Norway Open international chess tournament
-
Norway Chess: ఆనంద్ అదరహో
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ఆనంద్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్‌సన్‌పై ఆనంద్ విజయం సాధించాడు. క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్‌కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్‌ను గెలిచినట్లు ప్రకటిస్తారు. రెగ్యులర్ గేమ్‌లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్‌లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్సన్తో అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్‌లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్‌లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్‌లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్సన్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
ఆనంద్ ఖాతాలో మరో ‘డ్రా’
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో ఆదివారం మమెదైరోవ్ (అజర్బైజాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. -
హరికృష్ణకు ఏడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లు సంపాదించాడు. ప్రపంచ ఏడో ర్యాంకర్ అరోనియన్ (అర్మేనియా)తో చివరిదైన తొమ్మిదో రౌండ్లో తలపడిన హరికృష్ణ 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఆరు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. -
హరికృష్ణ ఓటమి
నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు రెండో పరాజయం ఎదురైంది. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 47 ఎత్తుల్లో ఓడిపోయాడు. -
హరికృష్ణ సంచలనం
స్టావెంజర్ (నార్వే): నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 36 ఎత్తుల్లో విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), తొపలోవ్ (బల్గేరియా), అరోనియన్ (అర్మేనియా), మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)లాంటి మేటి గ్రాండ్‌మాస్టర్లు ఈ టోర్నీ బరిలో ఉన్నారు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 3.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా హరికృష్ణ ఆరు గేమ్‌లు ఆడి మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయాడు.