ఆనంద్, కార్ల్‌సన్ గేమ్ డ్రా
షామ్‌కిర్ (అజర్‌బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ (భారత్) ‘డ్రా’ చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్‌కు పలుమార్లు గెలిచే అవకాశాలు వచ్చినా వ్యూహాల్లో తప్పిదాలతో చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు.
తెల్లపావులతో ఆడిన ఆనంద్ 53 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఆనంద్, కార్ల్‌సన్‌లతోపాటు ఈ టోర్నీలో ఫాబియానో కరువానా (ఇటలీ), అనీష్ గిరి (నెదర్లాండ్స్), వెస్లీ సో (అమెరికా), వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), మాక్సిమ్ లెగ్రేవ్ (ఫ్రాన్స్), మమెదైరోవ్ (అజర్‌బైజాన్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), రవూఫ్ మమెదోవ్ (అజర్‌బైజాన్) బరిలో ఉన్నారు. లక్ష యూరోల ప్రైజ్‌మనీతో పది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఈనెల 26న ముగుస్తుంది.