grand masters
-
వైశాలి సరికొత్త చరిత్ర.. తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచ రికార్డు
Vaishali- R Praggnanandhaa: చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్ చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన మూడో మహిళగా రికార్డు సాధించింది. IV Elllobregat- 2023 ఓపెన్‌లో భాగంగా శనివారం నాటి గేమ్‌తో రేటింగ్ పాయింట్లలో 2500 మార్కును దాటి ఈ ఫీట్ నమోదు చేసింది. ఇక గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించడంతో పాటు తన సోదరడు ఆర్. ప్రజ్ఞానందతో కలిసి మరో ప్రపంచ రికార్డును కూడా వైశాలి తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన వైశాలికి చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద సొంత తమ్ముడు. తమ్ముడితో కలిసి ప్రపంచ రికార్డు ఇప్పటికే గ్రాండ్‌మాస్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్ కావడం, క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడంతో చెస్ చరిత్రలో.. ఈ ఘనత సాధించిన తొలి సోదర-సోదరీ(తోబుట్టువులు) ద్వయంగా వీళ్లిద్దరు అరుదైన రికార్డు సాధించారు. సీఎం స్టాలిన్ అభినందనలు ఇక చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, దివ్యేందు బరువా, ఆర్. ప్రజ్ఞానంద తదితర గ్రాండ్మాస్టర్లతో పాటు వైశాలి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారని.. మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ఎక్స్ వేదికగా స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: ప్రజ్ఞానంద కుటుంబం గురించి తెలుసా?! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! చదవండి: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్ Huge congrats, @chessvaishali, on becoming the third female Grandmaster from India and the first from Tamil Nadu! 2023 has been splendid for you. Alongside your brother @rpragchess, you've made history as the first sister-brother duo to qualify for the #Candidates tournament.… pic.twitter.com/f4I89LcJ5O — M.K.Stalin (@mkstalin) December 2, 2023 -
గళమెత్తిన చెస్ క్రీడాకారులు
చెన్నై: క్రికెట్ క్రేజీ భారత్‌లో చదరంగం రారాజులూ ఉన్నారు. కానీ చెస్ ప్లేయర్లకు ఆదరణ అనేది ఉండదు. పాపులారిటీ పక్కనబెడితే ప్రభుత్వానికైతే అందరు ఆటగాళ్లు సమానమే కదా! మరి తమపై ఈ శీతకన్ను ఏంటని గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) వాపోతున్నారు. అవార్డులు, పురస్కారాల సమయంలో (నామినేషన్లు) తామెందుకు కనపడమో అర్థమవడం లేదని మూకుమ్మడిగా గళమెత్తారు. నిజమే. చెస్ ఆటగాళ్ల గళానికి విలువ ఉంది. ఆవేదనలో అర్థముంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న చెస్ ప్లేయర్లను భారత ప్రభుత్వం తరచూ అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విస్మరించడం ఏమాత్రం తగని పని. పైగా వీళ్లంతా వారి వారి సొంత ఖర్చులతోనే గ్రాండ్‌మాస్టర్ హోదాలు పొందారు. గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)ల ఎదుగుదలకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చేసేది శూన్యం. ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకం లేకపోగా... కనీసం సొంతంగా ఎదిగిన వారికి పురస్కారాలు ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహించడం మరింత విడ్డూరం. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ రెండేళ్లుగా ‘అర్జున’కు దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేదు. దాంతో అతను అవార్డు గురించి పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి సారించాడు. ఇటీవలే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తన శిక్షణతో పలువురు గ్రాండ్మాస్టర్లను తయారు చేశారు. ప్రపంచ చెస్‌లో జీఎం హోదా పొందిన రెండో అతి పిన్న వయస్కుడు ప్రజ్ఞానందతోపాటు జీఎంలు అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ తదితరులను ఈయనే తీర్చిదిద్దారు. కానీ ఇప్పటికీ రమేశ్‌కు ‘ద్రోణాచార్య’ లభించలేదు. చెస్‌లో ఇప్పటివరకు ఇద్దరికే ‘ద్రోణాచార్య’ పురస్కారం దక్కింది. 1986లో రఘునందన్ వసంత్ గోఖలే, 2006లో ఆంధ్రప్రదేశ్ జీఎం హంపి తండ్రి కోనేరు అశోక్ ఈ అవార్డు సాధించారు. ప్రపంచస్థాయిలో పేరు తెస్తే చెస్ ఆటగాళ్లను పురస్కారాలతో గుర్తించకపోవడం దారుణం. భారతీయులు క్రికెట్‌ను అర్థం చేసుకుంటారు. అత్యున్నతస్థాయి చెస్ ఆడే దేశాలు 190 వరకు ఉన్నాయి. క్రికెట్లో మాత్రం 12 దేశాలకు టెస్టు హోదా ఉండగా.. ఇందులో తొమ్మిదింటికే అగ్రశ్రేణి జట్లుగా గుర్తింపు ఉంది. చెస్‌లో 2700 ఎలో రేటింగ్ ఉన్నవారు ప్రపంచ క్రికెట్లోని టాప్–25 ఆటగాళ్లతో సమానం. –విశాల్ సరీన్, కోచ్ జాతీయ క్రీడా పురస్కారాలు 1961లో మొదలుకాగా ... ఇప్పటి వరకు చెస్‌లో 17 మందికి ‘అర్జున’ దక్కింది. చివరిసారి 2013లో జీఎం అభిజిత్ గుప్తాకు ‘అర్జున’ వరించింది. తమిళనాడుకు చెందిన ఆధిబన్ ఖాతాలో గొప్ప విజయాలే ఉన్నాయి. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం, 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2010 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2019 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2012లో అండర్–20 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అయినా ఇప్పటివరకు ఆధిబన్కు ‘అర్జున’ రాలేదు. బాధ పడాల్సిన విషయమేమిటంటే ‘అర్జున’ అవార్డు దరఖాస్తు పూరించేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కార్యాలయానికి వెళ్లగా అక్కడి సీనియర్ అధికారి నుంచి అవమానం ఎదురైంది. ‘ఏ అర్హతతో నువ్వు ‘అర్జున’ కోసం దరఖాస్తు చేసుకుంటున్నావు’ అని ఆధిబన్ను ఆయన ఎగతాళి చేయడం దారుణం. -
భారత పురుషుల జట్టు శుభారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేయగా... మహిళల జట్టుకు తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లో భారత్ 3-1 పాయింట్ల తేడాతో ఈజిప్టుపై గెలిచింది. తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్, దీప్ సేన్‌గుప్తా తమ ప్రత్యర్థులపై నెగ్గగా... సేతురామన్ ఓడిపోయాడు. చైనాలో జరుగుతున్న మహిళల చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లో భారత్ 1.5-2.5తో కజకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హారిక 34 ఎత్తుల్లో దినారా సదుకసోవాపై నెగ్గగా... జాన్సాయాతో జరిగిన గేమ్‌ను హంపి 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మిగతా రెండు గేముల్లో పద్మిని రౌత్ 41 ఎత్తుల్లో గులిస్ఖాన్ నఖ్బయేవా చేతిలో; మేరీ ఆన్‌గోమ్స్ 65 ఎత్తుల్లో దౌలెతోవా చేతిలో ఓడటంతో భారత ఓటమి ఖాయమైంది. -
ఆనంద్, కార్ల్సన్ గేమ్ డ్రా
షామ్‌కిర్ (అజర్బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ (భారత్) ‘డ్రా’ చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్‌కు పలుమార్లు గెలిచే అవకాశాలు వచ్చినా వ్యూహాల్లో తప్పిదాలతో చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకున్నాడు. తెల్లపావులతో ఆడిన ఆనంద్ 53 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. ఆనంద్, కార్ల్సన్లతోపాటు ఈ టోర్నీలో ఫాబియానో కరువానా (ఇటలీ), అనీష్ గిరి (నెదర్లాండ్స్), వెస్లీ సో (అమెరికా), వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), మాక్సిమ్ లెగ్రేవ్ (ఫ్రాన్స్), మమెదైరోవ్ (అజర్బైజాన్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్) బరిలో ఉన్నారు. లక్ష యూరోల ప్రైజ్‌మనీతో పది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఈనెల 26న ముగుస్తుంది. -
మనోళ్లకు నిరాశ
వరల్డ్ మైండ్ గేమ్స్ బీజింగ్: వరల్డ్ మైండ్ గేమ్స్ చెస్ ఈవెంట్లో పాల్గొన్న తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక నిరాశ పరిచారు. ర్యాపిడ్ ఈవెంట్లో ఈ ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు కనీసం టాప్-10లో నిలువలేకపోయారు. ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలోని పురుషుల విభాగంలో హరికృష్ణ 2.5 పాయింట్లతో 14వ స్థానంలో... మహిళల విభాగంలో 3 పాయింట్లతో హారిక 12వ స్థానంలో, 2 పాయింట్లతో హంపి 15వ స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్లో హారిక, హంపిలు ముఖాముఖిగా తలపడగా... 46 ఎత్తుల్లో ఈ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మంది చొప్పున ఈ టోర్నీలో పాల్గొన్నారు. మహిళల విభాగంలో 5.5 పాయింట్లతో వాలంటీనా గునీనా (రష్యా), పురుషుల విభాగంలో 5 పాయింట్లతో అలెగ్జాండర్ గ్రిస్చుక్ (రష్యా) స్వర్ణ పతకాలను సాధించారు. ఇదే టోర్నీలో బ్లిట్జ్ ఈవెంట్ గేమ్‌లు శనివారం ప్రారంభమవుతాయి. -
హరికృష్ణకు ఏడో స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో హరికృష్ణ 37 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నమెంట్లో హరికృష్ణ మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఐదు ‘డ్రా’లతో ఐదున్నర పాయింట్లు సంపాదించాడు. ఎనిమిది పాయింట్లతో లెవాన్ అరోనియన్ (అర్మేనియా) విజేతగా నిలిచాడు. -
హంపి, హారిక గేమ్ డ్రా
తాష్కెంట్: మళ్లీ అదే ఫలితం. ఈసారీ ఎవరూ గెలువలేదు. వరుసగా నాలుగోసారి ‘డ్రా’తో సంతృప్తి పడ్డారు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ సందర్భంగా ముఖాముఖి పోరులో తలపడిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక 59 ఎత్తుల్లో తమ గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ హంపిని నిలువరించడంలో ప్రపంచ 27వ ర్యాంకర్ హారిక సఫలమైంది. గతంలో ఈ ఇద్దరూ మూడుసార్లు ముఖాముఖిగా పోటీపడగా మూడుసార్లూ ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి, హారిక, కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్) నాలుగున్నర పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. బుధవారం జరిగే ఏడో రౌండ్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)తో హంపి; కాటరీనా లాగ్నోతో హారిక తలపడతారు. -
ఆనంద్ పిలుస్తాడేమో!
