జంట నగరాలకు వరం.. మెట్రో రైలు!
రాష్ట్ర రాజధానిలో రోడ్డు మీదకు వెళ్లాలంటే చాలు.. విపరీతమైన దుమ్ము, పొగ. దానికితోడు విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వెళ్లాలంటే కనీసం మూడు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇలాంటి కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి కలిగించేందుకు దూసుకొచ్చేస్తోంది.. మెట్రో రైలు. 2012లోనే ప్రారంభమైన మెట్రోరైలు పనులు.. 2013 సంవత్సరంలో పూర్తి స్థాయిలో జరిగాయి. పిల్లర్లు లేవడం దగ్గర్నుంచి వయడక్టులు వేయడం, వాటిపైన పట్టాలు పరవడం వరకు కూడా కొన్ని మార్గాల్లో పూర్తయింది. ఇక వచ్చే సంవత్సరం ఉగాది నాటికి.. అంటే, తెలుగు కొత్త సంవత్సరంలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఒక మార్గంలో మాత్రం అప్పటికి నడుస్తుందని, మిగిలిన అన్ని కారిడార్లలో పూర్తి కావాలంటే మరింత సమయం పడుతుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు అయిన మెట్రోరైలు తొలి దశలో ఉప్పల్ నుంచి మెట్టుగూడ మార్గంలో 2014 ఉగాది నాటికి నడుస్తుందని అధికారులు అంటున్నారు. దీనికి అనుగుణంగా నాగోల్ నుంచి మెట్టుగూడ మార్గంలో 8 కిలోమీటర్ల పొడవున మెట్రో వయడక్ట్ మీద పట్టాలు పరిచే పని ఈ సంవత్సరం నవంబర్‌లో మొదలైంది. మొత్తం 16,735 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 204 ఎకరాల భూమి అవసరం. ఇందులో చాలా భాగాన్ని ఇప్పటికే సేకరించారు. ప్రాజెక్టులో ఇప్పటికి నాలుగోవంతు పనులు మాత్రమే పూర్తయినా.. ఇప్పటినుంచి శరవేగంగా పనులు నడుస్తుండటంతో 2015 నాటికి పూర్తి స్థాయిలో మెట్రో సేవలు జంట నగరాల వాసులకు అందుబాటులోకి వచ్చేలా ఉన్నాయి.
మెట్రోరైలు మార్గంలో మొత్తం 2700 పిల్లర్లున్నాయి. వీటిలో 1100 పిల్లర్లకు పునాదులు పూర్తయ్యాయి. మరో 1600 పిల్లర్లకు పునాదులు వేయాలి. ఒక్కో పిల్లర్ పూర్తిచేయడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. ఉప్పల్ డిపో పనులు 86% పూర్తయ్యాయి, రెండు నెలల్లో ముగుస్తాయి. మియాపూర్ డిపోలో 68% పనులు పూర్తయ్యాయి. 10 కిలోమీటర్ల మేర వయడక్టులు వేసే పని పూర్తయింది. కొన్నిచోట్ల మినహా ఉప్పల్-మెట్టుగూడ మార్గం పని మొత్తం పూర్తయింది.