ఆనందం దూరమవుతోంది
చెన్నై: రెండు గేమ్‌లలో వరుస ఓటముల తర్వాత ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఏడో గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన వ్యూహాన్ని రచించలేక డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. దీంతో మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే)తో సోమవారం జరిగిన ఈ గేమ్ 32 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా నార్వే ప్లేయర్ 4.5-2.5తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టైటిల్ గెలవాలంటే ఆనంద్ మిగిలిన ఐదు గేమ్‌ల ద్వారా నాలుగు పాయింట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగితే అద్భుతమే అనుకోవాలి.
ఇప్పటికే బెర్లిన్ డిఫెన్స్‌తో ఆనంద్ టీమ్‌కు ఇబ్బందులు సృష్టించిన కార్ల్‌సెన్ ఏడో గేమ్‌లోనూ నల్లపావులతో అదే వ్యూహంతో బరిలోకి దిగాడు. దీంతో గేమ్‌లో ముందుకెళ్లేందుకు విషీకి సరైన దారి దొరకలేదు. రూయ్ లోపెజ్ డిఫెన్స్‌కు దగ్గరగా వెళ్లిన ఆనంద్ ఐదో ఎత్తు వద్ద నైట్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాడు.
తెల్లపావులతో ఆడే ఆటగాడికి ఇంతకంటే మెరుగైన ఎత్తు వేసే అవకాశం లేకున్నా... కౌంటర్ అటాక్‌కు కార్ల్‌సెన్‌కు మాత్రం చాలా దారులు లభించాయి. గత రెండింటిలో ఎండ్‌గేమ్‌ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆనంద్... ఈ గేమ్‌లో జాగ్రత్తలు తీసుకున్నాడు. 10వ ఎత్తు వద్ద ఆనంద్ కాస్త ఆధిక్యంలో కనిపించినా... గేమ్‌ను గెలిచేంత అవకాశం రాలేదు. కింగ్ రూక్‌పాన్‌ను ఉపయోగించి వేసిన 15వ ఎత్తుతో భారత ప్లేయర్ కొత్త వ్యూహాన్ని అమలుపర్చాడు. అయితే బలహీనమైన ఈ ఎత్తుగడకు కార్ల్‌సెన్ రూక్‌తోనే చెక్ పెట్టాడు. దీంతో క్వీన్, నైట్‌తో ఎండ్‌గేమ్ మొదలైంది. ఆనంద్ కొన్ని పాన్‌లను మార్చుకుంటూ ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో 32వ ఎత్తు వద్ద డ్రాకు అంగీకరించాడు. నేడు ఎనిమిదో గేమ్ జరగనుంది.
చివరి రెండు గేమ్‌ల్లో ఓటమి తర్వాత ఈ ఫలితం రావడం కాస్త అనుకూలమే. అయితే ఈ గేమ్‌లో అవకాశాలు లభించినా విజయం సాధ్యం కాలేదు. ఇంతకుముందు ఇద్దరం ఇదే లైన్‌లో ఆడాం. కార్ల్‌సెన్ బిషప్ వైపు మొగ్గడంతో నేను భిన్నమైన ఎత్తుగడలోకి వెళ్లా. వైట్‌కు ఉన్నవి రెండే మార్గాలు. కింగ్‌సైడ్‌ను బ్రేక్ చేయడం లేదా ఫ్లాంక్ మీద ఆడటం. నైట్‌తో ఆడాలని సిద్ధమైనప్పుడు ఎఫ్4ను ఉపయోగించడం సరైంది కాదు. తర్వాతి గేమ్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తా. -ఆనంద్
ఒకే లైన్‌లో ఇద్దరం ఆడినప్పటికీ భిన్నమైన ప్రణాళికలు అనుసరించాం. ఎలాంటి ఎత్తుగడ అయినా గేమ్ సాగుతున్న కొద్దీ నెమ్మదవుతుంది. కొంత ఇబ్బంది ఎదురైనా ఈ గేమ్‌లో నేను బాగానే ఆడా. కొన్ని మానసిక అంశాలు కూడా ఈ టోర్నీలో ముడిపడి ఉన్నాయి. ఐదో గేమ్ ఫలితం తర్వాతి రెండు గేమ్‌లపై ప్రభావం చూపింది. దీన్ని విస్మరించలేం. - కార్ల్‌సెన్