ఘనంగా ఆరంభం | Grand opening for sachin tendulkar | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆరంభం

Published Fri, Nov 15 2013 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

ఘనంగా ఆరంభం

ఘనంగా ఆరంభం

ముంబై: ఓ చారిత్రాత్మక తుది ఘట్టానికి తెరలేచిన వేళ... ముంబై వాసులు నిద్రమత్తు వీడి వాంఖడే వైపు పరుగులు తీస్తున్న తరుణం... కాలం ఆగకపోయినా... వేగం పెరిగిన క్షణం... జీవితంలో చూడలేని, మర్చిపోలేని ఓ అంకం కోసం....  గ్యాలరీలు నిండాయి... కుటుంబం సహా విశిష్ట అతిథులూ ఆసీనులయ్యారు... భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని టాస్ గెలిచి ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించాడు.
 
 అంతే బరిలోకి దిగిన బౌలర్లు మాస్టర్‌కు ఘనమైన కానుక ఇచ్చేందు సర్వం ఒడ్డారు. తొలి సెషన్‌లో రెండే వికెట్లు తీసినా... రెండో సెషన్‌లో హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (5/40) మ్యాజిక్ స్పెల్‌తో రెచ్చిపోయాడు.
 
 దీంతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 55.2 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. పావెల్ (48), బ్రేవో (29) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. సచిన్ (73 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), పుజారా (49 బంతుల్లో 4 ఫోర్లతో 34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ (43), ధావన్ (33) ఫర్వాలేదనిపించారు. షిల్లింగ్‌ఫోర్డ్ 2 వికెట్లు పడగొట్టాడు.
 
 గేల్ మళ్లీ విఫలం
 క్రీజులో అసౌకర్యంగా కదిలిన విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (11)  షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. షమీ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ ఆరంభంలో పరుగులు సమర్పించుకున్నా... 25వ ఓవర్‌లో బ్రేవోను అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విండీస్ లంచ్ వరకు 2 వికెట్లకు 93 పరుగులు చేసింది.
 
 ఓజా సూపర్ బౌలింగ్
 లంచ్ తర్వాత తన రెండో ఓవర్‌లోనే ఓజా పావెల్‌ను అవుట్ చేశాడు. చందర్‌పాల్ ఓ భారీ సిక్సర్‌తో ఖాతా ప్రారంభించినా పెద్దగా ఆడలేకపోయాడు. ఏడో ఓవర్‌లో ఓజా... శామ్యూల్స్ (19)ను అవుట్ చేయగా, ఆ తర్వాత చందర్‌పాల్‌ను భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. దీంతో 148 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది.
 
 49వ ఓవర్‌లో అశ్విన్ మూడు బంతుల తేడాతో దేవ్‌నారాయణ్ (21), స్యామీ (0)లను అవుట్ చేశాడు. తర్వాత ఓవర్లలో ఓజా... షిల్లింగ్‌ఫోర్డ్ (0), బెస్ట్ (0), గాబ్రియెల్ (1)లకు షాకిచ్చాడు. దీంతో ఓ దశలో 97/2తో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 85 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను చేజార్చుకుంది.
 
 ఓపెనర్ల శుభారంభం
 టీ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు ధావన్, విజయ్‌లు శుభారంభాన్నిచ్చారు. గాబ్రియెల్, స్యామీ బౌలింగ్‌లో చెరో నాలుగు ఫోర్లు కొట్టి గాడిలో పడ్డారు. అయితే పేసర్లు ప్రభావం చూపకపోవడంతో ఓ ఎండ్‌లో స్పిన్నర్ షిల్లింగ్‌ఫోర్డ్‌ను బరిలోకి తెచ్చాడు. ఈ వ్యూహం ఫలించి 14వ ఓవర్‌లో మూడు బంతుల వ్యవధిలో ధావన్, విజయ్‌లను అవుట్ చేశాడు. దీంతో 77 పరుగుల వద్దే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పుజారా తో జత కలిసిన సచిన్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా బౌండరీలు కొట్టాడు. పుజారా కూడా ఆకట్టుకోవడంతో భారత్ స్కోరు వేగంగా పెరిగింది.  ఈ జోడి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించింది.
 
 స్కోరు వివరాలు
 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: గేల్ (సి) రోహిత్ (బి) షమీ 11; పావెల్ (సి) ధావన్ (బి) ఓజా 48; డారెన్ బ్రేవో (సి) ధోని (బి) అశ్విన్ 29; శామ్యూల్స్ (సి) విజయ్ (బి) ఓజా 19; చందర్‌పాల్ (సి) అశ్విన్ (బి) భువనేశ్వర్ 25; దేవ్ నారాయణ్ (సి) విజయ్ (బి) అశ్విన్ 21; రామ్‌దిన్ నాటౌట్ 12; స్యామీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; షిల్లింగ్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 0; బెస్ట్ (సి) ధోని (బి) ఓజా 0; గాబ్రియెల్ (సి) ధోని (బి) ఓజా 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం: (55.2 ఓవర్లలో ఆలౌట్) 182.
 
 వికెట్ల పతనం: 1-25; 2-86; 3-97; 4-140; 5-148; 6-162; 7-162; 8-162; 9-172; 10-182
 బౌలింగ్: భువనేశ్వర్ 17-2-45-1; మహ్మద్ షమీ 12-2-36-1; అశ్విన్ 15-2-45-3; ప్రజ్ఞాన్ ఓజా 11.2-2-40-5
 భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) స్యామీ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 43; ధావన్ (సి) చందర్‌పాల్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 33; పుజారా బ్యాటింగ్ 34; సచిన్ బ్యాటింగ్ 38; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (34 ఓవర్లలో 2 వికెట్లకు) 157.
 
 వికెట్ల పతనం: 1-77; 2-77
 బౌలింగ్: స్యామీ 6-0-27-0; గాబ్రియెల్ 6-0-32-0; షిల్లింగ్‌ఫోర్డ్ 12-1-46-2; బెస్ట్ 5-0-27-0; శామ్యూల్స్ 5-0-17-0.
 
 ఏ సెషన్‌లో ఎన్ని...
 సెషన్-1
 ఓవర్లు: 28; పరుగులు: 93; వికెట్లు: 2
 సెషన్-2
 ఓవర్లు: 27.2; పరుగులు: 89; వికెట్లు: 8
 సెషన్-3
 ఓవర్లు: 34; పరుగులు: 157; వికెట్లు: 2
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement