భారత పురుషుల జట్టు శుభారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేయగా... మహిళల జట్టుకు తొలి రౌండ్‌లో ఓటమి ఎదురైంది. ఆర్మేనియాలో జరుగుతున్న పురుషుల చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో భారత్ 3-1 పాయింట్ల తేడాతో ఈజిప్టుపై గెలిచింది. తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్, దీప్ సేన్‌గుప్తా తమ ప్రత్యర్థులపై నెగ్గగా... సేతురామన్ ఓడిపోయాడు. చైనాలో జరుగుతున్న మహిళల చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో భారత్ 1.5-2.5తో కజకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హారిక 34 ఎత్తుల్లో దినారా సదుకసోవాపై నెగ్గగా... జాన్‌సాయాతో జరిగిన గేమ్‌ను హంపి 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మిగతా రెండు గేముల్లో పద్మిని రౌత్ 41 ఎత్తుల్లో గులిస్‌ఖాన్ నఖ్‌బయేవా చేతిలో; మేరీ ఆన్‌గోమ్స్ 65 ఎత్తుల్లో దౌలెతోవా చేతిలో ఓడటంతో భారత ఓటమి ఖాయమైంది.