
‘కొడుకు కోరికను తండ్రి తీరిస్తే ఇద్దరూ నవ్వుకుంటారు... అదే తండ్రి కోరికను కొడుకు తీరిస్తే ఇద్దరూ ఏడుస్తారు’... ఈ హీబ్రూ వ్యాఖ్యను వివరించేందుకు గురువారం కనిపించిన దృశ్యం ఒకటి చాలు! వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చివరి గేమ్ సాగుతున్న సమయంలో అతని తండ్రి రజనీకాంత్ లాబీలో తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. గెలుపు గురించి తెలిసిన క్షణాన తెలిసిన కొందరు అభినందిస్తుండగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆయనకు మాటలు కూడా రాలేదు.
ఆ తర్వాత కొద్దిసేపటికే గుకేశ్ బయటకు వచ్చాడు. కొడుకును హత్తుకున్న ఆయన భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. తన అబ్బాయి సాధించిన ఘనత విలువేమిటో ఆయనకు తెలుసు. ఈ విజయం వెనక అతని కష్టం, సాధన ఎలాంటిదో కూడా బాగా తెలుసు.
గుకేశ్ ఆటగాడిగా ఎదిగే క్రమంలో అన్ని సౌకర్యాలు, శిక్షణ అందించడంతో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు చాలాసార్లు వైద్యవృత్తిని పక్కన పెట్టి సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. ‘త్యాగం అనే పదం నాకు నచ్చదు. పిల్లల కోసం కష్టపడటం తల్లిదండ్రుల బాధ్యత. గుకేశ్‌లో చెస్ ప్రతిభను గుర్తించిన తర్వాత ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాం’ అని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ అయిన రజనీకాంత్ గతంలో చెప్పారు.
మైక్రోబయాలజిస్ట్ అయిన అమ్మ పద్మాకుమారి కూడా అన్ని వేళలా కొడుకుకు అండగా నిలిచింది. ఓటమి ఎదురైనప్పుడల్లా అతను తల్లితోనే మాట్లాడేవాడు. స్ఫూర్తిదాయక మాటలు, గాథలతో గుకేశ్ మళ్లీ కొత్త సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు అమ్మ మాటలే ఉపకరించేవి.
చెన్నైలో చెస్ చాంపియన్ల అడ్డా అయిన వేలమ్మాల్ స్కూల్‌లో గుకేశ్ ఆట మొదలైంది. అండర్–11 జాతీయ చాంపియన్‌గా అతనికి మొదటిసారి గుర్తింపు లభించింది. ఆ సమయంలో అతనికి ఎలాంటి ఐఎం, జీఎం నార్మ్‌లు లేవు. కానీ తర్వాతి 16 నెలల వయసులో అద్భుత ఆటతో మూడు ఐఎం నార్మ్‌లు, మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు 2500 రేటింగ్‌ను దాటి గుకేశ్ సత్తా చాటాడు.
12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన అతను పిన్న వయసులో జీఎంగా మారిన ప్రపంచ రికార్డును 17 రోజుల తేడాతో కోల్పోయాడు. అయితే ‘ఇవి నాకు పెద్ద లెక్క కాదు. ఇలాంటివేమీ లేని కార్ల్‌సన్ ఎక్కడికి వెళ్లాడో తెలుసు కదా. నేను అలాంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను’ అనడం అతని ఆత్మవిశ్వాసాన్ని అప్పుడే చూపించింది.
ఆ తర్వాత ఆసియా యూత్, వరల్డ్ యూత్, ఆసియా క్రీడలు, ఒలింపియాడ్ సహా పలు పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు, రికార్డులు అతని ఖాతాలో వరుసగా వచ్చి చేరాయి. ఇటీవల సెప్టెంబరులో భారత జట్టు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించడంలో గుకేశ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను 2783 ‘ఫిడే’ రేటింగ్‌తో కొనసాగుతున్నాడు.
క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తర్వాత కూడా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అతని గెలుపుపై ఏదో మూల సందేహం ఉంది. 2800 రేటింగ్ దాటడంతో పాటు ఒకదశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని డింగ్ లిరెన్‌ను నిలువరించగలడా అనే అనుమానాలను గుకేశ్ పటాపంచలు చేశాడు.18 ఏళ్ల వయస్సులో విశ్వవిజేతగా నిలిచి చరిత్రకెక్కాడు.
చదవండి: తెలుగు టైటాన్స్ పరాజయం
Comments
Please login to add a commentAdd a comment