ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటా
డిఫెండింగ్ చాంప్ కార్ల్‌సన్ అంగీకారం
చెన్నై: ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ పాల్గొనే విషయంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నవంబర్ 7 నుంచి 28 వరకు సోచి వేదికగా జరిగే ఈ పోటీలో పాల్గొనేందుకు నార్వే ఆటగాడు కార్ల్‌సన్ అంగీకారం తెలిపాడు. గత కొన్ని వారాలుగా ఈ 23 ఏళ్ల చెస్ మేధావి ఇక్కడ ఆడతాడా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది. ‘సెయింట్ లూయిస్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందం కలిగించింది. ఈ టోర్నీ తర్వాత ఇలాగే మరోసారి ఇస్తాను’ అని వరల్డ్ చాంపియన్‌షిప్ గురించి తెలుపుతూ కార్ల్‌సన్ ట్వీట్ చేశాడు. చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి కార్ల్‌సన్‌కు మొదట ఆగస్టు 31 వరకు గడువునివ్వగా గతవారం ఫిడే దీన్ని ఈనెల 7 వరకు పొడిగించింది.
ఉక్రెయిన్‌లో సంక్షోభ వాతావరణం, ప్రైజ్‌మనీని తగ్గించడం, ఈవెంట్ స్పాన్సర్ గురించి తెలియకపోవడం తదితర కారణాలతో కార్ల్‌సన్ ఈ టోర్నీలో పాల్గొనడంపై వెనుకాడాడు. ఒకేవేళ కార్ల్‌సన్... ఆనంద్‌తో బరిలోకి దిగకపోతే అతడి నుంచి నష్టపరిహారాన్ని రాబట్టడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో ద్వితీయ స్థానం సాధించిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ సెర్గీ కర్జాకిన్‌ను ఆడించాలని భావించారు. ‘నవంబర్‌లో ఆనంద్‌తో ఆడేందుకు కార్ల్‌సన్ అంగీకరించాడు. అతడు తన ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇది సరైన నిర్ణయం’ అని కార్ల్‌సన్ మేనేజర్ ఎస్పెన్ అగ్డెస్టెయిన్ చెప్పారు.