గాడు. దీంతో చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరువురు ఆటగాళ్ల మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. స్కోరు 1-1తో సమమైంది. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం మూడో గేమ్ జరుగుతుంది. నల్లపావులతో బరిలోకి దిగిన కార్ల్సెన్ ఓపెనింగ్ ఎత్తుగడతోనే ఆనంద్‌ను దాదాపుగా కట్టిపడేశాడు. దీని నుంచి తేరుకునేందుకు సమయం తీసుకున్న విషీ... గేమ్ క్లిష్టమైన కారోకాన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా బయటకు తీసుకొచ్చాడు. గతంలో డింగ్ లారెన్ (చైనా)తో ఆడిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సంక్లిష్టమైన ఎత్తులను అవలంభించేందుకు కొంత సమయం తీసుకున్నా... రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించాడు. నల్లపావులతో ఆడిన కార్ల్సెన్ సంక్లిష్టమైన ఎత్తులతో భిన్నంగా ఆడాడు. 17 ఎత్తుల వరకు ఇద్దరు ఆటగాళ్లు గేమ్‌ను సాదాసీదాగా కొనసాగించారు. క్వీన్‌ను మార్చుకుంటూ ఆనంద్ వేసిన 18వ ఎత్తుతో గేమ్ మలుపు తీసుకుంది. అప్పటికప్పుడు ఇలాంటి కొత్త ఆలోచన చేసిన భారత ఆటగాడికి గేమ్‌లో ముందుకెళ్లేందుకు అవకాశం లభించినా... ఎత్తులు మాత్రం పునరావృతమయ్యాయి. 21వ ఎత్తు వరకు ఇది కొనసాగింది. మరో నాలుగు ఎత్తుల తర్వాత కార్ల్సెన్ కూడా ఎత్తులను పునరావృతం చేసే అవకాశం ఉండటంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. గేమ్ మొత్తంలో కార్ల్సెన్ 25 నిమిషాలు తీసుకుంటే ఆనంద్ 42 నిమిషాల పాటు ఆలోచించాడు. 12వ ఎత్తు తర్వాత కార్ల్సెన్ కీలకమైన ఎత్తు వేశాడు. గతంలో దీన్ని పరిశీలించా. ఇది క్లిష్టమైన ఎత్తు. ఇలాంటిది ఎదురవుతుందని ఊహించలేదు. కార్ల్సెన్ వేసిన ఓపెనింగ్ ఎత్తుతోనే గేమ్‌లో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దీంతో గుడ్డిగా ఆడకుండా కాస్త పటిష్టమైన ఎత్తుతో ముందుకెళ్లా. నేను తీసుకున్న మెరుగైన నిర్ణయం ఇది. - ఆనంద్ ఓపెనింగ్ ఎత్తుగడ గురించి ఎక్కువగా మాట్లాడను. అయితే 18వ ఎత్తు తర్వాత క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. దీని తర్వాత విషీ చాలా ప్రయత్నించాడు. కానీ బ్లాక్‌తో ఆడినందుకు బయటపడ్డా. ఈ టోర్నీలో నేను ఎలా ఆడాలనుకున్నానో రెండో గేమ్ దానికి దగ్గరగా ఉంది. ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న వారిలో ఆనంద్ చాలా బలమైన ప్రత్యర్థి. - కార్ల్సెన్ రెండో గేమ్ మెరుగ్గా సాగింది ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య గంటలోనే ముగిసిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఎత్తుల పరంగా చూస్తే తొలి గేమ్ కంటే ఈ గేమ్ చాలా మెరుగైంది. అయితే 30 నిమిషాలు ముందుగానే గేమ్‌ను ముగించారు. ఈ గేమ్‌లో ఎవరు పైచేయి సాధించారనే అంశాన్ని అంచనా వేసే ముందు గేమ్‌ను పరిశీలిద్దాం. చెస్ టర్మ్స్ ప్రకారం కింగ్పాన్తో ఆనంద్ ఒకటవ ఎత్తుగా ఈ4 వేశాడు. దీనికి సమాధానంగా కార్ల్సెన్ సీ6తో ముందుకొచ్చాడు. ఇది కారోకాన్ డిఫెన్స్ అని తెలిసిపోయింది. చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉపయోగించే పటిష్టమైన ఓపెనింగ్ ఇది. అయితే ఆనంద్ వేసిన ఈ4కు వ్యతిరేకంగా కార్ల్సెన్ చాలా రకాల ఓపెనింగ్స్‌ను ఎంచుకోవచ్చు. సాధారణంగా సీ5 లేదా ఈ5తో ఆడొచ్చు. కాబట్టి కార్ల్సెన్ కారోకాన్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం ఆనంద్‌కు ఆశ్చర్యకరమైన అంశమే. ఇంటి దగ్గర గేమ్ గురించి విశ్లేషించుకున్న అంశాలను ఆటగాళ్లు బాగా గుర్తుంచుకుంటారు కాబట్టి ఓపెనింగ్ ఎత్తులు వేగంగా వేస్తారు. అయితే ఈ గేమ్‌లో క్లిష్టమైన దశ ఏంటంటే ఆనంద్ ఎన్ఈ4తో 15వ ఎత్తు వేయడం. చాలా పావులను మార్చుకుంటూ (ఎక్ఛేంజ్) వరుసగా ఎత్తులు వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్వీన్స్‌ను ఎక్ఛేంజ్ చేసుకున్న తర్వాత గేమ్ సమానం కావడంతో 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. కానీ ఏ ఆటగాడికీ లాభం లేకపోయింది. ఈ గేమ్ కోసం ఆనంద్ బాగా సిద్ధమై ఉంటాడు. కానీ ఇలాంటి భిన్నమైన ఎత్తులను ఊహించి ఉండడు. ఆనంద్ ఎన్ఈ4తో వేసిన 15వ ఎత్తు రక్షణాత్మకం. ఇది ప్రాక్టికల్‌గా చాలా మంచి నిర్ణయం. ఈ రెండు గేమ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఒకటో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ కేవలం 16 ఎత్తుల్లోనే సులువైన డ్రా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో కార్ల్సెన్ ఆశ్చర్యకరమైన ఓపెనింగ్‌తో టాప్ ఆటగాడిగా మారిపోయాడు. అయితే రక్షణాత్మక ఎత్తుగడతో ఆనంద్ ఈ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నా ఉద్దేశం ప్రకారం ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం ఆశ్చర్యపర్చుకున్నారు. ఇద్దరూ ప్రాక్టికల్ ప్లేయర్లే. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా డ్రా చేసుకున్నారు. ఇందులో ఒకరిపై మరొకరికి మానసికంగా ఎలాంటి లాభం చేకూరిందో ఇప్పటికీ స్పష్టం కాలేదు. నేడు విశ్రాంతి దినం. ఆటగాళ్లు మంచి విశ్రాంతి తీసుకొని మూడో గేమ్‌నైనా రసవత్తరంగా మార్చుతారని ఆశిద్దాం! -
సాదాసీదా ఆరంభం
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తొలి సమరాన్ని తనదైన శైలిలో ఆరంభించాడు. నిర్దిష్ట సమయంలో సరైన ఎత్తులు వేస్తూ వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ను (నార్వే) నిలువరించాడు. అనుభవానికి, దూకుడుకు మధ్య జరిగిన ఈ సమరంలో ఫలితం వస్తుందని ఊహించినా... చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య శనివారం జరిగిన తొలి గేమ్ సాదా సీదాగా 16 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. నల్లపావులతో గేమ్ ఆడిన ఆనంద్... ఓపెనింగ్‌తోనే తన సత్తాను చూపెట్టాడు. ఈ టోర్నీ కోసం తాను ఎంతలా సిద్ధమయ్యాడో చెస్ ప్రపంచానికి తెలియజేశాడు. తెల్లపావులతో ‘రెటీ’ ఓపెనింగ్‌తో బరిలోకి దిగిన కార్ల్సెన్కు విషీ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఓపెనింగ్ కోసం నార్వే గ్రాండ్‌మాస్టర్ చాలా సమయం తీసుకున్నా గేమ్ మధ్యలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అతను కొన్నిసార్లు పేలవమైన ఎత్తులు వేశాడు. ఆనంద్ వేసిన 10వ ఎత్తు తర్వాత కార్ల్సెన్కు గేమ్‌లో ముందుకు సాగేందుకు సరైన అవకాశం లభించలేదు. దీంతో బలవంతంగా కొన్ని ఎత్తులను పునరావృతం చేశాడు. ఆనంద్ నైట్‌తో; కార్ల్సెన్ క్వీన్‌తో వేసిన ఎత్తులు మూడుసార్లు పునరావృతం అయ్యాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రావైపు మొగ్గారు. గ్రున్ఫీల్డ్ వ్యూహానికి దగ్గరగా ఎత్తులు వేసిన ఆనంద్ లాక్డ్ స్ట్రక్చర్‌కు వెళ్లలేదు. భారత ఆటగాడు కోరుకున్నట్లే 9వ ఎత్తు తర్వాత గేమ్‌లో అసమతుల్యత వచ్చింది. దీంతో 10వ ఎత్తు తర్వాత కార్ల్సెన్కు అవకాశం లేకపోయింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో ఆనంద్.. తెల్లపావులతో ఆడతాడు. ఆనంద్‌ది అరుదైన ఎత్తు ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన తొలి గేమ్ కేవలం 16 ఎత్తుల్లోనే ఎందుకు డ్రా అయిందని చాలామంది అడుగుతున్నారు. మ్యాచ్ సమయంలో కనిపించినట్లు కార్ల్సెన్ ఆందోళనలో ఉన్నాడా? అని అడుగుతున్నారు. అయితే గేమ్‌ను పూర్తిగా పరిశీలించకుండా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆటగాళ్ల మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ముందుగా గేమ్‌లో ఏం జరిగిందో చూద్దాం. తర్వాత ఒక్కో ఆటగాడి మనస్తత్వాన్ని పరిశీలిద్దాం. కార్ల్సెన్ ఎన్ఎఫ్3తో గేమ్‌ను మొదలుపెట్టాడు. దీనికి సమాధానంగా ఆనంద్ డి5 ఎత్తు వేశాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. గత టోర్నీల్లో విషీ... నిమ్జో ఇండియన్ వ్యూహాలకు దగ్గరగా ఆడేవారు. అయితే డి5 ఎత్తుతో ఈ గేమ్‌లో అతను ఓపెనింగ్‌ను మార్చాడు. రెటీ ఓపెనింగ్‌తో కొనసాగిన గేమ్ తర్వాత ప్రఖ్యాత ఓపెనింగ్ అయిన నెగ్రూన్ఫీల్డ్ డిఫెన్స్‌లోకి మారిపోయింది. ఇలా మారేటప్పుడు ప్రధానమైన దశ ఏంటంటే... గేమ్‌లో అధ్వాన్న స్థితికి పడిపోకుండా ప్రతి ఆటగాడు తనకున్న ఇతర అవకాశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కార్ల్సెన్ 9వ ఎత్తు వేసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సవాళ్ల కోసం సిద్ధమయ్యారు. నల్లపావులతో ఆనంద్ 9వ ఎత్తు తర్వాత డీసీ4తో ముందుకొచ్చాడు. చాలా అరుదుగా ఇలా ఆడతారు. టాప్‌లో ఉన్న ఏ ఒక్క ఆటగాడు కూడా ఇలాంటి ఎత్తు వేయరు. దీంతో కార్ల్సెన్ లోతైన ఆలోచనలో పడిపోయాడు. ఈ సమయంలో అతను నెర్వస్‌గా ఉన్నాడా అంటే? నా సమాధానం ‘కాదు’ అనే వస్తుంది. ఆనంద్ చేసిన కొత్త ఆలోచనకు కార్ల్సెన్ టీమ్ సరైన రీతిలో సిద్ధంకాలేదు. కాబట్టి ఎలాంటి ఎత్తును ఎంచుకోవాలన్న అంశంపై అతను కసరత్తులు మొదలుపెట్టాడు. 10వ ఎత్తు ఎన్బీ6, తర్వాత ఎన్సీ4... ఈ రెండు ఆనంద్ వేసిన ఆసక్తికరమైన ఎత్తులు. ఆనంద్ నైట్ సీ4 మీద ఉండటంతో బిషప్‌ను బీ2 మీద వదిలేసిన కార్ల్సెన్ బీసీ1తో 12వ ఎత్తును కొనసాగించాడు. అయితే దీన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే బ్లాక్‌తో ఆడేవాళ్లకు డబుల్ బిషప్‌లు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. 13వ ఎత్తు క్యూబీ3 తర్వాత గేమ్ ‘డ్రా’ అవుతుందని స్పష్టంగా అర్థమైంది. కార్ల్సెన్ సుదీర్ఘంగా ఆలోచించడానికి ఇది కూడా ఓ కారణం. గేమ్‌ను కొనసాగించేందుకు కొన్ని దారులను వెతికాడు. గేమ్‌లో ముందుకుపోయి రిస్క్ తీసుకోవడం కంటే ప్రాక్టికల్‌గా ‘డ్రా’వైపు మొగ్గాడు. తన అంచనాలకు అనుగుణంగా గేమ్ జరగకపోవడంతో తెల్లపావులతో కార్ల్సెన్... ఆనంద్‌పై స్థిరంగా ఒత్తిడి కలిగించలేకపోయాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఫలితం అతనికి పెద్దగా సంతృప్తినివ్వకపోవచ్చు. మరోవైపు ఈ ఫలితంతో విషీ ఆనందపడి ఉంటాడు. నల్లపావులతో గేమ్‌ను డ్రా చేసుకోవడం సానుకూల అంశం. ఓపెనింగ్‌లో ఆనంద్‌దే పైచేయి అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. 2 లేదా 4 గేమ్‌లు జరిగితే ప్రత్యర్థి బలహీనతలు, వ్యూహాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటగాళ్లు పరస్పరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేడు ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. తొలి గేమ్ మాదిరిగానే కార్ల్సెన్పై ఒత్తిడి పెంచి ఫలితాన్ని సాధిస్తాడని ఆశిద్దాం!