సాక్షి, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని మెట్రోరైల్ ప్రాజెక్టు రెండోదశ కారిడార్ పనులను ఆమోదించడంతోపాటు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని, ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైల్ రెండోదశలో రెండు కారిడార్‌లలో పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయని, పీపీపీ మోడల్‌లో, వయబుల్ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పథకం కింద చేపట్టిన మొదటిదశ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిందని లేఖలో పేర్కొన్నా రు. ఈ క్రమంలోనే రెండోదశలో భాగంగా 31 కి.మీ. నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
రెండు మార్గాల్లో విస్తరణ
బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకా పూల్ వరకు 23 స్టేషన్లతో 26 కిలో మీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను కూడా రూపొందించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టేందుకు రూ.8,453 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రెండోదశ మెట్రోపైన కేంద్రమంత్రితో చర్చించేందుకు అనుమతి కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎక్స్‌టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని, హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండోదశను వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment