చెన్నై: తమిళనాడు కుర్రాడు డి.గుకేశ్ పన్నెండేళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాతో రికార్డులకెక్కాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. తన రాష్ట్ర సహచరుడు ఆర్.ప్రజ్ఞానంద జూన్‌లో సాధించిన రికార్డు (12 ఏళ్ల 10 నెలల వయసులో)ను ఏడాది తిరగకుండానే చెరిపేశాడు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో మంగళవారం తొమ్మిదో రౌండ్లో డి.కె.శర్మను ఓడించడం ద్వారా గుకేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందాడు.
మొత్తం మీద భారత చదరంగ క్రీడాకారుల్లో అతను 59వ జీఎం. 2002లో ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ కర్యాకిన్ 12 ఏళ్ల ఏడు నెలల వయసులో సాధించిన జీఎం ఘనత ప్రపంచ అతిపిన్న రికార్డు కాగా, గుకేశ్ కేవలం 17 రోజుల తేడాతో ఆ రికార్డుకు దూరమయ్యాడు. నిజానికి గత నెలలోనే గుకేశ్‌కు ‘ప్రపంచ రికార్డు’ అవకాశం వచ్చినా... తృటిలో చేజార్చుకున్నాడు. డిసెంబర్‌లో జరిగిన బార్సిలోనా టోర్నీలో అతను మూడో రౌండ్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ డానియెల వొకటురో (ఇటలీ) చేతిలో ఓడిపోవడంతో మూడో జీఎం నార్మ్‌తో పాటు ‘ప్రపంచ అతిపిన్న’ ఘనత చేజారింది. తిరిగి నెల వ్యవధిలోనే తమిళ తంబి తన ఎత్తులకు పదును పెట్టాడు.
తల్లిదండ్రులతో ఆడుతూనే...
ఎత్తులు–పైఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న ఈ చిచ్చర పిడుగు ‘చెస్’ నేపథ్యం కేవలం ఓ ‘ఆటవిడుపు’గా మొదలైంది. గుకేశ్ తల్లి పద్మ, తండ్రి రజినీకాంత్ ఇద్దరూ వైద్యులే. వాళ్లిద్దరు ఇంట్లో ఆడుతుంటే చూసిన చిన్నారి గుకేశ్ సరదాగా ఎత్తులు వేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో దీటుగా పోటీపడ్డాడు. అతని ఎత్తులకు, ఓర్పుగా దెబ్బతీసే పైఎత్తులకు వాళ్లిద్దరూ అబ్బురపడేవారు. అతని ఆసక్తిని ఆటవిడుపుకే పరిమితం కాకుడదని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారిని చెస్ అకాడమీలో చేర్పించారు. ఇక అక్కడ్నుంచి ఆట కాస్త చెస్ బాట అయ్యింది.
ఇక ఆనంద్ సర్‌తో ఆడతా
చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్‌మాస్టరైనందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. మూడో జీఎం నార్మ్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కింది. ఇక విశ్వనాథన్ ఆనంద్ సర్‌తో తలపడాలనుకుంటున్నా. ఈ గేమ్ (9వరౌండ్)కు ముందు నేనేమీ ఒత్తిడిని ఎదుర్కోలేదు. అయితే ఆటమధ్యలో కాస్త ఎదురైనప్పటికీ ఆటపైనే దృష్టిపెట్టి ముందడుగు వేశాను. స్పెయిన్ (బార్సిలోనా)లోనే కర్యాకిన్ రికార్డును చెరిపేసే అవకాశం చేజార్చినందుకు నిరాశగా ఉంది. ఆ తర్వాత ముంబై టోర్నీలోను సాంకేతిక కారణాల వల్ల ప్రపంచ రికార్డును కోల్పోయాను’
– గుకేశ్
Comments
Please login to add a commentAdd a comment