ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై 7.5 - 6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించిన గుకేశ్.. కేవలం 18ఏళ్ల వయస్సులోనే విశ్వవిజేతగా నిలిచాడు.
తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న అతి పిన్న వయష్కుడిగా గుకేశ్ నిలిచాడు. కాగా చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడాలని అనుకుంటున్న గుకేశ్ కోరిక ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.
విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గుకేశ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కార్ల్‌సన్‌తో పోరు అన్నింటికంటే పెద్ద సవాల్ అని... అతడిని ఓడిస్తే అసలైన చాంపియన్ అవుతారని గుకేశ్ వ్యాఖ్యానించాడు. అయితే కార్ల్‌సన్ పరోక్షంగా దీనిపై స్పందించాడు. నేరుగా గుకేశ్ పేరు చెప్పకపోయినా తనకు ఆసక్తి లేదని వెల్లడించాడు.
వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించనంటూ గతంలో స్వచ్ఛందంగా కిరీటాన్ని వదిలేసుకున్న కార్ల్‌సన్... "వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో గుకేశ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. గుకేశ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగాడు. కానీ ఈ చెస్ గేమ్‌లో గెలవడం అంత ఈజీ కాదు. గుకేశ్ విజేతగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమించాడు.
గేమ్‌పై తన పట్టుకోల్పోకుండా గుకేశ్ మంచి పోరాటపటిమ చూపించాడు. డింగ్ లిరెన్ కూడా బాగా ఆడాడు. కానీ చివరికి గుకేశ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే వచ్చే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై అందరూ అడుగుతున్నారు. గుకేశ్‌తో పోటీ పడే ఆలోచనే లేదు.
ఈ వరల్డ్ టైటిల్స్ సర్కస్‌లో నేను ఇకపై ఎక్కడా భాగం కాబోను" అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. అని తాజాగా వ్యాఖ్యానించాడు. దాంతో మున్ముందు గుకేశ్, కార్ల్‌సన్ మధ్య పోరు దాదాపు అసాధ్యం కావచ్చు!
Comments
Please login to add a commentAdd a comment