ఇరువురూ సమానమే
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్, డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రెండో గేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి వేసిన ఆశ్చర్యకరమైన ఓపెనింగ్ ఎత్తుగడను తన అనుభవాన్నంతా రంగరించి సమర్థంగా తిప్పికొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు కార్ల్‌సెన్ (నార్వే) వేగంగా భిన్నమైన ఎత్తులు వేసినా... విషీ మాత్రం నెమ్మదిగా ‘చెక్’ పెట్టాడు.
చివరి దాకా ప్రతి ఎత్తుకు గేమ్‌ను మారుస్తూ పోయిన కార్ల్‌సెన్‌కు అవకాశం లేకపోవడంతో డ్రా వైపు మొగ్గాడు. దీంతో చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరువురు ఆటగాళ్ల మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. స్కోరు 1-1తో సమమైంది. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం మూడో గేమ్ జరుగుతుంది.
నల్లపావులతో బరిలోకి దిగిన కార్ల్‌సెన్ ఓపెనింగ్ ఎత్తుగడతోనే ఆనంద్‌ను దాదాపుగా కట్టిపడేశాడు. దీని నుంచి తేరుకునేందుకు సమయం తీసుకున్న విషీ... గేమ్ క్లిష్టమైన కారోకాన్ డిఫెన్స్‌లోకి వెళ్లకుండా బయటకు తీసుకొచ్చాడు. గతంలో డింగ్ లారెన్ (చైనా)తో ఆడిన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సంక్లిష్టమైన ఎత్తులను అవలంభించేందుకు కొంత సమయం తీసుకున్నా... రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించాడు. నల్లపావులతో ఆడిన కార్ల్‌సెన్ సంక్లిష్టమైన ఎత్తులతో భిన్నంగా ఆడాడు. 17 ఎత్తుల వరకు ఇద్దరు ఆటగాళ్లు గేమ్‌ను సాదాసీదాగా కొనసాగించారు. క్వీన్‌ను మార్చుకుంటూ ఆనంద్ వేసిన 18వ ఎత్తుతో గేమ్ మలుపు తీసుకుంది.
అప్పటికప్పుడు ఇలాంటి కొత్త ఆలోచన చేసిన భారత ఆటగాడికి గేమ్‌లో ముందుకెళ్లేందుకు అవకాశం లభించినా... ఎత్తులు మాత్రం పునరావృతమయ్యాయి. 21వ ఎత్తు వరకు ఇది కొనసాగింది. మరో నాలుగు ఎత్తుల తర్వాత కార్ల్‌సెన్ కూడా ఎత్తులను పునరావృతం చేసే అవకాశం ఉండటంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. గేమ్ మొత్తంలో కార్ల్‌సెన్ 25 నిమిషాలు తీసుకుంటే ఆనంద్ 42 నిమిషాల పాటు ఆలోచించాడు.
12వ ఎత్తు తర్వాత కార్ల్‌సెన్ కీలకమైన ఎత్తు వేశాడు. గతంలో దీన్ని పరిశీలించా. ఇది క్లిష్టమైన ఎత్తు. ఇలాంటిది ఎదురవుతుందని ఊహించలేదు. కార్ల్‌సెన్ వేసిన ఓపెనింగ్ ఎత్తుతోనే గేమ్‌లో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దీంతో గుడ్డిగా ఆడకుండా కాస్త పటిష్టమైన ఎత్తుతో ముందుకెళ్లా. నేను తీసుకున్న మెరుగైన నిర్ణయం ఇది.
- ఆనంద్
ఓపెనింగ్ ఎత్తుగడ గురించి ఎక్కువగా మాట్లాడను. అయితే 18వ ఎత్తు తర్వాత క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. దీని తర్వాత విషీ చాలా ప్రయత్నించాడు. కానీ బ్లాక్‌తో ఆడినందుకు బయటపడ్డా. ఈ టోర్నీలో నేను ఎలా ఆడాలనుకున్నానో రెండో గేమ్ దానికి దగ్గరగా ఉంది. ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న వారిలో ఆనంద్ చాలా బలమైన ప్రత్యర్థి.
- కార్ల్‌సెన్
రెండో గేమ్ మెరుగ్గా సాగింది
ఆనంద్, కార్ల్‌సెన్‌ల మధ్య గంటలోనే ముగిసిన రెండో గేమ్ 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఎత్తుల పరంగా చూస్తే తొలి గేమ్ కంటే ఈ గేమ్ చాలా మెరుగైంది. అయితే 30 నిమిషాలు ముందుగానే గేమ్‌ను ముగించారు. ఈ గేమ్‌లో ఎవరు పైచేయి సాధించారనే అంశాన్ని అంచనా వేసే ముందు గేమ్‌ను పరిశీలిద్దాం.
చెస్ టర్మ్స్ ప్రకారం కింగ్‌పాన్‌తో ఆనంద్ ఒకటవ ఎత్తుగా ఈ4 వేశాడు. దీనికి సమాధానంగా కార్ల్‌సెన్ సీ6తో ముందుకొచ్చాడు. ఇది కారోకాన్ డిఫెన్స్ అని తెలిసిపోయింది. చాలా మంది టాప్ ఆటగాళ్లు ఉపయోగించే పటిష్టమైన ఓపెనింగ్ ఇది. అయితే ఆనంద్ వేసిన ఈ4కు వ్యతిరేకంగా కార్ల్‌సెన్ చాలా రకాల ఓపెనింగ్స్‌ను ఎంచుకోవచ్చు. సాధారణంగా సీ5 లేదా ఈ5తో ఆడొచ్చు.
కాబట్టి కార్ల్‌సెన్ కారోకాన్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం ఆనంద్‌కు ఆశ్చర్యకరమైన అంశమే. ఇంటి దగ్గర గేమ్ గురించి విశ్లేషించుకున్న అంశాలను ఆటగాళ్లు బాగా గుర్తుంచుకుంటారు కాబట్టి ఓపెనింగ్ ఎత్తులు వేగంగా వేస్తారు. అయితే ఈ గేమ్‌లో క్లిష్టమైన దశ ఏంటంటే ఆనంద్ ఎన్‌ఈ4తో 15వ ఎత్తు వేయడం. చాలా పావులను మార్చుకుంటూ (ఎక్ఛేంజ్) వరుసగా ఎత్తులు వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్వీన్స్‌ను ఎక్ఛేంజ్ చేసుకున్న తర్వాత గేమ్ సమానం కావడంతో 25 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. కానీ ఏ ఆటగాడికీ లాభం లేకపోయింది.
ఈ గేమ్ కోసం ఆనంద్ బాగా సిద్ధమై ఉంటాడు. కానీ ఇలాంటి భిన్నమైన ఎత్తులను ఊహించి ఉండడు. ఆనంద్ ఎన్‌ఈ4తో వేసిన 15వ ఎత్తు రక్షణాత్మకం. ఇది ప్రాక్టికల్‌గా చాలా మంచి నిర్ణయం. ఈ రెండు గేమ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందో విశ్లేషిద్దాం. ఒకటో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ కేవలం 16 ఎత్తుల్లోనే సులువైన డ్రా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో కార్ల్‌సెన్ ఆశ్చర్యకరమైన ఓపెనింగ్‌తో టాప్ ఆటగాడిగా మారిపోయాడు. అయితే రక్షణాత్మక ఎత్తుగడతో ఆనంద్ ఈ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
నా ఉద్దేశం ప్రకారం ఈ గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం ఆశ్చర్యపర్చుకున్నారు. ఇద్దరూ ప్రాక్టికల్ ప్లేయర్లే. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా డ్రా చేసుకున్నారు. ఇందులో ఒకరిపై మరొకరికి మానసికంగా ఎలాంటి లాభం చేకూరిందో ఇప్పటికీ స్పష్టం కాలేదు. నేడు విశ్రాంతి దినం. ఆటగాళ్లు మంచి విశ్రాంతి తీసుకొని మూడో గేమ్‌నైనా రసవత్తరంగా మార్చుతారని ఆశిద్దాం!