వింబుల్డన్ టైటిల్ తో ఆండీ ముర్రే
సమకాలిన టెన్నిస్ క్రీడలో పట్టువదలని విక్రమార్కుడిలా పయనం సాగించిన ఆటగాడు ఆండీ ముర్రే. కెరీర్ ఆరంభంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా లెక్కచేయకుండా పోరాటం సాగించిన యోధుడు. టైటిళ్ల వేటలో ఎన్నోసార్లు చివరిమెట్టుపై బోల్తా పడినా ఈ స్కాట్లాండ్ ఆటగాడు టెన్నిట్ రాకెట్ వదిలిపెట్ట లేదు. రాజీలేని పోరాటంతో రన్నరప్గా మిగిలిన చోటే విజేతగా అవరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో పంతం పట్టాడు. చివరకు విజయాల బాట పట్టాడు. తమ దేశానికి చారిత్రక విజయాన్ని అందించి టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు.
77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను బ్రిటన్కు సాధించిపెట్టాడు ఆండీ ముర్రే. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను మట్టికరిపించి అతడీ టైటిల్ సాధించడం విశేషం. 1896లో హరోల్డ్ మహోనీ తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్కాట్లాండ్ ప్లేయర్గా ఆండీ ముర్రే ఘనత సాధించాడు. అంతేకాదు తన గురువు ఇవాన్ లెండిల్కు తీరని కలగా ఉన్న వింబుల్డన్ను తాను సాకారం చేశాడు.
వింబుల్డన్లో ఈ ఏడాది జూలై 7న ముర్రే, జొకోవిచ్ మధ్య జరిగిన తుది సమరం సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వింబుల్డన్‌లో చివరిసారి బ్రిటన్ నుంచి వర్జీనియా వేడ్ 1977లో టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఫ్రెడ్ పెర్రీ టైటిల్ గెలిచి ఈ సంవత్సరానికి 77 ఏళ్లయింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఏడో నెల జూలైలో 7వ తేదీనే జరిగింది. ముర్రే (15-5-1987), జొకోవిచ్ (22-5-1987) పుట్టిన రోజులోనూ తేడా 7 రోజులు ఉంది.
పడిలేచిన కెరటానికి ప్రతీకగా నిలుస్తాడు 26 ఏళ్ల ఆండీ ముర్రే. గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఎన్నోసార్లు తృటిలో చేజారినా నిరుత్సాహ పడలేదు. సడలని సంకల్పంతో అపూర్వ విజయాలు సొంతం చేసుకున్నాడు. అందుకే ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బీబీసీ’ అతడికి 2013 సంవత్సరానికి గానూ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందజేసింది. అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ కాదని ముర్రేకు ఈ పురస్కారం కట్టబెట్టారు. ముర్రే మరిన్ని సంచలనాలు సృష్టిచాలని టెన్నిస్ అభిమానులు కోరుకుంటున్నారు.