కార్ల్‌సెన్‌కు రూ. 9.90 కోట్లు
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవం సోమవారం జరిగింది. కొత్త చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే)కు రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని అందజేశారు. కేవలం 10 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత కార్ల్‌సెన్‌కు ఆలివ్ ఆకులతో కూడిన దండను మెడలో వేసి... బంగారు పూతతో కూడిన ట్రోఫీని, రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌నూ అందజేశారు.
అనంతరం రన్నరప్ విశ్వనాథన్ ఆనంద్‌కు వెండి పళ్లెంతోపాటు రూ. 6 కోట్ల 3 లక్షల ప్రైజ్‌మనీని బహూకరించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్‌జినవ్ వరుసగా కార్ల్‌సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్‌సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వైఫల్యం చెందినప్పటికీ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను తమ బ్రాండ్‌అంబాసిడర్‌గా కొనసాగిస్తామని ఐటీ శిక్షణ సంస్థ ‘నిట్’ స్పష్టం చేసింది.