24 క్యారెట్ గోల్డ్ | Twenty four 24 carat gold | Sakshi
Sakshi News home page

24 క్యారెట్ గోల్డ్

Published Thu, Nov 14 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

24 క్యారెట్ గోల్డ్

24 క్యారెట్ గోల్డ్

 పసిప్రాయంలో వేసిన ప్రతి అడుగు... పరుగుల సునామీని సృష్టించింది. బ్యాట్ పట్టిన బుల్లి చేతులు... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఒకటి, రెండు, మూడు అని లెక్కించినంత సులువుగా రెండు దశాబ్దాల కెరీర్.... వన్నె తగ్గని మేలిమి ‘పసిడి’లా మిలమిలలాడింది. 14 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన మూడు స్టంప్‌ల ఆటకు నాలుగు పదుల వయసులోనూ రత్నాలు పొదిగాడు. క్రికెట్ అంటే నేనే అన్నంతగా అల్లుకుపోయిన 24 ఏళ్ల ‘బంధం’లో మాస్టర్ వేసిన ఒక్కో అడుగు... విలువ కట్టలేని ఒక్కో క్యారెట్ బంగారమే. ఈ సుదీర్ఘ కెరీర్‌లో ప్రతీ ఏడాది సచిన్ సాధించిన ఒక్కో ఘనత ఓ
 ‘కోహినూర్’తో సమానమే!
 
 
 1988
 సెయింట్ జేవియర్‌తో జరిగిన మ్యాచ్‌లో శారదాశ్రమం తరఫున బరిలోకి దిగిన 14 ఏళ్ల సచిన్ (326 నాటౌట్), కాంబ్లీ (349 నాటౌట్)తో కలిసి 664 పరుగులు జోడించి రికార్డు సృష్టించాడు. తర్వాత డిసెంబర్‌లో వాంఖడేలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల సచిన్ శతకంతో చెలరేగాడు. దీంతో ఫస్ట్‌క్లాస్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కి అందరి దృష్టిని ఆకర్షించాడు.
 
 1989
 అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన అరంగేట్రం.
 
 1990
 17 ఏళ్ల 112 రోజుల వయసులో ఇంగ్లండ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)పై అజేయ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు చరిత్రలో శతకం సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.
 
 1991
 టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే వన్డేల్లో మాత్రం ఓ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
 
 1992
 ఈ ఏడాది అత్యంత ప్రమాదకరమైన ‘వాకా’ పిచ్‌పై చెలరేగిన సచిన్ పరుగుల వరద పారించాడు. తర్వాత ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తొలి విదేశీ ఆటగాడయ్యాడు. అదే ఏడాది నవంబర్‌లో టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించాడు.
 
 1993
 సొంతగడ్డపై టెస్టుల్లో తొలి సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 22 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీరో కప్ సెమీస్‌లో మాస్టర్  బంతితోనూ మ్యాజిక్ చేశాడు. ప్రొటీస్ జట్టు విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులు కావాల్సిన దశలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు.
 
 1994
 న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలిసారి ఓపెనింగ్ చేశాడు. 49 బంతుల్లో 82 పరుగులతో అదరగొట్టాడు.
 
 1995
 వరల్డ్ టెల్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దాని విలువ రూ. 31.50 కోట్లు. దీంతో ప్రపంచలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా అవిర్భవించాడు.
 
 1996
 ఉపఖండంలో జరిగిన ప్రపంచ కప్‌లో 87.16 సగటుతో 523 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆగస్టులో 23 ఏళ్ల వయసులో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియామకం.
 
 1997
 కెప్టెన్‌గా ఘోర వైఫల్యం. కానీ బ్యాటింగ్‌లో విశేషంగా రాణించాడు. 12 టెస్టుల్లో 4 సెంచరీలు చేశాడు. అయితే 39 వన్డేలు ఆడితే రెండు శతకాలు మాత్రమే సాధించాడు.
 
 1998
 15 నెలల వ్యవధిలో కెప్టెన్సీ కోల్పోయాడు. అయితే అద్భుత బ్యాటింగ్‌తో ఒక క్యాలెండర్  ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు (1894) చేసిన సంవత్సరం ఇదే.
 
 1999
 చెన్నైలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్ను నొప్పితో బరిలోకి దిగిన సచిన్ 136 పరుగులు చేశాడు. మరో 17 పరుగులు చేస్తే గెలుస్తుందన్న దశలో అవుట్ కావడంతో భారత్ 13 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 12 పరుగులతో గెలిచింది. జూలైలో
 కెప్టెన్‌గా రెండోసారి నియామకం.
 