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదిహేడేళ్ల క్రితం ప్రపంచ అండర్-10 చాంపియన్‌షిప్‌లో గెలిచిననాటినుంచి ప్రపంచ చెస్‌లో తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2700 ఎలో రేటింగ్‌తో ఆనంద్ తర్వాత భారత్‌నుంచి రెండో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన అతను, ఇటీవల యూరోపియన్ సర్క్యూట్లో పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో రెండు టైటిల్స్ నెగ్గాడు. ఇటీవలి విజయాలు తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయని చెబుతున్న హరికృష్ణ తన ఆటకు సంబంధించి వివిధ అంశాలపై ‘సాక్షి’ తో ముచ్చటించాడు. విశేషాలు అతని మాటల్లోనే... బీల్ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శన... గత ఏడాది కూడా నేను ఈ టోర్నీ ఆడినా ఐదో స్థానం మాత్రమే దక్కింది. ఈ సారి రెండు విభాగాల్లో (మాస్టర్స్, ర్యాపిడ్) టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. సర్క్యూట్‌లోని అనేక మంది మెరుగైన గ్రాండ్‌మాస్టర్లు ఇందులో బరిలో నిలిచారు. డ్రాతో టోర్నీని మొదలు పెట్టి, ఆఖరి గేమ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో బాగా ఆడి టైటిల్ సాధించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలంగా నేను టీమ్ ఈవెంట్లే ఆడుతున్నాను. వ్యక్తిగత విభాగంలో ఏ టోర్నీ గెలిచినా విశేషమే. యూరోపియన్ సర్క్యూట్కే పరిమితం కావడం... తప్పడం లేదు! అక్కడ ఏడాదంతా చెస్ టోర్నీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో దేశంలో అక్కడి క్లబ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్నాను. ఆటలో బ్రేక్ రాదు...అటు రేటింగ్ పాయింట్లు దక్కుతాయి. నాకున్న రేటింగ్, ర్యాంకింగ్ వల్ల అనేక టోర్నీల్లో ఆడేందుకు ఆహ్వానాలు అందుతూనే ఉంటాయి. నా ప్రదర్శన కొనసాగాలంటే ఇది తప్పనిసరి. అక్కడ క్లబ్ టోర్నీలకు కూడా మంచి ఆదరణ ఉంది. కెరీర్లో వేగం తగ్గడం... అలా ఏమీ లేదు. అండర్-10, 12, 14లాంటి ఏజ్ గ్రూప్ కేటగిరీల్లో వేగంగా ఎదిగినంతగా సీనియర్ స్థాయిలో సాధ్యం కాదు. నా 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ అయి 2500 రేటింగ్ వరకు ఒక్కసారిగా దూసుకొచ్చాను. అయితే 2600 పాయింట్లు దాటిన తర్వాత గట్టి ప్రత్యర్థులు ఎదురవుతారు, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 2009లో నా కెరీర్ కొంత వెనుకబడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు కోలుకున్నాను. నిలకడగా విజయాలతో పాయింట్లు సాధిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ 2700 ఎలైట్ జాబితాలో చేరాను. ర్యాంకింగ్స్‌లో టాప్-40లో ఉన్నాను. కానీ పెద్ద టోర్నీల్లో విజయాలు లేవు కదా... ఎక్కువగా వార్తల్లో నిలిచే లినారెస్, తాల్ మెమోరియల్, డార్ట్మండ్, కోరస్ (టాటా)లాంటి పెద్ద టోర్నీల్లో అవకాశం అంత సులభంగా రాదు. అలాంటి ఒక్క టోర్నీ కూడా భారత్‌లాంటి దేశంలో లేకపోవడం దురదృష్టకరం. మన వద్ద జరిగితే నేరుగా దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం మనకు దక్కుతుంది. ప్రస్తుతం 2750 రేటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాను. కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. త్వరలో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌పై... చెస్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతంలో ఈ స్థాయి ఈవెంట్లో ఆడిన అనుభవం, ఒత్తిడిని ఎదుర్కోగలిగే సామర్ధ్యం ఆనంద్ బలాలు కాగా, వయసు కాస్త ప్రతిబంధకం కావచ్చు. అదే 22 ఏళ్ల కార్ల్సన్ బలం. అతని ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ అనుభవం లేకపోవడం వల్ల కీలక సమయాల్లో తడబడవచ్చు. అయితే ఆనంద్ కూడా బాగా సిద్ధమవుతున్నాడు. తనకు సహకరించే ‘సెకండ్స్’ను ఎంపిక చేసుకుంటున్నాడు. వారిలో గంగూలీ ఉండవచ్చు. నన్ను కూడా పిలుస్తాడని అనుకుంటున్నాను. ఇంకా నేరుగా పిలుపు రాలేదు. అవకాశం వస్తే ఆనంద్‌తో చేరడానికి సిద్ధం. ఆ రకంగానైనా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నేనూ భాగస్వామి కావచ్చు.