సాదాసీదా ఆరంభం
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తొలి సమరాన్ని తనదైన శైలిలో ఆరంభించాడు. నిర్దిష్ట సమయంలో సరైన ఎత్తులు వేస్తూ వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను (నార్వే) నిలువరించాడు. అనుభవానికి, దూకుడుకు మధ్య జరిగిన ఈ సమరంలో ఫలితం వస్తుందని ఊహించినా... చివరకు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య శనివారం జరిగిన తొలి గేమ్ సాదా సీదాగా 16 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. నల్లపావులతో గేమ్ ఆడిన ఆనంద్... ఓపెనింగ్‌తోనే తన సత్తాను చూపెట్టాడు. ఈ టోర్నీ కోసం తాను ఎంతలా సిద్ధమయ్యాడో చెస్ ప్రపంచానికి తెలియజేశాడు.
తెల్లపావులతో ‘రెటీ’ ఓపెనింగ్‌తో బరిలోకి దిగిన కార్ల్‌సెన్‌కు విషీ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఓపెనింగ్ కోసం నార్వే గ్రాండ్‌మాస్టర్ చాలా సమయం తీసుకున్నా గేమ్ మధ్యలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే అతను కొన్నిసార్లు పేలవమైన ఎత్తులు వేశాడు. ఆనంద్ వేసిన 10వ ఎత్తు తర్వాత కార్ల్‌సెన్‌కు గేమ్‌లో ముందుకు సాగేందుకు సరైన అవకాశం లభించలేదు. దీంతో బలవంతంగా కొన్ని ఎత్తులను పునరావృతం చేశాడు.
ఆనంద్ నైట్‌తో; కార్ల్‌సెన్ క్వీన్‌తో వేసిన ఎత్తులు మూడుసార్లు పునరావృతం అయ్యాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రావైపు మొగ్గారు. గ్రున్‌ఫీల్డ్ వ్యూహానికి దగ్గరగా ఎత్తులు వేసిన ఆనంద్ లాక్డ్ స్ట్రక్చర్‌కు వెళ్లలేదు. భారత ఆటగాడు కోరుకున్నట్లే 9వ ఎత్తు తర్వాత గేమ్‌లో అసమతుల్యత వచ్చింది. దీంతో 10వ ఎత్తు తర్వాత కార్ల్‌సెన్‌కు అవకాశం లేకపోయింది. ఆదివారం జరిగే రెండో గేమ్‌లో ఆనంద్.. తెల్లపావులతో ఆడతాడు.
ఆనంద్‌ది అరుదైన ఎత్తు
ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య జరిగిన తొలి గేమ్ కేవలం 16 ఎత్తుల్లోనే ఎందుకు డ్రా అయిందని చాలామంది అడుగుతున్నారు. మ్యాచ్ సమయంలో కనిపించినట్లు కార్ల్‌సెన్ ఆందోళనలో ఉన్నాడా? అని అడుగుతున్నారు. అయితే గేమ్‌ను పూర్తిగా పరిశీలించకుండా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆటగాళ్ల మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ముందుగా గేమ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
తర్వాత ఒక్కో ఆటగాడి మనస్తత్వాన్ని పరిశీలిద్దాం. కార్ల్‌సెన్ ఎన్‌ఎఫ్3తో గేమ్‌ను మొదలుపెట్టాడు. దీనికి సమాధానంగా ఆనంద్ డి5 ఎత్తు వేశాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. గత టోర్నీల్లో విషీ... నిమ్‌జో ఇండియన్ వ్యూహాలకు దగ్గరగా ఆడేవారు. అయితే డి5 ఎత్తుతో ఈ గేమ్‌లో అతను ఓపెనింగ్‌ను మార్చాడు. రెటీ ఓపెనింగ్‌తో కొనసాగిన గేమ్ తర్వాత ప్రఖ్యాత ఓపెనింగ్ అయిన నెగ్రూన్‌ఫీల్డ్ డిఫెన్స్‌లోకి మారిపోయింది. ఇలా మారేటప్పుడు ప్రధానమైన దశ ఏంటంటే... గేమ్‌లో అధ్వాన్న స్థితికి పడిపోకుండా ప్రతి ఆటగాడు తనకున్న ఇతర అవకాశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
కార్ల్‌సెన్ 9వ ఎత్తు వేసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సవాళ్ల కోసం సిద్ధమయ్యారు. నల్లపావులతో ఆనంద్ 9వ ఎత్తు తర్వాత డీసీ4తో ముందుకొచ్చాడు. చాలా అరుదుగా ఇలా ఆడతారు. టాప్‌లో ఉన్న ఏ ఒక్క ఆటగాడు కూడా ఇలాంటి ఎత్తు వేయరు. దీంతో కార్ల్‌సెన్ లోతైన ఆలోచనలో పడిపోయాడు. ఈ సమయంలో అతను నెర్వస్‌గా ఉన్నాడా అంటే? నా సమాధానం ‘కాదు’ అనే వస్తుంది. ఆనంద్ చేసిన కొత్త ఆలోచనకు కార్ల్‌సెన్ టీమ్ సరైన రీతిలో సిద్ధంకాలేదు. కాబట్టి ఎలాంటి ఎత్తును ఎంచుకోవాలన్న అంశంపై అతను కసరత్తులు మొదలుపెట్టాడు.
10వ ఎత్తు ఎన్‌బీ6, తర్వాత ఎన్‌సీ4... ఈ రెండు ఆనంద్ వేసిన ఆసక్తికరమైన ఎత్తులు.
ఆనంద్ నైట్ సీ4 మీద ఉండటంతో బిషప్‌ను బీ2 మీద వదిలేసిన కార్ల్‌సెన్ బీసీ1తో 12వ ఎత్తును కొనసాగించాడు. అయితే దీన్ని ఎంచుకోకూడదు. ఎందుకంటే బ్లాక్‌తో ఆడేవాళ్లకు డబుల్ బిషప్‌లు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. 13వ ఎత్తు క్యూబీ3 తర్వాత గేమ్ ‘డ్రా’ అవుతుందని స్పష్టంగా అర్థమైంది. కార్ల్‌సెన్ సుదీర్ఘంగా ఆలోచించడానికి ఇది కూడా ఓ కారణం. గేమ్‌ను కొనసాగించేందుకు కొన్ని దారులను వెతికాడు. గేమ్‌లో ముందుకుపోయి రిస్క్ తీసుకోవడం కంటే ప్రాక్టికల్‌గా ‘డ్రా’వైపు మొగ్గాడు.
తన అంచనాలకు అనుగుణంగా గేమ్ జరగకపోవడంతో తెల్లపావులతో కార్ల్‌సెన్... ఆనంద్‌పై స్థిరంగా ఒత్తిడి కలిగించలేకపోయాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఫలితం అతనికి పెద్దగా సంతృప్తినివ్వకపోవచ్చు. మరోవైపు ఈ ఫలితంతో విషీ ఆనందపడి ఉంటాడు. నల్లపావులతో గేమ్‌ను డ్రా చేసుకోవడం సానుకూల అంశం.
ఓపెనింగ్‌లో ఆనంద్‌దే పైచేయి అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. 2 లేదా 4 గేమ్‌లు జరిగితే ప్రత్యర్థి బలహీనతలు, వ్యూహాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటగాళ్లు పరస్పరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేడు ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. తొలి గేమ్ మాదిరిగానే కార్ల్‌సెన్‌పై ఒత్తిడి పెంచి ఫలితాన్ని సాధిస్తాడని ఆశిద్దాం!