సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న | Bharat Ratna, sachin tendulkar, C.N.R. Rao, year ender 2013 | Sakshi
Sakshi News home page

సచిన్, సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న

Published Fri, Dec 27 2013 2:43 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

Bharat Ratna, sachin tendulkar, C.N.R. Rao, year ender 2013

భారతదేశంలో  2013 సంవత్సరంలో పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులు వరించాయి. వాటిలో ప్రధానంగా  చెప్పుకోదగినది భారతరత్న. భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'. కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజా సేవల రంగాలలో అత్యున్నత కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.  క్రికెట్‌ దేవుడు సచిన్ టెండుల్కర్ ‌, సైన్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన సిఎన్‌ఎస్‌ రావులను ఈ ఏడాది ఈ పురస్కారం వరించింది. 2011లో క్రీడలను కూడా భారతరత్న పురస్కారాన్ని ఈ జాబితాలో చేర్చారు.

 సచిన్ టెండూల్కర్

24 ఏళ్లుగా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
 
16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది.


ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు

పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్‌ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.
 
ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్‌ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్‌డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు.

1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. భారతరత్నతో పాటు సీఎన్‌ఆర్ రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో ఆయనకు గౌరవ విదేశీ సభ్యుడి హోదా దక్కింది.
 
ఇప్పటివరకూ ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు.  భారతరత్న పురస్కారాన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఈ అవార్డును మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకు 1966లో ఈ అవార్డు లభించింది. భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ (1971). భారతరత్న ఇద్దరు విదేశీయులకు కూడా లభించింది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్థాన్)కు, 1990లో నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)కు లభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement