ప్రపంచ చెస్ చాంపియన్ కార్లసన్
అనుకున్నంతా అయ్యింది. ఐదు సార్లు వరుసగా ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సాధించిన భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి తలవంచాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు.
ఒకప్పుడు చెస్ అంటే రష్యన్లదేనని భావన ఉండేది. అప్పట్లో గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పోవ్ దిగ్గజాల్లా ఉండి, వాళ్లే చెస్ కిరీటాలు సాధిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో మన దేశం నుంచి వెళ్లిన విశ్వనాథన్ ఆనంద్ వాళ్లిద్దరినీ మట్టికరిపించి, ప్రపంచ చెస్ విజేతగా నిలిచాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు.
తన ఆటతీరు పట్ల చాలా అసంతృప్తి చెందానని ఓటమి తర్వాత విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఆనంద్ ఎప్పటికీ చాలా గొప్ప ఆటగాడని, తనకు ఆయనంటే ఎంతో గౌరవమని కార్ల్సన్ అన్నాడు. అలాగే ఆయనపై విజయం సాధించడమంటే చాలా గౌరవప్రదంగాను, సంతోషంగాను భావిస్తున్నట్లు తెలిపాడు.