అబ్బ వీళ్లు అవుటైతే బాగు... సచిన్ వస్తాడు..! గత రెండు దశాబ్దాల్లో టెస్టుల్లో భారత ఓపెనర్లు అవుట్ కావాలని కోరుకున్న అభిమానులు కోకొల్లలు. అవును మరి... సచిన్ కోసం అంత తహతహలాడారు. దేశం లో కోట్లాది మంది సచిన్‌ను చూస్తూనే పెరిగారు... కోట్లాది మంది అతడి ఆటను ఆస్వాదిస్తూనే ముసలి వాళ్లయ్యారు. చాలామంది అభిమానులకు సచిన్‌తో ఓ రకమైన బంధం పెనవేసుకుని ఉంది. దేశంలో ప్రజలకు ఆనందాన్ని అందించిన వ్యక్తులను తెలుసు కోవడానికి ఏదైనా కొలమానం ఉండుంటే... అది కచ్చితంగా సచిన్ పేరునే ముందు చూపించేది. ప్రపంచంలో క్రికెట్ గురించి ఏ ఇద్దరు చర్చించుకున్నా అందులో కచ్చితంగా సచిన్ పేరు ఉండాల్సిందే. ప్రతి భారతీయుడూ గర్వపడాల్సిన అంశం ఇది.
సరైన సమయంలో....
ఓ రకంగా సచిన్ తన రిటెర్మంట్ నిర్ణయాన్ని నెల రోజుల ముందే ప్రకటించి మంచి పని చేశాడు. చివరిసారి మాస్టర్ ఆటను ఆస్వాదించే అవకాశాన్ని అభిమానులకు అందించాడు. గతంలో గంగూలీ మినహా ఓ సిరీస్‌కు ముందే రిటెర్మంట్ గురించి ప్రకటించిన భారత క్రికెటర్లెవరూ లేరు. ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు రిటైర్ కావలసిందే. సచిన్ కూడా 18 నెలలుగా చర్చల్లో నానుతున్న అంశమే.
అయినా ఆ రోజు దగ్గరకు వచ్చేసరికి అదో బాధ. ‘సచిన్ రిటైరైతే క్రికెట్ చూడటం మానేస్తాం’ అన్న వ్యక్తులు లేకపోలేదు. ఆటను ఎంత ప్రేమించారో, సచిన్‌నూ అంతే ఆరాధించారు. అందుకే ఇకపై సచిన్ కనిపించడనే ఆలోచననే కోట్లాదిమంది భరించలేకపోతున్నారు. తన రిటెర్మంట్‌పై చాలా చర్చే జరిగింది. తనలో ఆడే సామర్థ్యం ఎంతుంది? తన వల్ల జట్టుకు మేలు జరుగుతుందా లేదా? అనే విషయాలను అందరికంటే బాగా అంచనా చేయగలిగింది అతడే. అందుకే ఇక విమర్శలకు తావివ్వకుండా...‘ఇంకా ఆడాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో’నే వీడ్కోలు చెప్పాడు.
బౌలర్లకు ఊరట
ఇకపై ప్రపంచంలో బౌలర్లంతా ఊపిరి పీల్చుకోవచ్చు. బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఆలోచించాల్సిన పనిలేదు. మిగిలిన క్రికెటర్లంతా ఒకెత్తయితే... సచిన్ ఒకెత్తు. మాస్టర్ వికెట్ తీస్తే పొందే ఆనందం... ప్రతి బౌలర్ కెరీర్‌లోనే అతి గొప్పది. గత 24 సంవత్సరాలుగా ప్రతి ప్రత్యర్థీ ... మాస్టర్ వికెట్ తీస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే భావించాడు.
క్రికెట్ రక్షకుడు...
ఇప్పుడు భారత జట్టు అనేక విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలను అందుకుంది. కానీ 1990ల్లో భారత జట్టు పరిస్థితి అలా లేదు. వరుస ఓటములతో ఒక దశలో హాకీ తరహాలో ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ సమయంలో భారత క్రికెట్‌ను రక్షించిన రక్షకుడు సచిన్. టెక్నాలజీకి థాంక్యూ!
సచిన్ కంటే ముందు బ్రాడ్‌మన్‌లాంటి అనేకమంది దిగ్గజాలు క్రికెట్ ఆడారు. కానీ వీళ్ల ఆటని ప్రపంచం టీవీల్లో ప్రత్యక్షంగా చూడలేకపోయింది. సచిన్ వచ్చే సమయానికి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి అభిమానులు టెక్నాలజీకి థాంక్స్ చెప్పుకోవాల్సిందే.
సచిన్ దేవోభవ..!
Published Thu, Nov 14 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement