రన్నరప్‌ హంపి | Monaco Grand Prix Chess Tourney Runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ హంపి

Published Sun, Dec 15 2019 5:28 AM | Last Updated on Sun, Dec 15 2019 5:28 AM

Monaco Grand Prix Chess Tourney Runner-up - Sakshi

మోంటెకార్లో: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి చెస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా), అలెగ్జాండ్రా గొర్యాచికినా (రష్యా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టోర్నీ టైబ్రేక్‌ నిబంధనల ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కొస్టెనిక్‌ విజేతగా నిలిచింది.  హంపి రన్నరప్‌గా నిలువగా... గొర్యాచికినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.  శనివారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ గేమ్‌లో గొర్యాచికినాపై హంపి 68 ఎత్తుల్లో గెలిచింది.

అంతకుముందు వాలెంటినా గునీనా (రష్యా), మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), జావో జుయ్‌ (చైనా)లపై కూడా నెగ్గిన హంపి... హారిక (భారత్‌), నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌), కాటరీనా లాగ్నో (రష్యా), కొస్టెనిక్‌ (రష్యా), పియా క్రామ్లింగ్‌ (స్వీడన్‌)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎలిజబెత్‌ పాట్జ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడింది.  హారిక 11 గేములు ఆడి మూడింటిలో (ఎలిజబెత్, గునీనా, మరియాలపై) విజయం సాధించింది. నానా జాగ్‌నిద్జె, పియా క్రామ్లింగ్, అనా ముజిచుక్, హంపి, లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక... గొర్యాచికినా, కొస్టెనిక్, జావో జుయ్‌లతో జరిగిన మూడు గేముల్లో ఓడిపోయింది.

నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌ టోర్నమెంట్‌లలో భాగంగా రెండు టోర్నీలు ముగిశాక హంపి మొత్తం 293 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో జరిగిన తొలి గ్రాండ్‌ప్రి టోర్నీలో హంపి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ప్రి సిరీస్‌లో మొత్తం 15 మంది క్రీడాకారిణులు గరిష్టంగా మూడు టోర్నీల్లో ఆడతారు. ఇప్పటికే రెండు టోర్నీలు ఆడిన హంపి వచ్చే ఏడాది మే నెలలో ఇటలీలో జరిగే చివరిదైన నాలుగో గ్రాండ్‌ప్రి టోర్నీలో పాల్గొంటుంది. హారిక మాత్రం వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్‌లో జరిగే మూడో గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆడుతుంది. ప్రస్తుతం హారిక 120 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉంది. టాప్‌–2లో నిలిచిన వారు క్యాండిడేట్‌ చెస్‌ టోర్నీకి అర్హత సాధిస్తారు. క్యాండిడేట్‌ టోర్నీ విజేత ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్‌తో 12 గేమ్‌లు ఆడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement