ఆనంద్ పిలుస్తాడేమో!
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదిహేడేళ్ల క్రితం ప్రపంచ అండర్-10 చాంపియన్‌షిప్‌లో గెలిచిననాటినుంచి ప్రపంచ చెస్‌లో తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2700 ఎలో రేటింగ్‌తో ఆనంద్ తర్వాత భారత్‌నుంచి రెండో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన అతను, ఇటీవల యూరోపియన్ సర్క్యూట్‌లో పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో రెండు టైటిల్స్ నెగ్గాడు. ఇటీవలి విజయాలు తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయని చెబుతున్న హరికృష్ణ తన ఆటకు సంబంధించి వివిధ అంశాలపై ‘సాక్షి’ తో ముచ్చటించాడు.
విశేషాలు అతని మాటల్లోనే...
బీల్ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శన...
గత ఏడాది కూడా నేను ఈ టోర్నీ ఆడినా ఐదో స్థానం మాత్రమే దక్కింది. ఈ సారి రెండు విభాగాల్లో (మాస్టర్స్, ర్యాపిడ్) టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. సర్క్యూట్‌లోని అనేక మంది మెరుగైన గ్రాండ్‌మాస్టర్లు ఇందులో బరిలో నిలిచారు. డ్రాతో టోర్నీని మొదలు పెట్టి, ఆఖరి గేమ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో బాగా ఆడి టైటిల్ సాధించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలంగా నేను టీమ్ ఈవెంట్‌లే ఆడుతున్నాను. వ్యక్తిగత విభాగంలో ఏ టోర్నీ గెలిచినా విశేషమే.
యూరోపియన్ సర్క్యూట్‌కే పరిమితం కావడం...
తప్పడం లేదు! అక్కడ ఏడాదంతా చెస్ టోర్నీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో దేశంలో అక్కడి క్లబ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్నాను. ఆటలో బ్రేక్ రాదు...అటు రేటింగ్ పాయింట్లు దక్కుతాయి. నాకున్న రేటింగ్, ర్యాంకింగ్ వల్ల అనేక టోర్నీల్లో ఆడేందుకు ఆహ్వానాలు అందుతూనే ఉంటాయి. నా ప్రదర్శన కొనసాగాలంటే ఇది తప్పనిసరి. అక్కడ క్లబ్ టోర్నీలకు కూడా మంచి ఆదరణ ఉంది.
కెరీర్‌లో వేగం తగ్గడం...
అలా ఏమీ లేదు. అండర్-10, 12, 14లాంటి ఏజ్ గ్రూప్ కేటగిరీల్లో వేగంగా ఎదిగినంతగా సీనియర్ స్థాయిలో సాధ్యం కాదు. నా 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ అయి 2500 రేటింగ్ వరకు ఒక్కసారిగా దూసుకొచ్చాను. అయితే 2600 పాయింట్లు దాటిన తర్వాత గట్టి ప్రత్యర్థులు ఎదురవుతారు, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 2009లో నా కెరీర్ కొంత వెనుకబడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు కోలుకున్నాను. నిలకడగా విజయాలతో పాయింట్లు సాధిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ 2700 ఎలైట్ జాబితాలో చేరాను. ర్యాంకింగ్స్‌లో టాప్-40లో ఉన్నాను.
కానీ పెద్ద టోర్నీల్లో విజయాలు లేవు కదా...
ఎక్కువగా వార్తల్లో నిలిచే లినారెస్, తాల్ మెమోరియల్, డార్ట్‌మండ్, కోరస్ (టాటా)లాంటి పెద్ద టోర్నీల్లో అవకాశం అంత సులభంగా రాదు. అలాంటి ఒక్క టోర్నీ కూడా భారత్‌లాంటి దేశంలో లేకపోవడం దురదృష్టకరం. మన వద్ద జరిగితే నేరుగా దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం మనకు దక్కుతుంది. ప్రస్తుతం 2750 రేటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాను. కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను.
త్వరలో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌పై...
చెస్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతంలో ఈ స్థాయి ఈవెంట్‌లో ఆడిన అనుభవం, ఒత్తిడిని ఎదుర్కోగలిగే సామర్ధ్యం ఆనంద్ బలాలు కాగా, వయసు కాస్త ప్రతిబంధకం కావచ్చు.
అదే 22 ఏళ్ల కార్ల్‌సన్ బలం. అతని ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ అనుభవం లేకపోవడం వల్ల కీలక సమయాల్లో తడబడవచ్చు. అయితే ఆనంద్ కూడా బాగా సిద్ధమవుతున్నాడు. తనకు సహకరించే ‘సెకండ్స్’ను ఎంపిక చేసుకుంటున్నాడు. వారిలో గంగూలీ ఉండవచ్చు. నన్ను కూడా పిలుస్తాడని అనుకుంటున్నాను. ఇంకా నేరుగా పిలుపు రాలేదు. అవకాశం వస్తే ఆనంద్‌తో చేరడానికి సిద్ధం. ఆ రకంగానైనా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నేనూ భాగస్వామి కావచ్చు.