Sergey Karjakin
-
సంయుక్తంగా రెండో స్థానంలో ఆనంద్
ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ చివరిదైన తొమ్మిదో రౌండ్లో సెర్గీ కర్జాకిన్ (రష్యా)పై 32 ఎత్తుల్లో గెలిచాడు. ఆనంద్‌తోపాటు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), నకముర (అమెరికా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా ఐదు పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. -
కర్జాకిన్‌కు టైటిల్
ప్రపంచ కప్ చెస్ చాంపియన్‌షిప్ బాకు (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ సెర్గీ కర్జాకిన్ విజేతగా నిలిచాడు. తన దేశానికే చెందిన పీటర్ స్విద్లెర్తో జరిగిన ఫైనల్లో కర్జాకిన్ 6-4 స్కోరుతో విజయం సాధించాడు. నిర్ణీత నాలుగు క్లాసిక్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2-2తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ర్యాపిడ్ పద్ధతిలో నాలుగు గేమ్‌లు నిర్వహించగా ఇద్దరూ చెరో రెండింటిలో గెలుపొందడంతో స్కోరు 4-4తో సమమైంది. ఈసారి బ్లిట్జ్ పద్ధతిలో రెండు గేమ్‌లు నిర్వహించగా... రెండింటిలో కర్జాకిన్ నెగ్గి విజేతగా అవతరించాడు. కర్జాకిన్‌కు లక్షా 20 వేల డాలర్లు (రూ. 78 లక్షల 46 వేలు), రన్నరప్ స్విద్లెర్కు 80 వేల డాలర్లు (రూ. 52 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీ ద్వారా కర్జాకిన్తోపాటు స్విద్లెర్ వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. క్యాండిడేట్స్ టోర్నీకి ఇప్పటికే విశ్వనాథన్ ఆనంద్ (భారత్), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), ఫాబియానో, హికారు నకముర (అమెరికా) కూడా అర్హత పొందారు. ఈ ఏడాది ముగిసేలోపు అత్యుత్తమ రేటింగ్ ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొంటారు. క్యాండిడేట్స్ టోర్నీ విజేతతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తలపడతాడు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటా
డిఫెండింగ్ చాంప్ కార్ల్సన్ అంగీకారం చెన్నై: ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ పాల్గొనే విషయంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నవంబర్ 7 నుంచి 28 వరకు సోచి వేదికగా జరిగే ఈ పోటీలో పాల్గొనేందుకు నార్వే ఆటగాడు కార్ల్సన్ అంగీకారం తెలిపాడు. గత కొన్ని వారాలుగా ఈ 23 ఏళ్ల చెస్ మేధావి ఇక్కడ ఆడతాడా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది. ‘సెయింట్ లూయిస్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందం కలిగించింది. ఈ టోర్నీ తర్వాత ఇలాగే మరోసారి ఇస్తాను’ అని వరల్డ్ చాంపియన్‌షిప్ గురించి తెలుపుతూ కార్ల్సన్ ట్వీట్ చేశాడు. చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి కార్ల్‌సన్‌కు మొదట ఆగస్టు 31 వరకు గడువునివ్వగా గతవారం ఫిడే దీన్ని ఈనెల 7 వరకు పొడిగించింది. ఉక్రెయిన్‌లో సంక్షోభ వాతావరణం, ప్రైజ్‌మనీని తగ్గించడం, ఈవెంట్ స్పాన్సర్ గురించి తెలియకపోవడం తదితర కారణాలతో కార్ల్సన్ ఈ టోర్నీలో పాల్గొనడంపై వెనుకాడాడు. ఒకేవేళ కార్ల్సన్... ఆనంద్‌తో బరిలోకి దిగకపోతే అతడి నుంచి నష్టపరిహారాన్ని రాబట్టడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నమెంట్లో ద్వితీయ స్థానం సాధించిన రష్యన్ గ్రాండ్‌మాస్టర్ సెర్గీ కర్జాకిన్‌ను ఆడించాలని భావించారు. ‘నవంబర్‌లో ఆనంద్‌తో ఆడేందుకు కార్ల్సన్ అంగీకరించాడు. అతడు తన ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను కాపాడుకోవాలని అనుకుంటున్నాడు. ఇది సరైన నిర్ణయం’ అని కార్ల్సన్ మేనేజర్ ఎస్పెన్ అగ్డెస్టెయిన్ చెప్పారు. -
ఆనంద్ ‘హ్యాట్రిక్’ డ్రా
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మాన్సిస్క్ (రష్యా): భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో వరుసగా మూడో డ్రా ఫలితం ఎదురైంది. అయినప్పటికీ ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ నాలుగు పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రష్యా ఆటగాడు సెర్గెయ్ కర్జాకిన్ (2.5)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ డ్రాగా ముగించుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు దీటుగా స్పందించడంతో ఆనంద్ ఎత్తులు పారలేదు. చివరకు 33 ఎత్తుల్లో గేమ్ డ్రా అయింది. మిగతా మ్యాచ్‌ల్లో తొపలోవ్ (బల్గేరియా-3)... క్రామ్నిక్ (రష్యా-3)పై గెలుపొందగా, మమెద్యరోవ్ (అజర్బైజాన్-3)... స్విడ్లెర్ (రష్యా-3)ను కంగుతినిపించాడు. అరోనియన్ (ఆర్మేనియా-3.5)... అండ్రెకిన్ (రష్యా-2)తో డ్రా చేసుకున్నాడు.