
హారికకు కాంస్య పతకం
లింజెన్ (జర్మనీ): లెవ్ గుట్‌మన్ జూబ్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకాన్ని సాధించింది. బుధవారం ముగిసిన ఈ తొమ్మిది రౌండ్ల టోర్నమెంట్‌లో హారిక ఐదు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లతోపాటు ఫిడే మాస్టర్ (ఎఫ్‌ఎం), ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) పాల్గొన్న ఈ టోర్నీలో హారిక రెండు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది.
హారికతోపాటు హెమన్ (జర్మనీ), అలెగ్జాండర్ (రష్యా), విక్టర్ (ఇజ్రాయెల్) కూడా ఐదు పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హారికకు మూడో స్థానం ఖాయమైంది. ఆరు పాయింట్లతో స్టెలియోస్ (గ్రీస్), అలోన్ గ్రీన్‌ఫెల్డ్ (ఇజ్రాయెల్) సంయుక్త విజేతలుగా నిలిచారు.