సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: ప్రపంచ మహిళల చెస్ మాజీ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ సుసాన్ పోల్గర్ ఫౌండేషన్ (ఎస్‌పీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఆన్‌లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి నూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది. ప్రస్తుతం మహిళా అంతర్జాతీయ మాస్టర్ (డబ్ల్యూఐఎం) హోదా కలిగిన ఈ విజయవాడ అమ్మాయి అర్మేనియా అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) అనా సార్గిసియాన్‌తో జరిగిన అర్మగెడాన్ గేమ్‌లో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేత హోదాలో 18 ఏళ్ల ప్రియాంకకు అమెరికాలోని వెబ్‌స్టెర్ యూనివర్సిటీకి చెందిన 60 వేల డాలర్ల స్కాలర్‌షిప్ లభించింది. 600 డాలర్ల ప్రైజ్‌మనీ గెల్చుకోవడంతోపాటు ఈ ఏడాది అమెరికాలోనే జరిగే స్పైస్ కప్ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. చిరుప్రాయం నుంచే చెస్‌లో రాటుదేలిన ప్రియాంక గతంలో అండర్–10 బాలికల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అండర్–9, అండర్–11, అండర్–13 విభాగంలో జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్స్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment