‘ర్యాపిడ్ కింగ్’ కార్ల్‌సన్
బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 15 రౌండ్‌లపాటు జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో కార్ల్‌సన్ 11.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కార్ల్‌సన్ బెర్లిన్‌లోనూ అదే జోరును కనబరిచాడు. 10.5 పాయింట్లతో ఇయాన్ నెపోమ్‌నియాచి (రష్యా), తెమౌర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లోనూ కార్ల్‌సన్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటే ఏకకాలంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ఈ ఘనత సాధించిన తొలి చెస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ (9.5 పాయింట్లు) 25వ స్థానంలో, విదిత్ సంతోషి గుజరాతి (9 పాయింట్లు) 26వ స్థానంలో, ఆదిబన్ (9 పాయింట్లు) 28వ స్థానంలో నిలిచారు. కృష్ణన్ శశికిరణ్ (8 పాయింట్లు), సేతురామన్ (7.5 పాయింట్లు), సూర్యశేఖర గంగూలీ (7 పాయింట్లు) వరుసగా 59వ, 86వ, 96వ ర్యాంక్‌లతో సరిపెట్టుకున్నారు.