 2000
 టెస్టుల్లో ఓ మోస్తరుగా ఆడాడు. 6 టెస్టుల్లో 2 శతకాలు చేయగా... ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. 34 వన్డేల్లో 3 శతకాలతో రాణించాడు.
 
 2001
 వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కూడా ఇదే ఏడాది జరిగింది.
 
 2002
 టెస్టుల్లో 29 సెంచరీలు చేసి డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్సయినా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది.
 
 2003
 ప్రపంచకప్‌లో 61.18 సగటుతో 673 పరుగులు చేశాడు. పాక్‌పై చేసిన 98 పరుగులు బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు.
 
 2004
 ముల్తాన్‌లో పాక్‌తో జరిగిన టెస్టులో సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాస్టర్ డిక్లేర్ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ఆగస్టులో టెన్నిస్ ఎల్బో గాయమైంది.
 
 2005
 కోల్‌కతాలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన సచిన్ టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. డిసెంబర్‌లో శ్రీలంకపై సెంచరీ చేయడం ద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటరయ్యాడు. ఈ సందర్భంగా గవాస్కర్ (34) రికార్డును అధిగమించాడు.
 
 2006
 భుజం గాయానికి శస్త్ర చికిత్స కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, విండీస్ పర్యటనకు దూరమయ్యాడు. సెప్టెంబర్‌లో జరిగిన డీఎల్‌ఎఫ్ కప్‌లో విండీస్‌పై 141 పరుగులతో జట్టును గెలిపించాడు.
 
 2007
 కెరీర్‌లో తొలిసారి విశ్రాంతి కోరాడు. దీంతో బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అయితే దాని తర్వాత జరిగిన టెస్టుల్లో రెండు సెంచరీలతో చెలరేగాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించి ఉపఖండం బయట భారత జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

 2008
 ఆస్ట్రేలియా గడ్డపై తొలి వన్డే సెంచరీ సాధించాడు.  టెస్టుల్లో బ్రియాన్ లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు.

 2009
 వన్డేల్లో 17 వేల పరుగులు చేశాడు.
 
 2010
 గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లోనే ‘డబుల్ సెంచరీ’ సాధించాడు.  తొలిసారి ఐసీసీ నుంచి  2010 ఏడాది అత్యుత్తమ క్రికెటర్‌గా
 ‘సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని గెలుచుకున్నాడు. వారం రోజుల తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి (2002 తర్వాత) చేరుకున్నాడు. తర్వాత  టెస్టుల్లో 50 శతకాలు చేసిన క్రికెటరయ్యాడు.
 
 2011
 భారత్‌లో జరిగిన ప్రపంచకప్ ట్రోఫీని గెలిచి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లలో 2 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ అయ్యాడు.
 
 2012
 ఆసియా కప్‌లో బంగ్లాపై 114 పరుగులు చేసి అంతర్జాతీయ కెరీర్‌లో ‘వంద సెంచరీ’ల అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. డిసెంబర్‌లో వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
 
 2013
 టెస్టులకూ గుడ్‌బై. విండీస్‌తో రెండు టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు మాస్టర్ ప్రకటించాడు.
 
 సచిన్‌తో కలిసి ఆడిన అత్యధిక వయసు ఉన్న ఆటగాడు (జాన్ ట్రైకోస్, 1945లో పుట్టాడు), అతి చిన్న వయసు ఉన్న ఆటగాడు (బ్రాత్‌వైట్-1992లో) మధ్య 45 ఏళ్ల వ్యత్యాసం ఉంది.
 
 అరంగేట్రం టెస్టులో గవాస్కర్ బహుకరించిన ప్యాడ్లను కట్టుకుని బరిలోకి దిగాడు.
 
 టెన్నిస్ దిగ్గజం జాన్ మెకన్రోకు సచిన్ పెద్ద అభిమాని. అతనిలాగే మాస్టర్ కూడా తన జుట్టును బ్యాండ్‌తో ముడివేసేవాడు.
 
 కిశోర్ కుమార్ పాటలు, రాక్ గ్రూప్ డైర్ స్ట్రెయిట్స్ సంగీతమంటే సచిన్‌కు మహా ఇష్టం.
 
 మిస్‌యు మాస్టర్
 
 జర్నలిస్ట్ డైరీ
 జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుని... ముఖ్యంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావడం నేను జీవితంలో చేసిన ఎంత మంచిపని..! సచిన్‌తో నా అనుభవాలను గుర్తు చేసుకుంటే ఇదే అనిపిస్తుంది. 1989లో సచిన్ అరంగేట్రం చేసినప్పుడు నాకు పదేళ్లు. 1992 ప్రపంచకప్ ద్వారా మొదటిసారి సచిన్ ఆటను నేను ప్రత్యక్షంగా చూశాను. ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి తెల్లవారుజామున నిద్రమత్తును బలవంతంగా వదిలించుకున్నా... అప్పటికి సచిన్ ఓ సాధారణ క్రికెటరే. దేశంలోని కోట్లాదిమంది అభిమానుల్లాగే నేను కూడా సచిన్ ఫ్యాన్‌నే. తన ఆట చూస్తూనే నా కాలేజీ రోజులు గడిచిపోయాయి. తన ని చూస్తూనే ఆట మీద ఆసక్తి పెరిగింది.
 
  సచిన్ టెస్టు మ్యాచ్ ఆడుతుంటే... పరీక్షకు ఆలస్యంగా వెళ్లి తిట్లు తిన్న రోజులు ఇప్పటికీ గుర్తే. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడాదికే నా కల సాకార మైంది. మొట్టమొదటిసారి 2005 ఫిబ్రవరిలో సచిన్ టెండూల్కర్ ను ఇంటర్వ్యూ చేయగలిగాను.
 
 
 దానికోసం పడ్డ కష్టమంతా సచిన్‌తో చేసిన కరచాలనంతో మరచిపోగలిగాను. కానీ అసలు షాక్ ఏడాది తర్వాత సచిన్ ఇచ్చాడు. నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కవర్ చేయడానికి వెళ్లిన నన్ను ‘హలో.. హౌ ఆర్ యూ’ అని పలకరించాడు. నాకు షాక్. సుదీర్ఘ కెరీర్‌లో కొన్ని వేలమంది జర్నలిస్ట్‌ల ను కలిసిన సచిన్... నన్ను గుర్తుపెట్టుకుని తనంతట తాను పలకరించడం... వాహ్... తన మీద అభిమానంతో పాటు గౌరవం కూడా రెట్టింపయింది. మనసులోనే మాస్టర్‌కు శాల్యూట్.
 
  అక్కడ మొదలై న పరిచయం అలా కొనసాగుతూనే ఉంది. 2008లో చెన్నైలో, 2011లో లండన్‌లో... సచిన్‌తో చేసిన ఇంటర్వ్యూలు, ఆ మాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి.  సచిన్‌తో అరగంట సేపు హోటల్ లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడే అవకాశం వస్తుంద నేది జీవితంలో ఎప్పుడూ ఊహించని అంశం. సచిన్‌తో మాట్లాడటం ఓ పాఠం. తనతో మాట్లాడుతూనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో ఎంత సీరియస్‌గా మాట్లాడతాడో, అది అయిపోగానే అంత ఫ్రీ అయిపోతాడు. రోజూ మనల్ని పలకరించే స్నేహితుడిలా ఆప్యాయంగా మాట్లాడతాడు. జీవితంలో ఎంతోమంది క్రికెటర్లను కలిసినా, ఎంతోమందితో మాట్లాడినా... సచిన్‌తో ఎవరినీ పోల్చలేం.
 
 చాలామంది నవ్వుతూ అయినా అంటారు... సచిన్ ఫ్యాన్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడని, అందుకే పదే పదే అతడి వార్తలకు ప్రాధాన్యం ఉంటుందని. కానీ సచిన్‌ను ప్రేమించని స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ను భారత్‌లో ఒక్కరిని చూపించడం కూడా అసాధ్యం. అందుకే సాధారణ అభిమానుల కంటే ఎక్కువగానే మాస్టర్ రిటైర్మెంట్ వార్త నన్ను బాధించింది. సచిన్ ఆట నుంచి వైదొలగొచ్చు. ఇకపై మాస్టర్ మైదానంలో చేసే బ్యాటింగ్ విన్యాసాల్ని వర్ణించే అవకాశం లేకపోవచ్చు. కానీ సచిన్‌ను మాత్రం జీవితంలో మరచిపోలేం. ఒక ఆటగాడిగానే కాదు... వ్యక్తిగా కూడా సచిన్ ఓ శిఖరం.
 
 డిసెంబర్‌లోనే అధిక పరుగులు
 సచిన్ ఇప్పటిదాకా సాధించిన 15,847 టెస్టు పరుగుల్లో 18 శాతం డిసెంబర్ నెలలోనే సాధించాడు. అలాగే వన్డేల్లో చేసిన 18,426 పరుగుల్లో 3,971 పరుగులు ఆదివారాల్లో చేశాడు. 154 వికెట్లలో 33 ఆదివారం తీసినవే.
  బత్తినేని జయప్రకాష్, సాక్షి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement