క్రీడల్లో ఆటగాళ్లు పొరపాటు చేయడం సహజమని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ తెలిపారు. అంత మాత్రాన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పోటీతత్వం, తీవ్రత లేవనే విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. సింగపూర్ సిటీ వేదికగా గురువారం ముగిసిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
చెస్ ఆట అంతమైందంటూ
భారత్‌కు చెందిన ఈ 18 ఏళ్ల టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ టోర్నీ పోటీలపై మాజీ ప్రపంచ చాంపియన్, రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ స్పందిస్తూ చెస్ ఆట అంతమైందని తీవ్ర పదజాలాన్ని వాడాడు. చెస్‌లో 14 రౌండ్ల పాటు జరిగిన గేముల్లో పోటాపోటీ కొరవడిందని, గట్టి పోటీ కనిపించనే లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
అతడివి పిల్లచేష్టలు.. ఏ ఆటలోనైనా సహజమే
అంతేకాదు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ వేసిన ఎత్తులు పిల్లచేష్టలుగా అభివర్ణించాడు. దీనిపై రష్యాకే చెందిన వొర్కొవిచ్ స్పందిస్తూ ‘క్రీడల్లో పొరపాట్లు చాలా సహజం. ఈ పొరపాట్లనేవి జరగకపోతే ఫుట్‌బాల్‌లో గోల్సే కావు.
ప్రతీ ఆటగాడు పొరపాట్లు చేస్తాడు. ఆ తప్పుల కోసమే ప్రత్యర్థి కాచుకొని ఉంటాడు. సరైన అవకాశం రాగానే అందిపుచ్చుకుంటాడు. ఇదంతా ఏ ఆటలోనైనా సహజమే. ప్రపంచ చెస్ టైటిల్ కోసం తలపడిన లిరెన్, గుకేశ్‌లకు అభినందనలు, టైటిల్ గెలిచిన గుకేశ్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.
ఇక వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మాగ్నస్ కార్ల్‌సన్ కూడా కొన్ని రౌండ్లు చూస్తే ప్రపంచ చెస్ టైటిల్ కోసం జరిగినట్లుగా తనకు అనిపించలేదని... ఏదో ఓపెన్ టోర్నీలోని గేములుగా కనిపించాయని అన్నారు.
పట్టించుకోవాల్సిన అవసరం లేదు
కానీ భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అంతా అయ్యాక ఇలాంటి విమర్శలు రావడం ఎక్కడైనా జరుగుతాయని, వీటిని గుకేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదని కొత్త చాంపియన్‌కు సూచించాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ కొత్త చరిత్ర లిఖించాడని హర్షం వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ సైతం వ్లాదిమిర్ క్రామ్నిక్, కార్ల్‌సన్ విమర్శలను కొట్టిపడేస్తూ గుకేశ్‌కు అండగా నిలవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment