
ప్రపంచ నంబర్‌వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు.
శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చేతిలో కంగుతిన్న కార్ల్‌సన్ ఆదివారం జరిగిన ‘రిటర్న్’ ఎనిమిదో రౌండ్‌లో అర్జున్‌నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్ రేసులో అతనొక్కడే నిలిచాడు.
చివరకు ఆఖరి రౌండ్ (9వ)లోనూ కార్ల్‌సన్... భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment