
ఇక చావో రేవో
ప్రపంచ చాంపియన్‌షిప్ రెండో అర్ధభాగంలోకి కార్ల్‌సెన్ 4-2 ఆధిక్యంతో వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు ఓడిపోతాడని ఊహించలేదు. రెండు గేమ్‌ల్లోనూ ‘డ్రా’లకు అవకాశం ఉన్నా ఒత్తిడిలో పోగొట్టుకున్నాడు. ఒకరోజు విశ్రాంతి లభించింది కాబట్టి... ఆనంద్, తన సెకండ్స్ కలిసి ఈ ఓడిన రెండు గేమ్‌లను విశ్లేషిస్తారు. ముఖ్యంగా ఎండ్ గేమ్, మిడిల్ గేమ్‌ల మీద ఇక దృష్టి ఎక్కువగా పెట్టాలి. గత రెండు గేమ్‌ల్లోనూ కార్ల్‌సెన్ మిడిల్ గేమ్‌లో బాగా ఆడాడు. మరోసారి తెల్లపావులతో ఆడబోతున్న ఆనంద్‌కు ఇది చాలా కీలకమైన గేమ్. ఇక నుంచి ఆనంద్ మిడిల్ గేమ్‌లో అన్‌క్లియర్ పొజిషన్స్‌తో ఆడాలి. ఆనంద్ తన వ్యూహాన్ని మారుస్తాడా? లేక అలాగే కొనసాగిస్తాడా అనేది చూడాలి.
మరోవైపు కార్ల్‌సెన్ వరుసగా రెండు విజయాలతో ఆనందంగా ఉండి ఉంటాడు. ‘డ్రా’లు కావలసిన గేమ్‌లను గెలవడం ఆటగాడి విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో కార్ల్‌సెన్ సరిపెట్టుకోడు. ఓడిపోయే రిస్క్ లేకుండా చూసుకుంటూ విజయాల కోసం ఆడతాడు. ఒకవేళ కార్ల్‌సెన్ గనక డిఫెన్సివ్‌గా ఆడితే, అప్పుడు ఆనంద్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఇక ఆనంద్‌కు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.