అన్వేషణలో హైదరాబాద్కు అగ్రస్థానం!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ ఏడాది నెటిజన్ల హాట్ ఫేవరేట్గా నిలిచింది. మన దేశంలో అత్యధిక మంది నెటిజన్లు భాగ్యనగరం కోసం ఇంటర్నెట్లో శోధించారు. సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్లో 2013లో ఎక్కువ మంది హైదరాబాద్ సమాచారం కోసం అన్వేషించారు. మెట్రో నగరాలు ముంబై, బెంగళూరులను వెనక్కి నెట్టి 'మన సిటీ' కోసం వెతికారు.
ఫిబ్రవరిలో దిల్షుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లు సంభవించడంతో హైదరాబాద్ సమాచారం కోసం ఎక్కువ మంది ఆన్లైన్లో అన్వేషించారు. జంట పేలుళ్లకు 17 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన జూలై, ఆగస్టు మాసాల్లో కూడా హైదరాబాద్ కోసం అత్యధికులు శోధించారు.
సెప్టెంబర్లో ఐపీఎల్, తీవ్రవాది యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించినప్పుడు, అక్టోబర్లో వాల్వో బస్సు దుర్ఘటన జరిగినప్పుడు భాగ్యనగరం కోసం నెటిజన్లు ఆతృతగా శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది.