హంపి, హారిక గేమ్ డ్రా
తాష్కెంట్: మళ్లీ అదే ఫలితం. ఈసారీ ఎవరూ గెలువలేదు. వరుసగా నాలుగోసారి ‘డ్రా’తో సంతృప్తి పడ్డారు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ సందర్భంగా ముఖాముఖి పోరులో తలపడిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక 59 ఎత్తుల్లో తమ గేమ్‌ను ‘డ్రా’గా ముగించారు. మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ మూడో ర్యాంకర్ హంపిని నిలువరించడంలో ప్రపంచ 27వ ర్యాంకర్ హారిక సఫలమైంది.
గతంలో ఈ ఇద్దరూ మూడుసార్లు ముఖాముఖిగా పోటీపడగా మూడుసార్లూ ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి, హారిక, కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్) నాలుగున్నర పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. బుధవారం జరిగే ఏడో రౌండ్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)తో హంపి; కాటరీనా లాగ్నోతో హారిక తలపడతారు.