'రావూరి'కు జ్ఞాన్పీఠ్ అవార్డు | Telugu writer Ravuri Bharadwaja honoured with Jnanpith award | Sakshi
Sakshi News home page

'రావూరి'కు జ్ఞాన్పీఠ్ అవార్డు

Published Fri, Dec 27 2013 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

Telugu writer Ravuri Bharadwaja honoured with Jnanpith award

సినీ ప్రపంచంలో చీకటి కోణాలను ఆవిష్కరించిన నవల 'పాకుడురాళ్లు'.  దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు-2012ను ఈ నవల అందుకుంది. ప్రముఖ తెలుగు కవి, నవలాకారుడు, నాటక రచయిత  రావూరి భరద్వాజ 1965లో పాకుడురాళ్లు నవలను రాశారు. తెలుగులో తొలి వాస్తవికతా రచన ఇది. సినిమా రంగంపై ఆ తర్వాత ఎన్ని రచనలు వచ్చినా పాకుడురాళ్లు స్థాయిని అందుకోలేకపోయాయి.

తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి. నారాయణరెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ అవార్డును అందుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఆచార్య నాగార్జున, విజ్ఞాన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో రావూరిని సత్కరిస్తే కేంద్ర ప్రభుత్వ జ్ఞానపీఠ్ పురస్కారం అందించింది. తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో,ప్రతిభా పాటవాలతో ఎదిగిన గొప్ప రచయిత రావూరి.

రచనే శ్వాసగా జీవించిన రావూరి 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మొగులూరులో జన్మించారు. ఆయన 70 ఏళ్లపాటు విరమం లేకుండా 187 రచనలు, 17 నవలలు, 500 కథలు, పలు తెలుగు సినిమాలకు కథలు, మాటలు రాశారు. రావూరి కిడ్ని వ్యాధితో అక్టోబర్ 18న కన్నుమూశారు.  జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది.


కాత్యాయనీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికి గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. 22 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ-2013 పురస్కారాలకు ఎంపికైన రచయితల్లో ... బాలీవుడ్ సినీ రచయిత జావేద్ అక్తర్‌కు ఉర్దూ విభాగంలో లావా కవితా సంపుటికిగాను అవార్డు దక్కింది. వచ్చే ఏడాది మార్చి 11న జరిగే అకాడమీ వార్షిక సాహిత్యోత్సవంలో విజేతలను రూ.లక్ష నగదు, తామ్రపత్రంతో సత్కరిస్తారు.

చివరకు మిగిలేది- మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శపై కాత్యాయని పీహెచ్‌డీ చేశారు. పలు సాహిత్య, సామాజిక అంశాలపై 285 వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు.

తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత,  తెలుగు నవలాకథానిక విమర్శ పరిణామం, ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కారం తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement